Kishan Reddy: సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10 తరగతి విద్యార్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థుల పరీక్ష ఫీజులు మొత్తం తానే కడతానని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ హరిచందనకు రాసిన లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు కిషన్ రెడ్డి.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 10 తరగతి విద్యార్థుల వివరాలను ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల పదో తరగతి పరీక్ష ఫీజులు తానే చెల్లిస్తానని ఆయన తెలిపారు. పాఠశాలల వారీగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారి పరీక్షలకు కావాల్సిన ఫీజు మొత్తం డిపాజిట్ చేస్తానని లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి.
”విద్య దిశగా ఏ విద్యార్థి ప్రయాణానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదు. కాబట్టి, అంత్యోదయ స్ఫూర్తితో, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అన్ని 10వ తరగతి విద్యార్థుల పూర్తి తెలంగాణ SSC బోర్డు పరీక్ష ఫీజులను నా MP జీతం నుండి భరిస్తాను. విద్యార్థులకు వారి పరీక్షలు, వారి భవిష్యత్ ప్రయత్నాలకు ఆల్ ద బెస్ట్” అని కిషన్ రెడ్డి లేఖలో తెలిపారు.
కలెక్టర్ కు రాసిన లేఖలో.. కేంద్రమంత్రి కోరిన వివరాలు..
* అమౌంట్ డిపాజిట్ చేయాల్సిన బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వండి.
* పాఠశాలల వారీ టెన్త్ క్లాస్ విద్యార్థుల వివరాలు ఇవ్వండి.
* డిపాజిట్ చేయాల్సిన మొత్తం ఎంతో చెప్పండి.
Also Read: సరిగ్గా పోలింగ్‌కు ముందు హస్తం పార్టీ ఎలా బలపడింది? ఈ పాయింట్లే కారణం..