నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ఎన్నికల్లో ఇచ్చిన హమీలు నెరవేర్చే వరకు తమ నియోజకవర్గానికి రావద్దంటూ..ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డికి వ్యతిరేకంగా గోడవలకు పోస్టర్లు కనిపిస్తున్నాయి. అయితే ఆ వాల్ పోస్టర్ల వెనుక ప్రత్యర్ధి పార్టీల హస్తం ఉందంటూ కొట్టిపారేస్తున్నారు ఎమ్మెల్యే. ఒకవేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే పోస్టర్లు వేయించినా..సొంతంగా పనులు చేయిస్తానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు పబ్లిక్.
పోస్టర్ల కలకలంతో ఆర్మూర్ నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్‌పై గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో వెలిసిన వాల్ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో రాకేశ్ రెడ్డి సొంతంగా హమీలను ప్రకటించారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది అయిపోయింది.
ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దంటూ పోస్టర్లు
ఇచ్చిన హమీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ ప్రత్యర్ధి పార్టీలు ప్రశ్నిస్తుండగా..హమీలు నెరవేర్చకుండా ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దంటూ పోస్టర్లు వెలిశాయి. వాల్ పోస్టర్ల వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందంటూ బీజేపీ శ్రేణులు పైర్ అవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదయ్యాయి. అయితే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శిస్తున్నాయి.
రూపాయి ఆసుపత్రి, యువతకు ఉపాధి, ప్రతీ ఊరికి సొంతంగా పది ఇండ్లు నిర్మించి ఇస్తానన్న హమీలపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఉపాధి చూపిస్తానని యువతను ఆగం చేశావని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. హైదరాబాద్‌లోని తన ఇంటికి నియోజకవర్గ ప్రజలను ఎందుకు రావద్దంటున్నావో చెప్పాలంటూ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు.
ప్రజలకు దూరంగా ఉంటున్నారనే టాక్
ఎన్నికల కంటే ముందు రాకేశ్‌రెడ్డి కుటుంబ సభ్యులు..రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలను చేపట్టి ప్రజలతో మమేకం అయ్యారు. ఇప్పుడు మాత్రం ప్రజలకు దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడే రాకేశ్‌రెడ్డి తీరు..సొంత పార్టీ క్యాడర్‌కు మింగుడు పడటం లేదట. పైరవీలు, అక్రమాలు చేసేది లేదంటూ తెగేసి చెప్తుండటంతో..ఏం చేయాలో క్యాడర్‌కు అర్థం కావడం లేదట. ఆర్మూర్‌లో అధికార కాంగ్రెస్ నేతల పెత్తనం పెరగడాన్ని బీజేపీ శ్రేణులు తట్టుకోలేక పోతున్నారట.
ఇక అధికారుల పట్ల ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో అధికారులకు, ఎమ్మెల్యేకు సఖ్యత లోపిస్తుందట. గెలిచినప్పటి నుంచి తన మార్క్ అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని అంటున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు.
హమీలు నెరవేర్చే వరకు నియోజకవర్గానికి రావద్దంటూ ఆర్మూర్ ప్రజల పేరుతో వెలసిన పోస్టర్ల వెనుక ఎవరున్నప్పటికి.. ఆలస్యంగానైనా ఇచ్చిన హమీలు నెరువేరుస్తారంటున్నారు ఎమ్మెల్యేపై నమ్మకం ఉన్న జనాలు. ఇక తనపై విమర్శలు, ఆరోపణలు చేసేవారిని ఐ డోంట్ కేర్ అంటున్నారట ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టుర్లతో ఆర్మూర్ రాజకీయం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.
వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు.. చాలా శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది?