Sabitha Indra Reddy
TS SSC Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి బోర్డు పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రతి పరీక్షకు మూడు గంటల సమయాన్ని కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం పదో తరగతి పరీక్షల సన్నద్ధతపై తన కార్యాలయంలో సబిత సమీక్షించారు. 100 శాతం సిలబస్ తో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ ఉండదని సబిత వెల్లడించారు. ఇందుకు సంబంధించి నమూనా ప్రశ్నపత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలని సూచించారు.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకురాలు శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
Covid cases in January: దేశంలో కరోనా విజృంభించే ముప్పు.. తదుపరి 40 రోజులు కీలకం