Ponnam Prabhakar
Ponnam Prabhakar: పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. దీంతో కొన్ని నియోజకవర్గాల పరిధి..రెండు మూడు జిల్లాల్లో విస్తరించింది. నియోజకవర్గ సమస్య పరిష్కారం కావాలంటే మూడు జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. ప్రజలకే కాదు…ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. జనాలకు అసౌకర్యాంగా ఉందని గ్రహించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లా పరిధిలోకి తీసుకొస్తానని ఎన్నికల హమీచ్చారు. రెండేళ్లు గడిచాయి..మరో మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఇప్పటికీ ఎలాంటి ప్రాసెస్ మొదలు కాలేదట.
క్యాబినెట్లో కీలకంగా ఉన్న పొన్నం ప్రభాకర్‌కు హమీ నెరవేర్చడానికి వస్తున్న అడ్డంకులు ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి వరకు హుస్నాబాద్ ఇందుర్తి నియోజకవర్గంగా ఉండేది.
Also Read: గులాబీ దళిపతి గేర్ మార్చి అటాక్ చేస్తున్నారా? రేవంత్ సొంత జిల్లా మహబూబ్‌నగర్‌పై కేసీఆర్ దృష్టి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో హుస్నాబాద్ ఓ నియోజకవర్గం ఉండేది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుతో హుస్నాబాద్ నియోజకవర్గం..సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ మూడు జిల్లాల పరిధిలోకి వచ్చింది. హుస్నాబాద్ కరీంనగర్ జిల్లాలో యధావిధిగా ఉంచాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేసినా సాధ్యపడలేదు.
ఎన్నికల సమయంలో ప్రజల డిమాండ్‌ను ఎన్నికల హామీగా ఇచ్చారు పొన్నం ప్రభాకర్. ప్రజలు కూడా తాము కోరుకుంటున్న డిమాండ్ కావడంతో పొన్నం హామీకి జై కొట్టారు. అయితే గెలిచిన తర్వాత మంత్రిగారు ఆ ఊసే ఎత్తడం లేదట. కరీంనగర్ జిల్లా కేంద్రంగా రాజకీయాలు సాగించిన పొన్నం ప్రభాకర్‌కు.. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత పట్టు సడలినట్లయ్యిందట. హుస్నాబాద్ మేజర్ పార్ట్ సిద్దిపేట జిల్లా పరిధిలోకి వస్తుంది. చిగురుమామిడి మండలం ఒక్కటే కరీంనగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది.
ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు హన్మకొండ జిల్లా పరిధిలో వస్తాయి. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా..పొన్నం ఇచ్చిన హమీకి మద్దతు పలుకుతూ ప్రచారం చేసినట్లు ప్రజలు గుర్తుచేస్తున్నారు. నియోజకవర్గ పరిధిని మార్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందట.
కేంద్ర హోం శాఖ, ఎన్నికల సంఘం ఆమోదం కూడా తప్పనిసరి అంటున్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేస్తే..అధికారికంగా నియోజకవర్గ పరిధిలు మారుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇక ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గం హద్దులు మారిస్తే..తమ నియెజకవర్గ సరిహద్దులు మార్చాలనే డిమాండ్ మిగితా చాలామంది ఎమ్మెల్యేలు చేసే అవకాశాలున్నాయి. దీంతోనే పొన్నం హామీ ఇక నెరవేరే అవకాశాలు కనిపించడంలేదు. అందుకే పొన్నం సైలెంట్అయిపోయారన్న టాక్ వినిపిస్తోంది.