పోలీసులు డబ్బుంటేనే స్నేహం చేస్తారు.. జైళ్లలో పేదలే!

  • Publish Date - October 3, 2019 / 09:44 AM IST

ట్రెయినింగ్ అకాడమీలు.. డంపింగ్ యార్డులుగా మారిపోయాయంటూ తీవ్రంగా విమర్శించారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌ వినయ్ కుమార్ సింగ్ అలియాస్ వీకే సింగ్. సమాజంలో సామాజిక కార్యకర్తలుగా ఉండాల్సిన పోలీసులు.. డబ్బు, అధికారం ఉండేవాళ్లతో స్నేహంగా ఉంటూ సామాన్యులను పట్టించుకోట్లేదని ఆరోపించారు. అకాడమీలో మీడియాతో మాట్లాడిన వీకే సింగ్.. పోలీసులు ప్రభుత్వానికి జవాబుదారీ కాదని, చట్టానికి, న్యాయానికి మాత్రమేనని కానీ ఇప్పుడు ఉన్న పోలీసులు అలా ప్రవర్తించట్లేదని అన్నారు. పోలీస్ అకాడమీలో ఇస్తున్న శిక్షణ గ్రౌండ్ లో పనికి రావట్లేదని ఆయన అన్నారు.

పోలీసు ట్రైనింగ్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెడుతుంటే.. అదంతా వృధా అయిపోతుందని అన్నారు. పోలీస్ అకాడమీలు అనేవి స్కూళ్లు, కాలేజీలు లాంటివి కావని.. ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలో శిక్షణలో నేర్చుకోవాలని, నేర్పించాలని వీకే సింగ్ అన్నారు. పోలీసులు చెప్పింది ప్రజలు వింటారని.. కానీ ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదని, ట్రైనింగ్ సెంటర్‌లలో శిక్షణ తీసుకుని బయటకు వచ్చిన అధికారులు.. డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకు రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ప్రజల కోసం పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నా.. ఎక్కడా ప్రజల నుంచి గుర్తింపు రావట్లేదని అన్నారు. శిక్షణలో లోపమే ఇందుకు కారణం అని అన్నారు. బ్రిటీష్ కాలం నాటి ఆనవాయితీనే ఇంకా పోలీస్ శాఖలో కొనసాగుతుందని అన్నారు. అందువల్లే శిక్షణ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు కూడా డబ్బు ఉన్నవారికే పనిచేస్తున్నారని అన్నారు. 

జైళ్లలో ఉన్నవాళ్లు కూడా నూటికి తొంబై శాతం మంది డబ్బు ఉన్నవారికి మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారని.. జైళ్లలో ఉన్నవారు 90 శాతం మంది పేదవాళ్లు అని వాపోయారు వీకే సింగ్. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చామో కూడా తెలియదన్నారు. అవినీతి లేకుండా చేసేందుకు అందరూ ముందుకు రావాలని, వ్యవస్థను మార్చలేను కానీ, శిక్షణలో మార్పులు తీసుకొస్తానని వీకే సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

1987 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన వీకే సింగ్‌కు మరో రెండేళ్ల సర్వీసు ఉంది. ప్రస్తుతం వీకే సింగ్ అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. రెండేళ్ల నుంచి ఆయనకు డీజీపీ పదోన్నతి కూడా పెండింగ్‌లో ఉంది. వీకే సింగ్‌ ఉమ్మడి ఏపీలో పలు జిల్లాలకు ఎస్పీగా విధులు నిర్వహించారు. ఇటీవలే పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా నియమితులైన వీకే సింగ్.. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో సంచలనంగా మారాయి.