Ganesh Nimajjanam 2022 : గణేశ్ నిమజ్జనం కోసం ప్రధాన శోభాయాత్ర జరిగే మార్గాన్ని పోలీసులు విడుదల చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఊరేగింపు మార్గాలు, ఇతర వాహనాలు వెళ్లేందుకుగాను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా మార్గాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ఇతర వాహనాలను అనుమతించరు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన లారీలను శుక్రవారం ఉదయం నుంచి 24 గంటల పాటు నగరంలోకి రానివ్వరు. ఇక రాజధానిలో గణేశ్ సామూహిక నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
పోలీసు శాఖ తాత్కాలిక కంట్రోల్ రూములు ఏర్పాటు చేయగా, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు భక్తులు, సందర్శకులకు అనుకూలంగా ఉండేలా తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే హుస్సేన్ సాగర్ సహా గ్రేటర్ పరిధిలోని చెరువులు, కొలనులు, బేబీ పాండ్ల వద్ద మొత్తం 280 క్రేన్లు అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ లో రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర ఉదయం 10గంటలకు మొదలవుతుందన్నారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందన్నారు.
వినాయక నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈసారి హుస్సేన్ సాగర్ లో 20వేల విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. శోభాయాత్ర సందర్భంగా 3వేల మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు.
”గణేశ్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నాం. శుక్రవారం ఉదయం నుంచి వినాయక నిమజ్జనం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. శోభాయాత్ర సజావుగా సాగేలా ప్రణాళిక సిద్ధం చేశాం. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆ లోగా గణేశ్ నిమజ్జనం ముగుస్తుంది” అని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ సీపీ విజ్ఞప్తి చేశారు. హుస్సేన్ సాగర్ లో శుక్రవారం రోజున దాదాపు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. 3 వేల మందికిపైగా ట్రాఫిక్ సిబ్బందిని మోహరించామని.. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
”ట్యాంక్ బండ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీదుగా ప్రయాణించే సాధారణ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటికే సూచించాం. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశాం. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ముగుస్తుంది” అని ట్రాఫిక్ సీపీ రంగనాథ్ వెల్లడించారు.
గణేశ్ నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసు శాఖ ఆదేశించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపరాదని పోలీసులు తేల్చి చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.