Jeevan Reddy : 3రోజుల్లో 7కోట్లు చెల్లించాలి.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ డెడ్‌లైన్

రెండున్నర కోట్లు విద్యుత్ బిల్లులు కట్టకపోవడంతో ఇప్పటికే విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు.

ఆర్టీసీకి 7కోట్ల 27లక్షల అద్దె చెల్లించాలంటూ ఆర్మూర్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ వద్ద అధికారులు మైక్ లో బహిరంగ ప్రకటన చేసి హెచ్చరించారు. 3 రోజుల్లో బకాయిలు చెల్లించాలని, లేదంటే స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. రెండున్నర కోట్లు విద్యుత్ బిల్లులు కట్టకపోవడంతో ఇప్పటికే విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. ఆర్టీసీ ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతున్నా వాయిదా కోరడంతో గడువిస్తూ వచ్చామని అధికారులు తెలిపారు.

ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ కు ఆనుకుని 7వేల చదరపు గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది. 2013లో లీజుకు ఇస్తూ ఒప్పందం చేసుకున్నారు. విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థ.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భార్య రజితా రెడ్డి పేరు మీద ఉంది. అద్దెకు తీసుకున్న స్థలంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ నిర్మించారు.

Also Read : నిజమైన తెలంగాణ వచ్చింది.. మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలి : జీవన్ రెడ్డి

జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ పేరిట నిర్మించిన భవనంలో దుకాణాలు, సినిమా హాళ్లు, మల్టీ నేషనల్ కంపెనీలకు అద్దెకు ఇచ్చారు. కంపెనీల నుంచి అద్దె వసూలు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. ఆర్టీసీకి మాత్రం అద్దె చెల్లించకుండా పెండింగ్ లో పెట్టారు. ఆర్టీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు 7కోట్లకుపైగా చేరింది. దీంతో ఆర్టీసీ అధికారులు తరుచూ లీజుదారు సంస్థకు నోటీసులు ఇస్తూ వచ్చారు.

అద్దె చెల్లించకపోవడంతో హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే అద్దె చెల్లించకపోతే స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని మైక్ లో అనౌన్స్ చేశారు. లీజును రద్దు చేసి ఆర్టీసీ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశాం.. ఏపీలో కూడా అదే చూస్తాం: చంద్రబాబు

కాగా, అద్దె బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా మాల్ ను సీజ్ చేస్తామని అధికారులు చెప్పడంతో షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు