రూల్ ఈజ్ రూల్ : పోలీసు వాహనానికి జరిమానా

సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలకు జరిమానా విధిస్తుంటారు. కానీ రాంగ్ రూట్ లో వెళ్లిన ఓ పోలీసు వాహనానికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. 2019, సెప్టెంబర్ 3 వ తేదీన సంగారెడ్డిలో పోలీసు ఇన్నోవా వాహనం(టీఎస్ 09 టీఏ 5121) ఐటీఐ ఎదురుగా రాంగ్ రూట్ లో వెళ్లింది. వాహనం రాంగ్ రూట్ లో వెళ్తున్న విషయాన్ని గమనించిన ప్రజలు ఫొటో తీసి వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా సోషల్ మీడియాలో పెట్టారు.
అన్ని గ్రూపుల్లో దీన్ని షేర్ చేయడంతో ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ సీఐ సంజయ్ కుమార్ ఆన్ లైన్ లో జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం రాంగ్ రూట్ ప్రయాణానికి రూ.1100, సర్వీస్ చార్జీ రూ.35 మొత్తం రూ.1,135 జరిమానా విధించి ఈ-చలానాను ఆన్ లైన్ లో పొందుపర్చారు.
ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సీఐ సంజయ్ కుమార్ అన్నారు. సంగారెడ్డిలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, త్రిబుల్ రైడింగ్ ఎలాంటి వాటికైనా జరిమానా విధిస్తున్నామని చెప్పారు. కొత్త రూల్స్ కఠినంగా ఉన్నాయని, ఎవరికైనా చట్టాలు సమానంగా వర్తిస్తాయని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలకు సహకరించాలన్నారు.