×
Ad

సెక్రటేరియట్‌లో అనధికార ఆంక్షలు? సిబ్బందికీ వణుకే? ఆ ఫ్లోర్ ఏది? అక్కడ ఎవరుంటారు?

చిన్న చిన్న కాంట్రాక్టర్లు, వివిధ రకాల బిల్లుల కోసం వేచి చూస్తున్న ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదట.

Telangana Secretariat

Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్లో అనధికారికంగా ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఆధార్ కార్డు ఆధారంగా ఎంట్రీ పాస్ తీసుకుంటే అనుమతించడం రెగ్యులర్‌గా జరిగేదే. కాకపోతే ఇప్పుడు పాస్ ఉన్నా..వన్ కండీషన్ అంటున్నారట. సెక్రటేరియట్‌లో ఏ ఫ్లోర్‌కు అయినా పాస్‌ తీసుకుని వెళ్లొచ్చు..ఏ ఆఫీసర్‌ను అయినా కలవొచ్చు.

కానీ ఆ ఒక్క ఫ్లోర్‌కు మాత్రం నో ఎంట్రీ అంటున్నారట. జనరల్‌గా సీఎం ఉండే ఫ్లోర్‌కు ఇలాంటి ఆంక్షలు పెడుతారు..కానీ ఇక్కడ మాత్రం సీఎం ఫ్లోర్ కన్నా..2వ ఫ్లోర్‌లోనే ఎక్కువ ఆంక్షలున్నాయట. అదే సెక్రటేరియట్‌లోని రెండో అంతస్తు. సచివాలయంలోని సెకండ్ ఫ్లోర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ ఆఫీస్ ఉంటుంది.

దాంతో ఆ ఫ్లోర్‌లో టైట్ సెక్యూరిటీ కొనసాగుతోంది. అయితే ఆ ఫ్లోర్‌కు వెళ్లాలంటే ఉద్యోగులు, పబ్లిక్ కూడా ఇబ్బందులు తప్పడం లేదట. రకరకాల పనుల కోసం సెక్రటేరియట్ వచ్చేవారిని రెండో ఫ్లోర్లోకి మాత్రం ఎస్పీఎఫ్ పోలీసులు అనుమతించడం లేదు. ఫలితంగా ఆ ఫ్లోర్లో ఉన్న ఇతర విభాగాల ఆఫీస్లకు వెళ్లాలంటే కూడా వేరే మార్గం నుంచి వెళ్లాల్సి వస్తుందట. అయితే ఇక్కడ జనంతో నిత్యం ఇబ్బందులు కలుగుతుండటంతో సెకండ్ ఫ్లోర్లో డ్యూటీ చేయడానికి ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా భయపడుతున్నారట.

Also Read: టీడీపీలో గంగమ్మ ఆలయ ఛైర్మన్‌ పోస్ట్‌పై చిచ్చు.. ఏం జరుగుతోంది?

ఇదిలా ఉంటే..సీఎం రేవంత్..ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలన నడిపిస్తున్నామంటున్నారు. ప్రజల కోసం ప్రగతి భవన్ క్యాంప్ ఆఫీస్ గోడలు, కంచెలను సైతం బద్దలు కొట్టి అందరినీ కలుస్తున్నామని చెప్పుకుంటున్నారు. మరి సెక్రటేరియట్లో ఈ నిషేధాజ్ఞలు ఎందుకని విజిటర్స్ గుసగుసలాడుకుంటున్నారు. అయితే దీనికి కారణం ఉందట.

పాత బకాయిల కోసం సచివాలయం చుట్టూ వందల మంది చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. వీరందరి పని ఉండేది సెకంర్‌ ఫ్లోర్‌లోనే. గత రెండు మూడేళ్లుగా రకరకాల పనులు చేసిన ప్రైవేట్ కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు బిల్లులు కోసం, జీపీఎఫ్ నిధుల కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోందట. ఈ డబ్బులు కోసం సెక్రటరియేట్‌కు వస్తే వారిని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న ఛాంబర్ వైపు అనుమతించడం లేదట.

అడ్డదారిలో ఎప్పటికప్పుడు చెల్లింపులు
ఒకవైపు ప్రభుత్వం నిధులు లేవని చెప్తూనే..కొందరికి మాత్రం అడ్డదారిలో ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు, వివిధ రకాల బిల్లుల కోసం వేచి చూస్తున్న ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదట. చివరకు వేతనబిల్లుల బకాయిలు సైతం ఏడాది కాలంగా చెల్లించడం లేదట..ఇటు రిటైర్ మెంట్ బెనిఫిట్లయితే ఎప్పుడు వస్తాయో కూడా తెలియని ఉందట. ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు ఏకంగా సెక్రటేరియట్‌లోనే ఆందోళనలు చేశారు.

పెండింగ్ బిల్లుల కోసం ధర్నా చేసినవారిపైన కేసులు కూడా నమోదు చేశారు. ఇలా రోజూ వందల మంది జనం వస్తుండటంతో ఆర్థిక శాఖ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తప్పించుకొని తిరుగుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిధుల కొరత కారణంగా బిల్లులు చెల్లించలేక, వచ్చిన విజ్ఞప్తులను పరిష్కరించలేక ఛాంబర్‌లో కూర్చోవడమే మానేశారట ఆయన.

రోజువారీ పనులను మరో సెక్రటరీ ఛాంబర్‌లో కూర్చుని చేసుకుంటున్నారనే టాక్‌ నడుస్తోంది. ఏదో కొద్దిసేపు అలా వచ్చి..ఎవరి కంట పడకుండా ఇలా వెళ్లిపోతున్నారని ఆయన ఛాంబర్‌లోని సిబ్బంది గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారే సమస్యలను పరిష్కరించకుండా ఇలా ఎన్ని రోజులు తప్పించుకు తిరుగుతారని విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక శాఖను పట్టి పీడిస్తున్న ఆర్థిక సమస్యలు ఎప్పటికీ తీరేనో..బిల్లుల చెల్లింపు ఎప్పుడు గాడిన పడేనో చూడాలి మరి.