hyderabad - vijayawada highway
Traffic Restrictions: హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం వెళ్లే వాహనదారులకు, ప్రయాణీకులకు బిగ్ అలర్ట్. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆ రూట్లలో వాహనాలను మళ్లించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఐదు రోజుల పాటు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇంతకీ.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించడానికి కారణం ఏమిటంటే.. నల్గొండ జిల్లా పరిధిలోని దూరాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతర (పెద్దగట్టు జాతర) ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది. మేడారం తరువాత ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే రెండో అతిపెద్ద జాతర ఇదే.
యాదవుల ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న ఈ లింగమంతుల జాతరను రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. మాఘమాసంలో తొలి ఆదివారం ప్రారంభమై ఐదు రోజుల పాటు జాతర వైభవంగా కొనసాగుతుంది. దీంతో ఇవాళ్టి (16వ తేదీ) నుంచి 20వ తేదీ వరకు జాతర జరగనుంది. లింగా.. ఓ లింగా అంటూ శివ నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగిపోనుంది.
Also Read: Ration Card: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉగాది నుంచి..
పెద్దగట్టు జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచేకాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, ఒడిశా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈసారి ఈ జాతరకు 20లక్షలకుపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టెను తీసుకురావడంతో లింగమంతుల స్వామి జాతర ప్రారంభమవుతుంది. ఐదోరోజు ఊరేగింపుతో దేవరపెట్టెను కేసారానికి తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది. అక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంలోని బైకాన్ల ఇళ్లలో దేవరపెట్టెను భద్రపరుస్తారు.
వాహనాల మళ్లింపు ఇలా..
♦ పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జాము నుంచి వాహనాల మళ్లింపునకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది.
♦ ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు పెద్దగట్టు జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
♦ జాతర రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
♦ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి వద్ద మళ్లించి నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా విజయవాడకు పంపిస్తారు.
♦ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజూర్ నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్ పల్లి మీదుగా పంపిస్తారు.
♦ హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365 మీదుగా మళ్లించమన్నారు.
♦ కోదాడ నుంచి సూర్యాపేటకు వెళ్లే వాహనాలు కోదాడ, మునగాల, గుంపుల మీదుగా ఎస్సారెస్పీ కెనాల్ నుంచి బీబీగూడెం వద్ద నుంచి సూర్యాపేటకు వస్తాయి.
♦ సూర్యాపేట నుంచి కోదాడ వెళ్లే వాహనాలు ఐలాపురం వద్ద గల ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాఘవపురం స్టేజీ నుంచి నామవరం గ్రామం మీదుగా జాతీయ రహదారి-65పై గుంజిలూరు స్టేజీ వరకు మళ్లించి.. కోదాడ, విజయవాడ వైపు పంపిస్తారు.