ఫ్యూచర్ సీటీలో పూర్తిస్థాయిలో భూగర్భ విద్యుత్ లైన్లు.. విద్యుత్ టవర్లు, పోల్స్ బయటికి కనపడొద్దు.. ఇలా చేయండి: రేవంత్‌ ఆదేశం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని రేవంత్‌ రెడ్డి చెప్పారు.

Cm Revanth Reddy

విద్యుత్ శాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష జరిపి కీలక వివరాలు వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. ఈ అవసరాల కోసం ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఫ్యూచర్ సీటీలో పూర్తిస్థాయిలో భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని రేవంత్‌ రెడ్డి అన్నారు. విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదని చెప్పారు. హై టెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందని అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని రేవంత్‌ రెడ్డి చెప్పారు. సెక్రటేరియట్, నక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలని అన్నారు. 160 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పారు.

Also Read: అడుక్కు తిని బతకడానికి సౌదీ అరేబియాకు వేల సంఖ్యలో పాకిస్థానీలు.. తరిమేస్తున్న సౌదీ..

అలాగే, తెలంగాణలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు. రైల్వే లైన్లతో పాటు మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్ పోర్టుల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.

ఫ్యూచర్‌లో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా మారుతుందని, డేటా సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని అన్నారు. విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లు సబ్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసుకోవాలని చెప్పారు.

ఈ ఏడాది గరిష్ఠంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. గత ఏడాదితో పోల్చితే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని చెప్పారు. 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందిని తెలిపారు.