భర్తతో విడిపోవడానికి అడ్డంగా ఉన్నాడని భావించి.. ఆ తల్లి 52 రోజుల పసికందుని దారుణంగా..

సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 52రోజుల పసికందును సొంత తల్లే చంపేసింది.

Tragic incident in Siddipet district

Siddipet: సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 52రోజుల పసికందును సొంత తల్లే చంపేసింది. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పసికందును పడేసి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి పసికందుకోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, తల్లి చెప్పిన విషయాలకు, జరిగిన ఘటనకు పొంతన లేకపోవటంతో ఆమెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: Corona Case: తెలంగాణలో తొలి కరోనా కేసు.. హైదరాబాద్ డాక్టర్ కు కోవిడ్ పాజిటివ్..

పూర్తి వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట రూరల్ మండలం పుల్లూరుకు చెందిన శ్రీమాన్, నంగునూరు మండలం నర్మెటకు చెందిన కవిత మూడేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. శ్రీమాన్ రెండు చోరీ కేసుల్లో జైలుకెళ్లి వచ్చాడు. దీంతో గ్రామంలో పరువు పోయిందని భావించి కొద్దిరోజుల క్రితం తన అమ్మమ్మ ఊరైన దుబ్బాక మండలం అప్పనపల్లికి షిప్ట్ అయ్యారు. అయితే, భర్త ప్రవర్తన, వ్యవహార శైలి నచ్చని కవిత.. అతడి నుంచి విడిపోయేందుకు నిర్ణయించుకుంది.

శ్రీమాన్, కవిత దంపతులకు దీక్షిత్ (52రోజుల పసికందు) ఉన్నాడు. భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న కవిత దారుణానికి ఒడిగట్టింది. భర్తతో విడిపోవాలంటే పసికందు అడ్డుగా ఉన్నాడని భావించిన కవిత.. పసికందును గ్రామ శివారులోని పాడుబడిన వ్యవసాయ భావిలో పడేసి వెళ్లిపోయింది. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకొచ్చి తన బిడ్డను ఎత్తుకెళ్లారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పసికందుకోసం గాలింపు చేపట్టారు.

కవిత చెప్పిన విషయాలకు, జరిగిన ఘటనకు పొంతనలేకపోవటంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తానే బావిలో పడేసినట్లు ఒప్పుకుంది. భర్త ఫిర్యాదుతో కవితను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు తెలిపారు.