భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం- కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ

తెలంగాణకు ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ రాజ్యం వచ్చాక, పేదల రాజ్యం వచ్చిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మారుస్తాం.

Bandi Sanjay Kumar : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామన్నారాయన. అమ్మవారి దయవల్లే తెలంగాణ బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకుందని చెప్పారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగిరేంత వరకు పోరాడతామన్నారు బండి సంజయ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు బండి సంజయ్.

”మా గెలుపు కార్యకర్తల కష్టార్జితమే. తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ ఇదే నా సెల్యూట్. తెలంగాణలో రామరాజ్యం రావాలని, గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా రెపరెపలాడించాలని ఓ లక్ష్యాన్ని ఎంచుకుని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు, ప్రతి ధర్మ పరిరక్షకుడు పని చేస్తున్నారు. తెలంగాణకు ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ రాజ్యం వచ్చాక, పేదల రాజ్యం వచ్చిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మారుస్తాం. తెలంగాణ ప్రజలకు కానుకగా బీజేపీ ఇవ్వబోతోంది. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చే అదృష్టం, అవకాశం మాకివ్వండి. చాలా పవర్ ఫుల్ టెంపుల్. ప్రతి హిందువు, తెలంగాణ వాది.. రండి.. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి” అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. బేగంపేట ఎయిర్ పోర్టులో కిషన్ రెడ్డికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు కిషన్ రెడ్డి. ఈ ర్యాలీలో కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత.. కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సెల్యూట్ తెలంగాణ పేరుతో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటైంది.

Also Read : రోజూ రూ.191 కోట్లు చెల్లింపు.. రేవంత్ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అప్పులు

ట్రెండింగ్ వార్తలు