Pesticide In Cool Drink Bottle : తీవ్ర విషాదం.. కూల్ డ్రింక్ అనుకుని పురుగుమందు తాగిన ఐదేళ్ల చిన్నారి

కూల్ డ్రింక్ అనుకుని ఐదేళ్ల చిన్నారి పురుగు మందు తాగి చనిపోయింది. పొలానికి పిచికారీ చేయగా మిగిలిన పురుగుల మందును కూల్‌డ్రింక్ బాటిల్‌లో నింపి ఉంచారు. ఈ విషయం తెలియని శాన్వి.. అది కూల్‌డ్రింకే అనుకుని తాగేసింది.

Pesticide In Cool Drink Bottle : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ అనుకుని ఐదేళ్ల చిన్నారి పురుగు మందు తాగి చనిపోయింది. భీంపూర్ గ్రామానికి చెందిన రాజేష్‌, లావణ్యల దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు. ఐదేళ్ల కూతురు శాన్వి.. గుండి గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతోంది. ఆదివారం సెలవు కావటంతో.. తన పెద్దనాన్న ఇంటి దగ్గర ఆడుకుంటోంది. ఆ సమయంలో తనకు ఓ కూల్‌డ్రింక్ బాటిల్ కనిపించింది. నిజానికి అది కూల్ డ్రింక్ కాదు. పొలానికి పిచికారీ చేయగా మిగిలిన పురుగుల మందును కూల్‌డ్రింక్ బాటిల్‌లో నింపి ఉంచారు. ఈ విషయం తెలియని శాన్వి.. అది కూల్‌డ్రింకే అనుకుని తాగేసింది.

ఆ తర్వాత వాంతులు చేసుకుంటూ ఇంటికి వెళ్లింది. పాపను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. తీరా.. వాసన పసికట్టిన తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వెంటనే కాగజ్ నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది‌. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు విగతజీవిగా మారటం చూసి.. ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. విషయం తెలిసిన వారంతా అయ్యో పాపం అని కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందని వాపోతున్నారు.

కాగా.. ఈ ఘటనకు కారణం.. చిన్నారి అమాయకత్వంతో పాటు ఆ పెద్దల నిర్లక్ష్యం కూడా. హానికరమైన ద్రావణాలు కూల్‌డ్రింక్ బాటిల్స్ లో లేదా వాటర్ బాటిల్స్ లో నింపి ఉంచినప్పుడు వాటిని జాగ్రత్తగా దాచి ఉంచటం అత్యంత అవశ్యకం. అందులోనూ.. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాంటి బాటిళ్లు ఏమైనా ఉంటే పిల్లలకు దొరక్కుండా దాచిపెట్టాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం శూన్యం. సో.. తల్లిదండ్రులూ.. బీ కేర్ ఫుల్.. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి.