Floods in Telangana: తెలంగాణలో జోరుగా వానలు.. పొంగిన వాగులు.. ముంచెత్తిన వరదలు

తెలంగాణలో నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు, కుంటలు, చెక్‌ డ్యామ్‌లు పొంగి ప్రవహిస్తున్నాయి.

Floods

flash floods in telangana: తెలంగాణలో నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు, కుంటలు, చెక్‌ డ్యామ్‌లు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని జిన్నెలవాగు, పాలెంవాగు, కంకలవాగు, పెంకవాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వస్తున్న వరదనీటితో.. ప్రమాదకరంగా బొగత జలపాతం జాలువారుతోంది.

వరంగల్‌ జిల్లాలోని మాదన్నపేట చెరువు, పాకాల వాగు, గాదె వాగు, గుంజేడు వాగు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్‌లోని మధురా నగర్‌, ఎంహెచ్‌ నగర్‌, ఎస్సార్‌ నగర్‌, సుందరయ్య నగర్‌ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని కోల్‌బెల్ట్‌ ప్రాంతం జలమయమైంది. గోదావరి తీరప్రాంతంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలు, లారీల యార్డు, పంట పొలాలు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఎల్కపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న పెద్దవాగు వంతెనపై చిక్కుకున్న 9 మంది బీహార్‌ కార్మికులను రెస్క్యూ టీమ్స్‌ రక్షించాయి.

ఇక నిర్మల్ జిల్లాలో వరదలు కొనసాగుతున్నాయి. పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉండగా.. గూడెంగాం గ్రామస్తులు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకోగా.. మూడు రోజులుగా ముంపులోనే గూడెం గ్రామం ఉండటంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. భైంసా ఎస్టీ హాస్టల్‌లో 110 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. అధికారులు తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ఇవాళ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మరోవైపు నిర్మల్‌జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతూనే ఉన్నాయి.

ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా జూరాల ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి జలకళ సంతరించుకుంది. దీంతో 15గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. నల్లగొండ జిల్లాలో మూసీ ప్రాజెక్ట్‌కు వరదపోటు కొనసాగుతోంది. 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.