Corona Virus: ఏపీలో కొత్త రకం కరోనా… తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం..
ఏపీలోనూ కొవిడ్ కేసు నమోదైంది. విశాఖపట్టణం మద్దిలపాలెం యూపీహెచ్ సీ పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు పాజిటివ్ నిర్దారణ అయింది.

Corona Virus
Corona Virus: కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. దేశంలో కొవిడ్ కేసులు సంఖ్య వేగంగా పెరుగుతోంది. సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన దేశంలోనూ కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఏపీలో ఓ కొవిడ్ కేసు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు.
కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో ఇప్పటి వరకు 182 కేసులు నమోదయ్యాయి. కేరళలోని కొట్టాయంలో అత్యధికంగా 57 కేసులు, ఎర్నాకుళలంలో 34, తిరువనంతపురంలో 30, ఇతర జిల్లాల్లో మిగిలిన కేసులు రికార్డ్ అయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరీక్షలను పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆర్టీపీసీఆర్ కిట్ లు, మాస్కులు అందుబాటులో ఉంచుకోవాలని ఆస్పత్రులకు ప్రభుత్వం సూచించింది.
గుజరాత్ రాష్ట్రంలోనూ కొవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 15 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 13 కేసులను అహ్మదాబాద్ లోనే గుర్తించారు. బాధితులు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతున్నారు. తాజా వేరియంట్ అంత తీవ్రమైనది కానందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజారోగ్యశాఖ అదనపు డైరెక్టర్ తెలిపారు.
మే నెలలో ముంబైలో 95 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. జనవరి నుండి రాష్ట్రంలో మొత్తం 106 తో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. 22 శాతం ఇళ్లలో ఒకరు లేదా ఇద్దరు వైరల్ ఫివర్ లేదా కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది.
ఏపీలోనూ కొవిడ్ కేసు నమోదైంది. విశాఖపట్టణం మద్దిలపాలెం యూపీహెచ్ సీ పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు పాజిటివ్ నిర్దారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముందుగా మలేరియా, డెంగ్యూ అని భావించి వైద్య పరీక్షలు చేయగా.. చివరకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీలో కోవిడ్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. కోవిడ్ పాజిటివ్ కేస్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో మూడు టీంలతో ఇంటింటికీ సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కరోనా మార్గదర్శకాలను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని తెలిపింది.
దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ ఆస్పత్రిలో 30 పడకల కొవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. కాగా, JN.1 వేరియంట్ లక్షణాలు సాధారణంగా తేలికపాటివిగా ఉంటున్నాయి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అలసట వంటివి ప్రధాన లక్షణాలు. చాలా కేసుల్లో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.