Tsrtc Introduces Extraordinary Leaveeol To Its Employees
TSRTC: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు “ఎక్స్‌ట్రార్డినరీ లీవ్” ఇచ్చేందుకు సిద్ధమైంది సంస్థ. ఈ మేరకు ఉత్తర్వులో.. ఏదైనా కారణంతో ఉద్యోగానికి హాజరుకాలేని పరిస్థితి ఉంటే, ముందే దరఖాస్తు చేసుకుంటే “ఎక్స్‌ట్రార్డినరీ లీవ్” ఇచ్చేందుకు సిద్ధం అంటూ ప్రకటించింది ఆర్టీసీ. డిపో మేనేజర్లు, డ్రైవర్, కండక్టర్లకు ఈమేరకు అవకాశం ఇస్తున్నట్లుగా ప్రకటించింది సంస్థ. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది ఈ ‘Extraordinary Leave'(EOL)కు దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఎక్స్‌ట్రార్డినరీ లీవ్ కింద ఐదేళ్ల వరకు సెలవు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రెండేళ్ల క్రితం.. కార్మికుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ 1,300 అద్దె బస్సులను తీసుకోగా.. వాటిలో అద్దె బస్సు యజమానులే ప్రైవేటు డ్రైవర్లను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆర్టీసీలో ఉద్యోగులు, డ్రైవర్లు, కండెక్టర్లు మిగిలిపోతున్నారు. ప్రస్తుతం మూడు వేల మంది డ్రైవర్లు, కండక్టర్లకు పనిచేయకపోయినా కూడా జీతాలు ఇవ్వవలసి వస్తుంది.
అసలే అంతంత మాత్రంగా ఉన్న సంస్థ ఆర్థిక పరిస్థితి, మిగులు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే మరింత కష్టపడాల్సి వస్తుంది. ఇలా సిబ్బంది మిగిలిపోతే సెలవులు ఇచ్చే అవకాశం ఉందని నిబంధనల్లో ఉంది. ఈ క్రమంలోనే అనుకున్నదే తడవుగా వెంటనే రంగంలోకి దిగిపోయింది సంస్థ. గరిష్టంగా ఐదేళ్లపాటు సెలవు ఇచ్చేందుకు అంగీకరించింది సంస్థ. ఐదేళ్లపాటు ఉద్యోగం చేయకపోయినా కూడా ఉద్యోగం పదిలంగానే ఉంటుంది.
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తీసుకుని వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మెయిల్ ఐడీని కూడా ఇచ్చారు. md@tsrtc.telangana.gov.in మెయిల్ ఐడీలో కానీ, @tsrtcmdoffice ట్విట్టర్ ఖాతా ద్వారా కానీ, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు.