Vanaparthi: సిట్టింగ్ ఎమ్మెల్యే, క్యాబినెట్ ర్యాంకు పదవి ఉన్న సీనియన్ లీడర్. ఈ ఇద్దరి మధ్యే కోల్డ్‌వార్ నడుస్తుంటే..కార్పొరేషన్ ఛైర్మన్ పైగా..డీసీసీ పదవితో మరో లీడర్ ఎంటర్ అయ్యారు. ఈ ముగ్గురిది ఒకే నియోజకవర్గం. పైగా అధికార కాంగ్రెస్ పార్టీ. ఇంకే ముంది వర్గపోరు ఎలా ఉంటుందో అర్థమయ్యే ఉంటుంది. అవును వనపర్తి జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ పాలిటిక్స్ పీక్ లెవల్‌కు చేరాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మధ్య ఉప్పు-నిప్పులా వ్యవహారం నడుస్తోంది.
వీరిద్దరి మధ్య మొదటి నుంచి కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరికి తోడు ఇప్పుడు మరో నేత ఎంట్రీ ఇవ్వడంతో వనపర్తి కాంగ్రెస్ పాలిటిక్స్ మరింత రంజుగా మారాయి. ఇప్పటికే ఇద్దరు కీలక నేతల మధ్య నిత్యం ఓ యుద్ధం నడుస్తుండగా..కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో మరో వర్గం తయారైనట్లు అయిందట. లేటెస్ట్‌గా ప్రకటించిన డీసీసీల జాబితాలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనరెడ్డికి వనపర్తి జిల్లా డీసీసీ పగ్గాలు కట్టబెట్టారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన శివసేనరెడ్డి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి టికెట్ కూడా ఆశించారు. ఇప్పుడు శివసేన ఎంట్రీతో వనపర్తి కాంగ్రెస్ రాజకీయం రంజుగా మారింది. (Vanaparthi)
Also Read: ఏపీలో “రౌడీషీటర్ల బహిష్కరణ” పొలిటికల్ ఇష్యూ కాబోతోందా?
పంచాయతీ పోరు నేతల మధ్య వర్గపోరును మరోసారి బట్టబయలు చేసింది. గ్రూప్ వార్ కారణంగా పంచాయతీ పోరులో వనపర్తి కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయిందట. నియోజకవర్గంలో మొత్తం 140 గ్రామ పంచాయతీలు ఉండగా..కాంగ్రెస్ సానుభూతిపరులు 85 చోట్ల గెలుపొందారు. బీఆర్‌ఎస్ మద్దతుదారులు 51 చోట్ల గెలుపొందారు. దీంతో నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇచ్చినట్లు అయింది.
ఎమ్మెల్యే మేఘారెడ్డి గరం గరం?
పంచాయతీ రిజల్ట్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి గరం గరం అవుతున్నారట. ఎప్పుడూ సౌమ్యంగా.. నెమ్మదస్తుడిగా ఉండే మేఘారెడ్డి..ఆగ్రహంతో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొదటి, రెండో విడతల్లో రిజల్ట్ సరిగా రాకపోయేసరికి మూడో విడత ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి పార్టీలపై అటాకింగ్ కామెంట్స్ చేశారు. తాను మద్దతిచ్చిన వారు కాకుండా ఇతరులు ఎవరు గెలిచినా..తన ఆఫీస్ గేట్ బయటే మెడపట్టి గెంటేస్తా.. గ్రామ అభివృద్ధికి నిధులు ఇవ్వనని ప్రకటించారు మేఘారెడ్డి.
కట్ చేస్తే ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడుతూ..చిన్నారెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. 15 నుంచి 20 గ్రామాల్లో చిన్నారెడ్డి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా ప్రత్యర్థికి చిన్నారెడ్డి సపోర్టు చేసినట్లుగా తన దగ్గరఆధారాలున్నాయని చెప్పుకొచ్చారు.
వనపర్తి కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట క్యాడర్‌కు హెడెక్‌గా మారిందట. నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలు..కీలక పదవుల్లో ఉండటంతో..క్యాడర్, లీడర్లు మూడు గ్రూపులుగా విడిపోయారట. ఏ లీడర్ వెంట నడవాలో..ఎవరి దగ్గరికి వెళ్తే ఏ నేతకు కోపం వస్తుందోనని మధన పడుతున్నారట కార్యకర్తలు.
ఆల్రెడీ ఎమ్మెల్యే మేఘారెడ్డి, సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గంగా కాంగ్రెస్ రెండుగా చీలిపోగా..ఇప్పుడు శివసేనరెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో కథ గమ్మత్తుగా మారిందంటున్నారు. రానున్న రోజుల్లో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శివసేనరెడ్డి కూడా తన వర్గాన్ని బలంగా ప్రోత్సహించడం స్టార్ట్ చేస్తే..వనపర్తి కాంగ్రెస్ రాజకీయం..మరింత రచ్చకెక్కడం ఖాయమంటున్నారు కార్యకర్తలు. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వనపర్తి హస్తంలో గ్రూప్ పాలిటిక్స్‌కు చెక్ పెట్టాలని కోరుతున్నారు. అధిష్టానం ఏం చేయబోతోందో చూడాలి మరి.