ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాలనే తెలంగాణ రాష్ట్రంలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల చెప్పారు. మే 5 న కేబినెట్ సమావేశం అయి కేంద్రం ఇచ్చిన మినహాయింపులపై చర్చించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.
రాష్ట్రం ఆర్ధికంగా నష్టపోయినప్పటికీ కేంద్రం ఇచ్చిన మినహాయింపులను పక్కన పెట్టి, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకు గత కొంత కాలంగా తగ్గిన కేసులే తార్కాణం అని ఆయన చెప్పారు.
హైదరాబాద్ 30 సర్కిళ్లతో కూడిన ప్రాంతం కాగా అందులో 8 సర్కిళ్లలో అసలు కేసులు లేవని ఆయన వివరించారు. 22 సర్కిళ్లలో వచ్చిన కేసులు కూడా కట్టడి చేయగలిగామని ఆయన తెలిపారు. దేశంలో మొట్ట మొదటగా అలర్ట్ అయ్యింది తెలంగాణ రాష్ట్రమేనని ఈటల చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయట్లేదని చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఖండించారు.
రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిందన్నారు. ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన తెలంగాణ వలస కూలీలను నిబంధనలు మేరకు రాష్ట్రానికి తీసుకువస్తామని వారందరికీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని క్వారంటైన్ కు తరలిస్తామని ఆయన తెలిపారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ప్రయివేటు ఆస్పత్రుల నిర్వహణకు కొన్ని నిబంధనలు పెట్టామని…క్లినిక్ లు, ఆస్పత్రులు ద్వారా ప్రజలకు సేవ చేసుకోవచ్చని ఆయన వివరించారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర సాయం కోరామని ఇంత వరకు కేంద్రం స్పందించలేదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి నివారణ దిశగా చర్యలు తీసుకుంటూనే…భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం పురోగమించే దిశగా సీఎం ప్రణాళికలు రూపోందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా రహిత రాష్ట్రంగా చేయటానికి ప్రయత్నిస్తున్నామన్నారు. 80 శాతం పాజిటివ్ కేసుల్లో కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చాయని, వైద్యులు నిరంతరం వారికి సేవలు అందిస్తున్నారని మంత్రి ఈటల చెప్పారు.