BRS First List: వనమాకు మరో చాన్స్.. చిన్నయ్య, శంకర్ నాయక్ సేఫ్..

వివాదాలు, తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్న కొంత మంది బీఆర్ఎస్ నేతలు మళ్లీ టిక్కెట్ దక్కించుకోవడం గమనార్హం.

vanama venkateswara rao, durgam chinnaiah, banoth shankar naik in BRS List

BRS Party First List: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే 115 మంది అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. మరో నాలుగు స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు తెలిపారు. ఈసారి తాను రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి (Kamareddy) నుంచి బరిలోకి దిగనున్నట్టు అధికారికంగా తెలిపారు. వివాదాలు, తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్న కొంత మంది నేతలు మళ్లీ టిక్కెట్ దక్కించుకోవడం గమనార్హం.

వనమాకు మరో అవకాశం
కొత్తగూడెం సీనియర్ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు (vanama venkateswara rao) మరోసారి అవకాశం దక్కింది. ఆయన ఎన్నిక చెల్లదని ఇటీవల తెలంగాణ హైకోర్టు నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతోఆయనకు సీటు దక్కుతుందా, లేదా అనే దానిపై చర్చోపచర్చలు జరిగాయి. వనామా ఎన్నికపై న్యాయపోరాటం చేసిన జలగం వెంకట్రావు కూడా టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు బీఆర్ఎస్ బాస్ మాత్రం వనామావైపే మొగ్గు చూపారు. వనామాకు టిక్కెట్ దక్కడంతో కొత్తగూడెంలో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

చిన్నయ్య, శంకర్ నాయక్ సేఫ్
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (durgam chinnaiah) కూడా తన సీటును నిలుపుకున్నారు. లంచం, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన వివాదంలో చిక్కుకోవడంతో ఈసారి టిక్కెట్ ఇస్తారా, లేదా చర్చ నడిచినప్పటికీ.. చివరికి చిన్నయ్య పట్టు సాధించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ (banoth shankar naik) కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచినప్పటికీ పార్టీ అధిష్టానం మళ్లీ ఆయనకే టిక్కెట్ కట్టబెట్టింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ (Korukanti Chandar) పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమయినప్పటికీ అధిష్టానం ఆశీస్సులు ఆయనకే దక్కాయి.

Also Read: రాజయ్యకు మొండిచేయి.. రేఖా నాయక్ కు షాక్.. బొంతు రామ్మోహన్ మరో’సారీ’

పెండింగ్ లో నర్పాపూర్, జనగాం
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున అసమ్మతి ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ స్థానానికి అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఈ సీటు దక్కనుందని ప్రచారం
జరుగుతోంది. కాగా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, తనకు కేసీఆర్ అన్యాయం చేయరని మదన్ రెడ్డి మీడియాతో అన్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని వచ్చిన వార్తలను ఆయన
ఖండించారు. సొంత కుమార్తె నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న జనగాం ఎమ్మెల్మే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేరు తొలి జాబితాలో లేదు. జనగాం స్థానానికి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ కు టిక్కెట్ దక్కే, ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

Also Read: బీఆర్ఎస్ మొదటి లిస్ట్ వచ్చేసింది.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీరే.. 2 స్థానాల్లో కేసీఆర్ పోటీ

ఈటల ప్రత్యర్థిగా కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ప్రత్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ ఖరారు చేసింది. ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా, లేదా చర్చ నడిచినప్పటికీ హైకమాండ్ ఆయనవైపే
మొగ్గు చూపింది. అయితే ముందునుంచి కౌశిక్ రెడ్డి మాత్రం టిక్కెట్ తనదేనని చాలా విశ్వాసంతో ఉన్నారు. కొన్ని వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ ఆయన టిక్కెట్ సాధించడం విశేషం.