Corona Case: తెలంగాణలో తొలి కరోనా కేసు.. హైదరాబాద్ డాక్టర్ కు కోవిడ్ పాజిటివ్..

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

Corona Case: తెలంగాణలో తొలి కరోనా కేసు.. హైదరాబాద్ డాక్టర్ కు కోవిడ్ పాజిటివ్..

CORONA

Updated On : May 23, 2025 / 7:12 PM IST

Corona Case: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. భారత్ లో పంజా విసురుతోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కరోనా కేసులు వెలుగుచూశాయి.

తాజాగా తెలంగాణలోనూ తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ డాక్టర్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా కేసు నమోదవడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా 247 కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడులో కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో విశాఖ, కడప జిల్లాలలో కరోనా కేసులు బయటపడ్డాయి.

Also Read: ఏపీలో కొత్త రకం కరోనా… తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం..

కరోనాను ఎదుర్కొనేందుకు గాంధీ హాస్పిటల్ సిద్ధమైంది. గాంధీ హాస్పిటల్ లో 50 బెడ్స్ తో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జనరల్ ఫిజీషియన్, పనమనాలజీ, మైక్రో బయాలజీ, అనస్తీషియా డాక్టర్స్, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ తో కమిటీ ఏర్పాటు చేశారు అధికారులు. రేపు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ అధ్యక్షతన సమావేశం కానుంది కోవిడ్ కమిటీ. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్స్ కమిటీ చర్చించనుంది.

కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, వేడుకలు, పార్టీలు, ఇతర సామూహిక కార్యక్రమాలను వీలైనంతవరకు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించింది.

రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులు వంటి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా జనం ఎక్కువగా ఉండే చోట మాస్కులు ధరించడం తప్పనిసరని పేర్కొంది. జ్వరం, చలి, దగ్గు, తీవ్రమైన అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన తెలియకపోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.