Trainee IPS Uday Krishna Reddy: అంతా నాటకమే?.. ట్రైనీ ఐపీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. డాక్టర్ల రిపోర్టులో విస్తుపోయే నిజాలు
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Trainee IPS Uday Krishna Reddy)వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- V Santhosh Kumar
- Updated on- July 21, 2026 / 12:58 PM IST
Trainee ips officer uday krishna reddy suicide attempt case takes new turn
- ట్రైనీ ఐపీఎస్ కేసులో ట్విస్ట్
- ఆత్మహత్యాయత్నం నాటకమని తేల్చిన డాక్టర్లు
- పోలీసుల విచారణలో ఫోన్ స్వాధీనం
Trainee IPS Uday Krishna Reddy: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించడంతో పాటు, ప్రైవేట్ వీడియోలు ఆమె భర్తకు పంపిస్తానని బెదిరించినట్లు కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురైన ఆయన, తాను ఏ పాపం చేయలేదంటూ సోమవారం ఆత్మహత్యాయత్నం చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
Also Read: నేడే ‘బల్కంపేట ఎల్లమ్మ’ కళ్యాణం.. భారీ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లో అస్సలు వెళ్ళకండి
డాక్టర్ల పరీక్షల్లో నిజాలు వెల్లడి:
సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే ప్రచారంతో ఉదయ్ కృష్ణారెడ్డి(Trainee IPS Uday Krishna Reddy)ని కుటుంబ సభ్యులు ఎస్సార్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు, రక్తంలో ఎలాంటి విషపదార్థాలు లేవని స్పష్టం చేశారు. కేవలం సానుభూతి పొందడం కోసమే ఫూటుగా మద్యం సేవించి ఈ నాటకానికి తెరలేపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మద్యం మత్తులోనే ఆయన సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పోలీసుల సీరియస్ విచారణ:
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసి, పట్టుదలతో ఐపీఎస్‌గా ఎంపికై వార్తల్లో నిలిచారు. అయితే సదరు మహిళా ఐపీఎస్‌తో తనకు ఏడాదిగా రిలేషన్ ఉందని, కక్షతోనే తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం జాతీయ పోలీస్ అకాడమీ (NPA) అధికారులు అంతర్గత విచారణ జరుపుతుండగా, అత్తాపూర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు కృష్ణారెడ్డి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని లోతుగా విచారిస్తున్నారు.
