Vijayashanti to join bjp: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ మహిళానేత విజయశాంతి.. బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వస్తున్నాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ తీరుపై మండిపడుతూ.. విజయశాంతి ప్రకటన చేసిన కాసేపటికే.. ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీకి మద్దతుగా ఈ ప్రకటన ఉందని.. రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కొంతకాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరం:
ప్రస్తుతం.. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌గా పనిచేస్తున్నారు విజయశాంతి. అయినప్పటికీ.. ఆవిడ కొంతకాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో సుదీర్ఘకాలం.. రాములమ్మ బీజేపీలో పనిచేసింది. ఇప్పటికే.. విజయశాంతితో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. రాములమ్మ కూడా బీజేపీలో చేరేందుకు సుముఖంగానే ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
దుబ్బాకలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం:
దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అన్ని విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు.. తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారని విజయశాంతి ఒక స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు. ఎన్నికల కోడ్ రావటానికి ముందే.. టీఆర్ఎస్ దుబ్బాకలో గెలిచేందుకు దుష్ర్పయోగాలు ప్రారంభించిందని ఆరోపించారు. కొన్నాళ్లుగా.. మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో.. దుబ్బాక ఉపఎన్నిక జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా.. కాదా అన్న సందేహాలు సమాజంలో వ్యక్తమవుతున్నాయని విజయశాంతి తన ప్రకటనలో తెలిపారు.