Etela Rajender : ఈటల ఇలాకాలో హరీష్ రావు

హుజురాబాద్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈటల ఎపిసోడ్‌ తర్వాత.. రంగంలోకి దిగిన అధిష్టానం పెద్దలు పార్టీ శ్రేణులను కారు దిగకుండా వ్యూహాలు రచిస్తున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీశ్‌రావును రంగంలోకి దింపింది. ఈటల ఇలాకాలో హరీశ్ ఆపరేషన్‌తో మాజీ మంత్రికి చెక్‌ పెట్టే దిశగా పావులు కదిపింది.

Etela Rajender : ఈటల ఇలాకాలో హరీష్ రావు

Trs High Command Now Sends Harish Rao To Eatal Constiuency

Updated On : May 23, 2021 / 12:24 PM IST

Etela Rajender : హుజురాబాద్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈటల ఎపిసోడ్‌ తర్వాత.. రంగంలోకి దిగిన అధిష్టానం పెద్దలు పార్టీ శ్రేణులను కారు దిగకుండా వ్యూహాలు రచిస్తున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీశ్‌రావును రంగంలోకి దింపింది. ఈటల ఇలాకాలో హరీశ్ ఆపరేషన్‌తో మాజీ మంత్రికి చెక్‌ పెట్టే దిశగా పావులు కదిపింది.

నిన్న మొన్నటి వరకు హుజురాబాద్‌ ఇష్యూపై అంతంత మాత్రంగానే ఫోకస్ చేసిన కారు పార్టీ.. ఈటల దూకుడుతో గేర్ మార్చింది. ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును సీన్‌లోకి ఎంటర్ చేసింది. వచ్చీ రాగానే హరీశ్‌ ఆపరేషన్ మొదలెట్టారు. ఈటల ఇలాకాలోనే తిష్టవేసి.. టీఆర్ఎస్ స్ట్రాటజీని అమలు చేశారు. ఈటెల సొంత మండలం కమలాపూర్‌లోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్‌లో పార్టీ పట్టు సడలకుండా.. ఈటెలతో నేతలెవరూ వెళ్లకుండా ఆపరేషన్ చేపట్టారు మంత్రి హరీశ్‌రావు. ఈ సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌ కూడా పాల్గొన్నారు.

కమలాపూర్‌ మండలం టీఆర్ఎస్ నాయకులతో పలు కీలక అంశాలపై చర్చించారు హరీశ్‌రావు. టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు.. నియోజకవర్గ అభివృద్ధిపైనా చర్చించారు. మీటింగ్ అనంతరం కమలాపూర్ నాయకులంతా టీఆర్‌ఎస్ వైపే ఉంటామని ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తాము కేసీఆర్ నాయకత్వంలోనే ఎప్పటికీ కొనసాగుతామన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే.. టీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలింది. దీంతో.. పార్టీ నేతలందరినీ మళ్లీ గులాబీ టెంట్ కిందకు తీసుకొచ్చేందుకు.. అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే.. కొందరు కేసీఆర్‌తోనే కలిసి ఉంటామని ప్రకటించారు. కొందరు ఈటల నియోజకవర్గంలో పర్యటించగానే.. ఆయనకు జైకొడుతున్నారు. దీంతో.. హుజురాబాద్‌లో ఈటెల ఇష్యూ లేకుండా నియోజకవర్గ అభివృద్ధిపైకి మళ్లించింది టీఆర్ఎస్. గ్రామాల్లో, మున్సిపాలిటీలో వార్డుల్లో 30 లక్షల రూపాయల చొప్పున అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. దీంతో లోకల్ నాయకుల ఫోకస్ రాజకీయల నుంచి అభివృద్ధి పనులపై మళ్లించినట్లవుతుందని అధిష్టానం భావిస్తోంది.

అయితే.. ఈటల రాజేందర్, హరీశ్ రావుకు మధ్య ఉద్యమ కాలం నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో.. ఈటల పట్టు తగ్గించేందుకు.. హుజురాబాద్‌లో హరీశ్ రావు చేయబోయే ఆపరేషన్ ఆసక్తి రేపుతోంది. గతంలో చాలాసార్లు ఉపఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో.. హరీశ్ రావు ఇంచార్జ్‌గా వ్యవహరించారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో హుజూరాబాద్‌ బాధ్యతలు హరీశ్ మాత్రమే డీల్ చేయగలరని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి హరీశ్ ఆపరేషన్‌తో హుజురాబాద్ ఈక్వేషన్ ఎలా మారుతోందో వేచి చూడాలి.