Sajjanar : సైబర్ టెర్రరిస్టుల కన్నా తక్కువేమీ కాదు..! బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ ఫ్లుయన్సర్లపై సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు

బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై తెలంగాణ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే.

VC Sajjanar

Sajjanar : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, ఇన్ ఫ్లుయన్సర్లపై ఐపీఎస్ అధికారి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి విరుచుకుపడ్డారు. వారిని ఉద్దేశించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. సైబర్ టెర్రరిస్టుల కన్నా తక్కువేమీ కాదు అంటూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న ఇన్ ఫ్లుయన్సర్లపై విరుచుకుపడ్డారు సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న టీవీ, సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ ఫ్లుయన్సర్లపై సజ్జనార్ చాలా సీరియస్ గా ఉన్నారు.

బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది ఆస్తులు పొగొట్టుకోవడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ తో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటోందని సజ్జనార్ వాపోయారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అలాంటి బెట్టింగ్ యాప్స్ కు ఇన్ ఫ్లుయన్సర్లు, సెలబ్రిటీలు ప్రమోషన్ చేయడాన్ని సజ్జనార్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు సజ్జనార్. మరీ ముఖ్యంగా యువత వాటి జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. ఆ యాప్ లు ఆర్థికంగా దోచేస్తాయని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ పై ఇన్వెస్ట్ చేసి కష్టపడి సంపాదించిన డబ్బుని పొగొట్టుకోవడం కన్నా.. యువత తమ కెరీర్ పై దృష్టి పెట్టాలని సూచించారు సజ్జనార్.

Also Read : జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కలకలం, దేశవ్యాప్తంగా రేగిన దుమారం.. ఎవరీ యశ్వంత్ వర్మ?

”ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇటువంటి యాప్‌ల కు ప్రచారం చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు.. సైబర్ ఉగ్రవాదుల కంటే తక్కువ కాదు. వారి చర్యలు ముఖ్యంగా అమాయకుల జీవితాలను నాశనం చేస్తాయి. అటువంటి వ్యక్తులపై ప్రజలు పోలీసులకు ఫిర్యాదులు చేయడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ ప్రమాదకరమైన యాప్‌లను ప్రచారం చేయకుండా ఇతరులను నిరోధించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. సురక్షితమైన భవిష్యత్తుకు దోహదపడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది” అని సజ్జనార్ అన్నారు.

కాగా.. సజ్జనార్ సూచనలతో పాటు ఫిర్యాదులు అందటంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై తెలంగాణ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు సినీ, టీవీ నటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిషేధిత బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన వ్యవహారం యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లు, సినీ ప్రముఖుల మెడకు చుట్టుకుంటోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నటులు దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతో పాటు బుల్లితెర నటి, యాంకర్ శ్యామలపైనా కేసు నమోదైంది.

Also Read : విష్ణుప్రియ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు..! ఒక్కో ప్రమోషన్ కు ఎంత డబ్బు తీసుకుందంటే..

వీరితోపాటు ఇన్‌ఫ్లుయన్సర్లు, బుల్లితెర నటులు విష్ణు ప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత, శ్రీముఖి, వర్షిణి, సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహాపఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్ తదితరుల పేర్లను పోలీసులు ఎఫ్ఆర్ఐలో చేర్చారు. మియాపూర్ కు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.