Hydra Demolishing: హైడ్రా కూల్చివేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
హైడ్రా కూల్చివేతలపై ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నా అధికారులతో ప్రెస్ మీట్ పెట్టించి విమర్శలు చేయడం సరైనది కాదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.

MP Bandi Sanjay Kumar
MP Bandi Sanjay Kumar: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన హైడ్రా కూల్చివేతలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బర్కత్ పురా బీజేపీ కార్యాలయంలో నరేంద్ర మోదీ 74వ జన్మదినం సందర్భంగా బీజేపీ నెల రోజులపాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సేవా కార్యక్రమాలలో భాగంగా నరేంద్ర మోదీ చేపట్టిన గొప్ప కార్యక్రమాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ప్రారంభించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా చేపట్టిన కార్యక్రమలు, బార్డర్ లో భద్రత, కాశీ దేవాలయం అభివృద్ధి, సోలార్ అభివృద్ధి, గుజరాత్ గ్లోబల్ విజన్, సామాన్యుడికి అందుబాటులో విమాన ప్రయాణం.. లాంటి చిత్రాల ప్రదర్శనలో ఉంచారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
Also Read : Hydra demolitions: హైడ్రా చుట్టూనే పావులు కదుపుతున్న పార్టీలు
హైడ్రా మీద ప్రజలు నుండి వ్యతిరేకత వస్తున్నా అధికారులతో ప్రెస్ మీట్ పెట్టించి విమర్శలు చేయడం సరైనది కాదని సంజయ్ అన్నారు. ఏదో చేద్దామనుకొని సీఎం రేవంత్ రెడ్డి మరేదో చేస్తున్నారు. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లుగా ఉంది. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై సంజయ్ విమర్శలు చేశారు. తోరణాలు ఆరకముందే హైడ్రా ఇండ్లను కూల్చివేస్తుందని, కూల్చడం 10 నిమిషాల పని కట్టడానికి పదేళ్లు పడుతుందని సంజయ్ అన్నారు. కిరాయి ఉన్న వాళ్లకు కూడా చెప్పి చెప్పకుండా అకస్మాతుగా కూల్చివేస్తే వాళ్లు ఎక్కడికి పోవాలని సంజయ్ ప్రశ్నించారు. హైడ్రా చేపట్టిన చర్య వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నదని అన్నారు. హైడ్రా కూల్చివేతలపై భారీగా ప్రజా వ్యతిరేకత వస్తున్నప్పటికీ మొండి వ్యతిరేకతతో ఏదో ఉద్దరిద్దామని చేయడం మంచిది కాదని సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. బీజేపీ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తుందని, పేద ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం.. బీజేపీ మీకు అండగా ఉంటుందని చెప్పారు. పేద ప్రజలకు ఒక ఆయుధంగా బీజేపీ మారబోతుందని సంజయ్ పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి కాశ్మీర్ ఎన్నికల్లో ఉన్నారు.. ఆయన రాగానే పెద్దెత్తున కార్యాచరణ రూపొందిస్తామని బండి సంజయ్ తెలిపారు. బీజేపీ కార్యకర్తల మీదకు బుల్డోజర్లు వెళ్లిన తరువాత పేదల ఇండ్ల మీదకు వెళ్లాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిందే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని విమర్శించారు. సర్పంచ్ లు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు.. రుణమాఫీ చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.