కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కొంపముంచుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. యాంటిజెన్ టెస్టులో పాజిటివ్ ఉన్నా నెగెటివ్ చూపిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి కూడా నెగెటివ్ చూపిస్తోంది. తమకు నెగెటివ్ వచ్చింది కదా అని లక్షణాలు ఉన్నవారిలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇష్టానుసారం తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారు. దీంతో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అలర్ట్ అయ్యింది. కీలక ఆదేశాలు ఇచ్చింది. యాంటిజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చినా లక్షణాలు ఉంటే మాత్రం కచ్చితంగా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఎందుకంటే ఆర్టీపీసీఆర్ టెస్టులో రిజల్ట్ పక్కాగా వస్తుందని చెప్పింది.
యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ కచ్చితత్వమే అసలు సమస్య:
ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో ఉన్న సమస్యే ఇది. ఈ టెస్టుల్లో పాజిటివ్ వస్తే 99.3% నుంచి 100% ఓకే. నెగెటివ్ వస్తే 50.6% నుంచి 84% మాత్రమే కరెక్ట్ అని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. మిగిలిన నెగెటివ్‌లన్నీ నెగెటివ్‌లుగా గుర్తించలేమంది. యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ కచ్చితత్వమే అసలు సమస్య. అందువల్ల యాంటిజెన్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చి ఏమాత్రం లక్షణాలున్నా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష తప్పక చేసుకోవాలని ఐసీఎంఆర్ చెబుతోంది.
లక్షణాలు కనిపిస్తే మళ్లీ పరీక్ష చేయించుకోవాలి:
అంతేకాదు లక్షణాలు లేకుండా యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చినా, ఆ తర్వాత లక్షణాలు కనిపిస్తే అప్పుడు మళ్లీ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. కానీ రాష్ట్రంలో చాలామంది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగెటివ్ రాగానే కులాసాగా తిరిగేస్తున్నారు. ఈ విషయంలో కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితే వైరస్ సామాజిక వ్యాప్తికి దారితీస్తోంది.
70 శాతం యాంటిజెన్ టెస్టులే:
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 16.67 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. లక్షా 38వేల 395 మందికి కరోనా సోకినట్లు తేలింది. మొదట్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఆపై ప్రైవేట్‌లోనూ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల ద్వారానే కరోనా నిర్ధారణ జరిగింది. అయితే, ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల్లో భాగంగా శ్వాబ్ నమూనాలు తీయడం, వాటిని భద్రంగా లేబొరేటరీలకు పంపడం సమస్యగా మారింది. చివరకు టెస్ట్ ఫలితం రావడానికి రెండు నుంచి ఏడు రోజుల వరకు పడుతోంది. ఫలితం వచ్చేలోగా బాధితుల్లో వైరస్ ముదిరిపోయి పరిస్థితి తలకిందులయ్యేది.
అరగంటలోనే ఫలితం, అందుకే యాంటిజెన్ టెస్టుల వైపు మొగ్గు:
దీంతో రెండు నెలలుగా రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు సర్కార్ శ్రీకారం చుట్టింది. శ్వాబ్ తీసిన వెంటనే అక్కడికక్కడే పరీక్ష జరగడం, పావుగంట నుంచి అరగంటలోనే ఫలితం రావడంతో బాధితులకు ఊరటనిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో చేసిన మొత్తం పరీక్షల్లో 70 శాతం, రోజువారీ పరీక్షల్లో 90 శాతం యాంటిజెన్ పరీక్షలేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారికి తక్షణ చికిత్సకు ఈ టెస్టులు వీలు కల్పించాయి.
యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే ఆనందపడొద్దు:
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,076 చోట్ల యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. కొన్నిచోట్ల అనుమతి లేకున్నా ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆసుపత్రులు కూడా యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నాయి. అయితే నెగెటివ్ వచ్చినా లక్షణాలుంటే ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష చేసుకోవాలన్న ఐసీఎంఆర్ నిబంధనను పలుచోట్ల కాలరాస్తున్నారు. కిందిస్థాయిలో వైద్యారోగ్య యంత్రాంగం కూడా ఇది మర్చిపోయింది. బాధితులు కూడా లక్షణాలున్నా యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ రావడంతో ఆనందపడిపోతున్నారు. ఇదే కొంపముంచుతోంది.
యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్‌ను గుడ్డిగా నమ్మొద్దు:
కొందరిలో వైరస్ తీవ్రం కావడంతో పాటు వారి కుటుంబసభ్యులకూ సోకుతోంది. ఉన్నతస్థాయిలోని వ్యక్తులు కూడా యాంటిజెన్ టెస్టుల నెగెటివ్ రిపోర్ట్‌ను పూర్తిగా నమ్మేస్తున్నారు. ఉదాహరణకు ఒక మీటింగ్ ఏర్పాటుకు ముందు అందరికీ యాంటిజెన్ టెస్టులు చేసి నెగెటివ్ వచ్చిన వారందరినీ హాలులోకి అనుమతించారనుకోండి. అలా నెగెటివ్ వచ్చిన వారిలో లక్షణాలున్నవారు ఎవరైనా ఉంటే, వారి వల్ల ఆ మీటింగ్‌లో ఉన్న ఇతరులకూ వైరస్ సోకుతుంది. ఇలా వైరస్ సామాజిక వ్యాప్తికి విస్తరిస్తుందని వైద్య నిపుణుడు వివరించారు.
తెలంగాణలో కరోనా కల్లోలం:
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. శనివారం(సెప్టెంబర్ 5,2020) బులిటెన్‌లో కొత్తగా 2వేల 511 కేసులు నమోదుకాగా.. మొత్తం కేసులు లక్షా 38వేల 395కు చేరింది. 62వేల 132 నమూనాలు పరీక్షించారు. మొత్తం 16లక్షల 67వేల 653 టెస్టులు నిర్వహించారు. మరో 3,145 టెస్టుల ఫలితం రావాల్సి ఉంది. 24 గంటల్లో 11మంది కరోనా కారణంగా చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 877కి చేరింది.
హైదరాబాద్ వాసులకు ఊరట:
జీహెచ్ఎంసీ పరిధిలో 305 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 184 కేసులు, నల్గొండ జిల్లాలో 170 కేసులు, కరీంనగర్ జిల్లాలో 150, ఖమ్మం జిల్లాలో 142, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 134, వరంగల్ అర్బన్‌లో 96 కేసులు, సూర్యాపేట జిల్లాలో 96, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 93, నిజామాబాద్ జిల్లాలో 93 జగిత్యాల జిల్లాలో 85, సిద్ధిపేట జిల్లాలో 80, మంచిర్యాల జిల్లాలో 73, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 72, సంగారెడ్డి జిల్లాలో 70, పెద్దపల్లి జిల్లాలో 65, కామారెడ్డి జిల్లాలో 60, మహబూబాబాద్ జిల్లాలో 58 కేసుల చొప్పున నమోదయ్యాయి.
రికవరీ రేటు 75.5 శాతం:
రాష్ట్రంలోని 33 జిల్లాలో కరోనా కేసులు నమోదు కాగా.. గురువారం శుక్రవారం 2వేల 579 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య లక్షా 4వేల 603 చేరింది. రికవరీ రేటు 75.5 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32వేల 915గా ఉంది. వీరిలో 25వేల 729 మంది హోం ఐసోలేషన్ లేదా ఇన్‌స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నారు.