Mla Rajasingh : గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర కలకలం రేగింది. అనుమానాస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహించడం కలకలానికి దారితీసింది. అనుమానంగా తిరుగుతున్న ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న మంగళ్ హాట్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అనుమానితుల ఫోన్ లో రాజాసింగ్ ఫోటోలు, రాజాసింగ్ ఇంటి ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు.
బోరబండకు చెందిన ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరు సాధారణంగానే ఇక్కడికి వచ్చారా? లేక ఎవరి ఆదేశాలతోనైనా ఈ రెక్కీ చేశారా? లేకపోతే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వాళ్ల మొబైల్ లో గన్నుల ఫోటోలు, బుల్లెట్ల ఫోటోలు కూడా ఉన్నట్లు పోలీసులు చెతున్నారు. ఆ ఇద్దరికి సంబంధించిన ఫోటోలను, వివరాలను పోలీసులు విడుదల చేశారు. దీనిపై పూర్తి విచారణ తర్వాత వారి గురించిన మరింత సమాచారం తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు.
”అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నా ఇంటి దగ్గర నలుగురు వ్యక్తులు తిరిగారు. నా ఇంటి ఫోటోలు, వీడియోలు తీశారు. ఇది చూసిన స్థానికులు కొందరు వారిని పట్టుకున్నారు. నలుగురిలో ఇద్దరు పారిపోయారు. మరో ఇద్దరిని పట్టుకున్నారు. వారి ఫోన్లు చెక్ చేస్తే నా ఫోటోలు, నా ఇంటి ఫోటోలు ఉన్నాయి. ముంబైలో ఒక వ్యక్తికి వాటిని వాళ్లు ఫార్వార్డ్ చేశారు. వెంటనే మంగళహాట్ పోలీసులకు సమాచారం ఇచ్చాం. పోలీసులకు వారిద్దరిని అప్పగించాం” అని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
Also Read : హైడ్రా కూల్చివేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించడం కొత్త కాదన్నారు రాజాసింగ్. గతంలోనూ ఇలాంటి రెక్కీలు చాలానే నిర్వహించారని చెప్పారు. అందులో ఐఎస్ఐ వాళ్లు కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడిందన్నారు. తాజా ఘటనలో రెక్కీ చేసిన వారు ఎవరు? ఎందుకు ఇలా చేశారు? అనేది పోలీసులు విచారిస్తున్నారని రాజాసింగ్ వెల్లడించారు. హిందూత్వ అంశాలపై చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేస్తుంటారు రాజాసింగ్. ఈ క్రమంలో ఆయన పలువురికి టార్గెట్ గా మారారు.