‘No Road No Vote’ Villagers demand : ‘ముందు రోడ్లు వేయండీ .. తరువాతే ఓట్లు అడగండి’ మునుగోడు నియోజవర్గం గ్రామస్తుల డిమాండ్

‘ముందు రోడ్లు వేయండీ .. తరువాతే ఓట్లు అడగండి’ అంటూ మునుగోడు నియోజవర్గంలోని ఓ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

No Road No Vote Villagers demand  : ఎన్నికల వస్తేనే రాజకీయ నాయకులకు ప్రజలు గుర్తుకొస్తారు. వారి కష్టాలు గుర్తుకొచ్చేస్తాయి. మీ కష్టాలు తీర్చేస్తామంటూ వాగ్ధానాలు ఇచ్చేస్తారు. గెలిచాక మళ్లీ ప్రజల్ని మర్చిపోతారు. అటువంటి రాజకీయనాయకులకుబుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది. కానీ రాజకీయ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మేస్తారు. ఓట్లు వేసి గెలిపించేస్తారు. ఆ తరువాత మరోసారి దగాపడ్డామని దిగాలు పడిపోతారు. ప్రజలు నేతల నుంచి ఏవో గొంతెమ్మ కోర్కెలు కోరటంలేదు. మౌలిక సదుపాయలు కల్పించాలని వేడుకుంటున్నారు. కనీసం తమ గ్రామాలకు నడవటానికి రోడ్డు వేయాలని కోరుకుంటున్నారు.మునుగోడులో ఉప ఎన్నిక జరుగనున్న క్రమంలో గెలుపు కోసం పార్టీలు కసరత్తులు చేస్తున్న వేళ..మునుగోడు నియోజకవర్గంలోని పడమటితాల్ల గ్రామ ప్రజలు వినూత్నంగా తమ డిమాండ్ ను ఫ్లెక్సీగా తయారు చేసి రాజకీయ పార్టీల ముందు పెట్టారు. అదేమంటే ‘రోడ్లు వేయండీ..ఓట్లు అడగండీ’ అంటూ తమ డిమాండ్ ను వినిపిస్తున్నారు..కాదు కాదు కనిపించేలా చేస్తున్నారు.

‘ మీకు మా ఓట్లు కావాలా.. అయితే మా గ్రామానికి రోడ్డు వెయ్యండి’ అంటున్నారు మునుగోడు నియోజకవర్గంలోని పడమటితాళ్ల గ్రామ ప్రజలు. సరైన రహదారి లేక ఎన్నో ఏళ్లుగా నానావస్థలు పడుతున్న పడబటితాళ్ల గ్రామప్రజలు మునుగోడు ఉప ఎన్నికను తమ అస్త్రంగా చేసుకున్నారు. ఓట్ల వేట కోసం వచ్చే రాజకీయ పార్టీల అభ్యర్థులకు తమ కోరిక ఇది అని స్పష్టం చేశారు. దీంట్లో భాగంగా ‘నో రోడ్‌.. నో ఓట్‌’ అని ముద్రించిన ఫ్లెక్సీలతో గురువారం (ఆగస్టు 25,2022) రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. రోడ్డు వేయించిన నేతకు తమ గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మరి ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని పడమటితాళ్ల, కోటయ్యగూడేలను కలిపి ఇటీవల గ్రామ పంచాయతీగా ఏర్పాటుచేశారు. పడమటితాళ్ల గ్రామ పంచాయతీలో మొత్తం జనాభా 1050 కాగా 630 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కోటయ్యగూడెంలో 410మంది, పడమటితాళ్లలో 210మంది ఓటర్లు ఉన్నారు.

జిల్లాలోని కనగల్‌-చండూరు మండలాల ప్రధాన రహదారి నుంచి రెండు కిమీ దూరంలోనే తమ గ్రామం ఉందని అయినా కనీస రోడ్లు సౌకర్యం కూడా లేదని వాపోతున్నారు. ఈక్రమంలో మునుగోడులో గెలుపు సాధించాలని ఉవ్విళ్లూరుతున్న రాజకీయ పార్టీలతో తమ డిమాండ్ ను కనిపించేలా వినూత్న డిమాండ్ చేస్తున్నారు పడమటితాళ్ల గ్రామస్తులు. గ్రామంలో 80 కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. మునుగోడు ఉపఎన్నిక జరుగనున్న క్రమంలో రహదారి సమస్యను పరిష్కరించాకే రాజకీయ పార్టీల నాయకులు తమను ఓటు అడగాలని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు