Revanth Reddy : తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. అమిత్ షా, కేసీఆర్ కామన్ ప్లాన్ అర్థం చేసుకోవాలని సూచన

ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను మోడీ, కేసీఆర్ లు తమ రాజకీయాలకు పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు... ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా? అంటూ ప్రశ్నించారు.

Revanth Reddy open letter

Revanth Reddy open letter  : తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను సైతం ప్రధాని మోదీ, కేసీఆర్ తమ రాజకీయాలకు పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీల్లో చేరిన వాళ్లు పవిత్రులు.. ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా? అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని, ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ అంటూ ఆరోపించారు. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి? కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుండి అందుతున్నాయని ప్రశ్నించారు.

Also Read : మోదీని కాపాడేందుకు కేసీఆర్ యత్నాలు.. అమిత్ షా వల్లే చంద్రబాబుకు బెయిల్ : నారాయణ

కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్ది.. ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయని అన్నారు. అమిత్ షా, కేసీఆర్ కలిసి పక్కా ప్లాన్ వేయటం.. దానికి మంత్రి పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి అమలు చేయడం జరుగుతోందన్నారు. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే.. వీళ్ల కుట్రలకు ప్లాన్ వేస్తున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవన్నారు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్ ను ప్రశ్నించవు కానీ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపైనా.. తాజాగా వివేక్ వెంకట స్వామి ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారని ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతోందన్నారు. వారి పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు.. కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై కూడా ఉందన్నారు.

Also Read :  బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి గద్వాల్ జిల్లా సీనియర్ నేత

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పతనం మొదలైందని.. ఇకపై మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లిందని హెచ్చరించారు. వారి కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయన్నారు. వివేక్ వెంకట స్వామి కుటుంబంపై దాడి కాంగ్రెస్ పార్టీపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. దాడులు జరిగిన వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా ఈ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్సే అన్నారు. వీటిని ఎవ్వరు ఆపలేరని రేవంత్ రెడ్డి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు