టీడీపీలో గంగమ్మ ఆలయ ఛైర్మన్‌ పోస్ట్‌పై చిచ్చు.. ఏం జరుగుతోంది?

ఇప్పటికిప్పుడు ఎవరో ఒకరికి పార్టీ ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించడం కంటే ముఖ్య నాయకులతో త్రీమెన్ లేదా ఫైవ్ మెన్ కమిటీ వేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

టీడీపీలో గంగమ్మ ఆలయ ఛైర్మన్‌ పోస్ట్‌పై చిచ్చు.. ఏం జరుగుతోంది?

Tdp

Updated On : October 2, 2025 / 8:41 PM IST

Tirupati TDP: తిరుపతి టీడీపీలో తమ్ముళ్లు తలోదారిలో నడుస్తున్నారట. ఇంచార్జ్ పదవి కోసం గ్రూప్‌ పాలిటిక్స్‌ తగువ పడుతున్నారట. నియోజకవర్గంలో టీడీపీ మూడు వర్గాలుగా విడిపోయి..కొందరు జనసేన ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తే..మరికొందరు తమదే రాజ్యం అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట.

ఎవరికి వారు ఆధిపత్యం చెలాయిస్తూ రోడ్డున పడుతున్నారట. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎవరో ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతోనే ఈ వ్యవహారం మరింతగా రచ్చకెక్కుతుందని అంటున్నారు. కొందరు తిరుపతి టీడీపీ నేతలు అయితే..మంత్రి లోకేశ్‌ పేరు చెప్పి పెత్తనం చలాయిస్తున్నారట. ఇటీవల జరిగిన గంగమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్ విషయంలోనూ టీడీపీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయని అంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా తిరుపతి స్థానం జనసేనకు దక్కింది. జనసేన నుంచి ఆరని శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటివరకు తిరుపతి సీటు ఆశించిన టీడీపీ నేతలకు మాత్రం..జనసేనకు టికెట్ దక్కడం..ఆ పార్టీ అభ్యర్థి గెలవడం మింగుడు పడలేదట. ఈ క్రమంలోనే కొంతమంది టీడీపీ నేతలు జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులకు సహకరిస్తుండగా, మరికొంతమంది మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదట. తీరా ఇది టీడీపీలోనే గ్రూపు వార్‌కు దారితీసిందంటున్నారు.

Also Read: స్టాండప్ కమెడియన్, బిగ్‌బాస్ షో-17 విజేత మునావర్‌ను హత్య చేసేందుకు స్కెచ్‌.. ఇద్దరి అరెస్ట్‌.. ఎందుకు చంపాలనుకున్నారు?

తిరుపతి టీడీపీ సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, అలానే మరికొంత మంది టీడీపీ నేతలు చాలా నెలలుగా అసంతృప్తిగా ఉన్నారు. అయితే తిరుపతి టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న సుగుణమ్మకు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ పోస్ట్ దక్కింది. సుగుణమ్మకు ఈ పోస్టు దక్కిన తర్వాత మరోసారి పార్టీలోనే రచ్చ మొదలైంది. సుగుణమ్మకు నామినేటెడ్‌ పోస్ట్ దక్కడంతో..తిరుపతి టీడీపీ ఇంచార్జ్‌గా మరొకరికి అవకాశం ఇస్తారని..నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు మొదలెట్టారు. ఇవేవీ పట్టించుకోకుండా తానే నియోజకవర్గ ఇంచార్జ్‌ను అన్నట్లుగా సుగుణమ్మ తన పని తాను చేసుకుంటూపోతున్నారు.

అయితే ప్రతిష్టాత్మకమైన తిరుపతి గంగమ్మ ఆలయానికి ఈ మధ్యే పాలక మండలిని నియమించింది ప్రభుత్వం. మొత్తం 11 మంది పాలకమండలి సభ్యులలో టీడీపీ, జనసేనకు చెరో ఐదు స్థానాలు దక్కగా, బీజేపీకి ఒక స్థానం దక్కింది. పాలక మండలి ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన మహేష్ యాదవ్‌ను నియమించారు. అయితే మహేష్ యాదవ్ పేరు తాను సిఫారసు చేయలేదని సుగుణమ్మ అంటున్నారు. ఆలయ ఛైర్మన్ పోస్ట్ కోసం సుగుణమ్మ సిఫారసు చేసిన రెండు పేర్లను కూడా పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందట.

టీడీపీ నేత మహేష్ యాదవ్‌కు ఆలయ చైర్మన్ పోస్ట్
చిత్రంగా జనసేన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సిఫారసు చేసిన టీడీపీ నేత మహేష్ యాదవ్‌కు ఆలయ చైర్మన్ పోస్ట్ దక్కింది. కూటమి పార్టీలకు చెందిన అందరితో సఖ్యత కలిగిన మహేష్ యాదవ్ తన వంతు ప్రయత్నాలు గట్టిగా చేసి ఆలయ ఛైర్మెన్ పోస్ట్ దక్కించుకున్నారట. సుగుణమ్మ వర్గానికి మాత్రం ఈ ఎంపిక నచ్చలేదట.

టీడీపీలోని మరో వర్గం మాత్రం మహేష్ యాదవ్‌కు ఛైర్మన్ పోస్ట్ దక్కడానికి సహకరించిందట. దీంతో టీడీపీలోని ఈ రెండు వర్గాలు మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా పోటాపోటీ పోస్టులు పెట్టుకున్నారు. చివరకు ఈ పంచాయతీ జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్..అటు నుంచి ఏకంగా సీఎం చంద్రబాబు దగ్గరకు చేరింది. తిరుపతి టీడీపీ నేతల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల తర్వాత నుంచి తిరుపతి టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయి, తరచూ రోడ్డున పడుతుండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నిజానికి తిరుపతి టీడీపీలో అంతా నాయకులే. ఒకరిద్దరు నాయకులు మంత్రి లోకేశ్‌ తమకు చాలా సన్నిహితుడని చెప్పుకుంటూ నగరంలో దందాలు చేస్తున్నారట.

తామే కాబోయే పార్టీ ఇంచార్జ్‌ అంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారట. ఈ విషయాలన్నీ కూడా పార్టీ అధినాయకత్వం దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎవరో ఒకరికి పార్టీ ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించడం కంటే ముఖ్య నాయకులతో త్రీమెన్ లేదా ఫైవ్ మెన్ కమిటీ వేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గ్రూప్‌వార్‌కు చెక్ పెట్టాలంటే సాధ్యమైనంత తొందరగా నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌ను నియమించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.