Trs Counters
Eetala Resignation: టీఆర్ఎస్ పార్టీలో తాను భంగపడ్డానంటూ.. విమర్శలను, అవమానాలను తట్టుకోలేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈటల రాజేందర్. కేసీఆర్ వైఖరి మారిందని ఉద్యమ నాయకుల్లా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఒకేలా లేరని చెప్పిన రాజేందర్ మీడియా సమక్షంలో రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు.
ఇదిలా ఉంటే ఈటల మాజీ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.
రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి:
కేసీఆర్ తన పెద్దన్న అని చెప్పి ఇప్పుడు నిందలు వేయడం దారుణం. మతాలు, కులాల పేరుతో రాజకీయం చేసే వాళ్లని కాపాడాలని ఈటల ఆ పార్టీలోకి వెళుతున్నారు. ఆయన్ను కేంద్రం కాదు ఎవరూ కాపాడలేరరు. రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తే మళ్లీ మేమే గెలుస్తాం. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుంది.
ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల.. చట్ట వ్యతిరేక భూములు ఎలా కొన్నారో చెప్పాలన్నారు. ఫిర్యాదులు వస్తే స్పందించడం ప్రజాస్వామ్యం అని చెప్పారు. ఈటలకు ఉన్నది ఆత్మగౌరవం కాదు ఆస్తుల మీద గౌరవం అన్నారు. రైతులను హింసిస్తున్న బీజేపీలో ఈటల ఎలా చేరతారని పల్లా ప్రశ్నించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి:
ఈటల ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మట్లాడుతున్నాడు. కరోనాను అదుపు చేయడంలో విఫలమయ్యారు. 15 నెలలు గడుస్తున్నా.. మెడికల్ ఇఫ్రాటెక్చర్ ను మెరుగు పరచలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా లెక్కలు, టెస్టుల సంఖ్య అన్ని తప్పుడు వివరాలే.
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య:
‘టీఆర్‌ఎస్ పార్టీ పెట్టిన తర్వాత 2003లో ఈటల పార్టీలో చేరారు. హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేసేందుకే రెడీగా ఉన్నారు. ఈటల పార్టీ నుంచి వెళ్లిపోతే ఎవరూ బాధపడటం లేదు.
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు:
సందర్భం వచ్చినప్పుడు తమకు పెద్ద అన్న అని చెప్పి.. ఇప్పుడేమో నియంత అని మాట్లాడుతున్నారు. ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు. ఢిల్లీలో ఉన్న వారు కాపాడుతారు అని ఈటల భావిస్తున్నారు. ఆయన చేసిన పాపాలను చట్టం గమనిస్తుందన్నారు. ఈటల రాజేందర్‌ను ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి కాపాడలేరు. సీఎం కేసీఆర్ వల్లే ఈటల ఎమ్మెల్యే అయ్యారు.