పెళ్లిరోజు షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. పిల్లల గొంతు నులిమి.. తరువాత ఫ్యాన్‌కు ఉరి..

Hyderabad : హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త పెళ్లిరోజు షాపింగ్‌కు తీసుకెళ్లలేదని మనస్థాపానికి గురైన ఓ గృహిణి దారుణానికి పాల్పడింది.

Tragedy incident in Borabanda area Hyderabad city

  • హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో విషాదం
  • పెళ్లిరోజున షాపింగ్‌కు తీసుకెళ్లలేదని దారుణానికి పాల్పడ్డ గృహిణి
  • ఇద్దరు పిల్లల గొంతు నులిమి.. ఉరేసుకొని ఆత్మహత్య
  • తల్లి, కొడుకు మృతి.. చికిత్స పొందుతున్న కుమార్తె

Hyderabad : హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త పెళ్లిరోజు షాపింగ్‌కు తీసుకెళ్లలేదని మనస్థాపానికి గురైన ఓ గృహిణి దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి.. వారు స్పృహ కోల్పోయిన తరువాత తాను ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటన నగరంలోని బోరబండ పరిధిలోని పెద్దమ్మనగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Also Read : Rain Alert : రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలేవానలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు

కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన మురళి వేణు కుటుంబం గత కొన్నేళ్లుగా పెద్దమ్మనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. మురళి విద్యుత్ శాఖలో లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఏడేళ్ల క్రితం సత్యవేణి (30)తో వివాహమైంది. వారికి కుమారుడు రుద్రాన్ష్ (5), కూతురు ధన్విక (2) ఉన్నారు. మురళి తల్లిదండ్రులుకూడా అతనితోనే ఉంటున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతుండేవి.

శుక్రవారం మురళి, సత్యవేణి పెండ్లిరోజు. దీంతో పిల్లలను తీసుకొని షాపింగ్‌కు వెళ్లొద్దామని భర్తను సత్యవేణి కోరింది. అయితే, అదేరోజు తండ్రి సత్యనారాయణను డయాలసిస్ చేయించేందుకు తీసుకెవెళ్లాల్సి రావడంతో మరోసారి వెళదామని సత్యవేణికి నచ్చజెప్పాడు. ఆ తరువాత మురళి ఈఎస్ఐ ఆస్పత్రికి తన తండ్రిని తీసుకెళ్లాడు. మురళి తల్లి మంగాదేవి డ్యూటీ చేసేందుకు వెళ్లింది. అయితే, తన కోరికను భర్త కాదన్నాడని మనస్థాపానికి గురైన సత్యవేణి దారుణానికి ఒడిగట్టింది.

ఇద్దరు పిల్లలను రూంలోకి తీసుకెళ్లి గడియపెట్టింది. టీవీ సౌండ్ పెద్దగా పెట్టింది. ఆ తరువాత ఇద్దరు పిల్లలను గొంతు నులిమింది. వారు స్పృహ కోల్పోవడంతో ఆ తరువాత సత్యవేణి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మురళి తల్లి మంగాదేవి ఇంటికొచ్చిన తరువాత ఎంతసేపు తలపులు కొట్టినా ఎవరూ తీయలేదు. కిటికీలో నుంచి చూడగా.. సత్యవేణి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించింది. దీంతో కన్నీరుమున్నీరవుతూ మురళి ఫోన్ చేసింది. ఇదే సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చింది.

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు బలవంతంగా డోర్ తీశారు. సత్యవేణి, రుద్రాన్ చనిపోయినట్లు గుర్తించారు. కొనఊపిరితో ఉన్న ధ్వనికను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, సత్యవేణి ఆత్మహత్యకు భర్త, ఆమె అత్తమామలే కారణమని మృతురాలి వదిన బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.