Trs Agitations
TRS Agitations : ధరల పెరుగుదలపై టీఆర్ఎస్ భగ్గుమంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరగనున్న ఈ నిరసనల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకోవాలని, నిరసనలను హోరెత్తించాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో రేపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.
హద్దు పద్దు లేకుండా కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతోందని ఆరోపించిన టీఆర్ఎస్… ఆ ధరల పెరుగుదలకు నిరసనగానే గురువారం ఆందోళనలు చేపట్టనుంది. ఇప్పటికే యాసంగిలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని వాదిస్తున్న కేసీఆర్.. తాజాగా ధరల పెరుగుదల అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఈ నిరసనలకు పిలుపునిచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.(TRS Agitations)
CM KCR Letter : ధాన్యం కొనుగోలు చేయాలని.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ ధరల పెరుగుదలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలల పాటు బ్రేక్ తీసుకున్న దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి చడీచెప్పుడు కాకుండా ధరల పెంపును ప్రారంభించేశాయి. బుధవారం కూడా లీటర్ పెట్రోల్ పై 90పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచాయి. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.
యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఉక్రెయిన్ సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాలు అంటూ సామాన్యులను దోచేస్తున్నాయి ప్రభుత్వాలు. పెరిగిన ధరలతో బండి బయటకు తీయాలంటేనే సామాన్యుడు భయపడాల్సిన పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో దాని వెనకాలే నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు జీవనం రోజు రోజు భారంగా మారుతోంది.
Petrol, Diesel Price Hike : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఏ సిటీలో ఎంత…
చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ బేసిక్ ధరతో పోల్చితే వసూలు చేసే ట్యాక్సులే అధికంగా ఉన్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నాయి. రాష్ట్రాలే అధికంగా ట్యాక్సు వసూలు చేస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తుంటే… ధరల నియంత్రణ కేంద్రం చేతుల్లోనే ఉందంటూ రాష్ట్రాలు ప్రతి విమర్శ చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. జీఎస్టీ పరిధిలో లేనందునే ధరలు పెరుగుతున్నాయన్న వాదనా ఉంది. అయితే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కొన్ని రాష్ట్రాలు అంగీకరించడం లేదని కేంద్రం చెబుతోంది.