Mahabubnagar accident: బాగా చదువుకుని, ఎంతో కష్టపడి సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకుంది ఓ యువతి. బెంగళూరులో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అదే రోజు ఆమెను యాక్సిడెంట్ రూపంలో మృత్యువు కబళించింది.
ఆమెతో పాటు ఆమె అక్క భర్త కూడా అదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజాపూర్‌లో 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. (Mahabubnagar accident)
హైదరాబాద్ నుంచి నంద్యాల వెళ్తున్న కారు అదుపు తప్పి, ఎదురుగా హైదరాబాద్ దిశగా వస్తున్న మరో కారుపై పడటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అధిక వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్పారు.
మృతులను వనపర్తి జిల్లాలోని పానగల్ మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరాం రంజిత్‌కుమార్‌రెడ్డి (34), అతని భార్య చెల్లి (23)హరికగా గుర్తించారు. వీరు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
రాజాపూర్ శివారులోకి వారి కారు వచ్చిన సమయంలో జడ్చర్ల వైపు వెళ్తున్న కారు మరో వాహనాన్ని ఓవర్‌టెక్ చేస్తూ అదుపుతప్పింది. రోడ్ డివైడర్‌ను ఢీకొని రంజిత్‌కుమార్‌రెడ్డి కారుపై పడింది. దీంతో రంజిత్, హారిక ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు.
కారులోనే రంజిత్, హారిక మృతదేహాలు ఇరుక్కుపోయాయి. వాటిని బాలానగర్ పోలీసులు, స్థానికులు కలిసి బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. రంజిత్ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసుకునేవాడు. ఆయన భార్య చైతన్య గర్భిణి. వారికి ఇప్పటికే 18 నెలల కుమార్తె కూడా ఉంది.