Wanaparthy Constituency : రసవత్తరంగా వనపర్తి లోకల్ పాలిటిక్స్.. కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా.. బీజేపీ అభ్యర్థి ఎవరంటే?

రాబోయే ఎన్నికల్లో మంత్రి నిరంజన్ రెడ్డికి.. ప్రత్యర్థులుగా ఎవరు బరిలో నిలుస్తారనేది ఆసక్తి రేపుతోంది. వనపర్తి కోటపై.. ఈసారి జెండా ఎగరేసే పార్టీ ఏదన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Wanaparthy Assembly Constituency : వనపర్తి.. ఉమ్మడి పాలమూరులో.. హాట్ సీటు. పైగా.. రాజకీయ ఉద్ధండులున్న సెగ్మెంట్. అలాంటి చోట.. లోకల్ పాలిటిక్స్ ఎంతో రసవత్తరంగా మారాయ్. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. వరుసగా రెండోసారి గెలవాలని చూస్తుంటే.. ఎలాగైనా సరే వనపర్తిలో జెండా ఎగరేయాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయ్. సీనియర్ నేత రావుల కోసం.. రెండు ప్రధాన పార్టీలు ఎదురుచూస్తున్నాయ్. దాంతో.. రాబోయే ఎన్నికల్లో మంత్రి నిరంజన్ రెడ్డికి.. ప్రత్యర్థులుగా ఎవరు బరిలో నిలుస్తారనేది ఆసక్తి రేపుతోంది. వనపర్తి కోటపై.. ఈసారి జెండా ఎగరేసే పార్టీ ఏదన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో.. వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌లో కనిపించబోయే పొలిటికల్ సీన్ ఏంటి?

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారెడ్డి, గిల్లెల, రావుల చంద్రశేఖర్ రెడ్డి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో.. వనపర్తి పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గానే ఉంటాయ్. పైగా.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాల రచనలో బిజీ అయిపోయాయ్. బీఆర్ఎస్‌కు.. మంత్రి నిరంజన్ రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి వేటలో పడ్డాయ్. ఇక.. వనపర్తి ఓటర్లు ఇచ్చే తీర్పు కూడా విలక్షణంగా ఉంటూ వస్తోంది. అది కూడా పార్టీలను.. టెన్షన్ పెడుతోంది. 1952లో వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 16 సార్లు ఎన్నికలు జరిగాయ్. జిల్లాలో.. కాంగ్రెస్‌కు బలమైన స్థానాల్లో వనపర్తి ఒకటి. ఇప్పటివరకు.. ఈ సీటులో.. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినన్ని సార్లు.. మరే పార్టీ క్యాండిడేట్లు విజయం సాధించలేదు. మధ్యలో నాలుగుసార్లు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు. ఇక.. మొట్టమొదటిసారి.. వనపర్తి కోటపై.. గులాబీ జెండా ఎగిరింది. గత ఎన్నికల్లో.. తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. వనపర్తి నియోజకవర్గం (Wanaparthy Constituency) పరిధిలో 7 మండలాలున్నాయి. అవి.. పెబ్బేరు, వనపర్తి, గోపాల్‌పేట, పెద్దమందడి, రేవల్లి, శ్రీరంగాపూర్, ఖిల్లా ఘనపూర్. వీటి పరిధిలో.. మొత్తం 2 లక్షల 31 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీళ్లలో.. బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. యాదవులతో పాటు దళిత సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

జి. చిన్నారెడ్డి (Photo: FB)

వనపర్తిలో కాంగ్రెస్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నారెడ్డి.. మంత్రిగానూ పనిచేశారు. తెలుగుదేశం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రావుల చంద్రశేఖర్ రెడ్డి (Ravula ChandraShekar Reddy) కూడా మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు.. తొలిసారి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన నిరంజన్ రెడ్డి కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. వనపర్తి రాజకీయాల్లో ముందునుంచి.. చిన్నారెడ్డి, రావుల మధ్యే నువ్వా-నేనా అన్నట్లుగా పరిస్థితులుండేవి. అయితే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. లోకల్ పాలిటిక్స్‌లో ఊహించని మార్పులొచ్చాయ్. 2014 ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా వీచినా.. వనపర్తిలో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిలోనే లేకుండా పోయినా.. ఇప్పటికీ పార్టీని వీడకుండా.. టీడీపీ క్యాడర్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి. వనపర్తిపై పట్టు కోల్పోకుండా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక.. 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన నిరంజన్ రెడ్డి.. గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచారు. కేసీఆర్ క్యాబినెట్‌లో.. వ్యవసాయశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Photo: FB)

2018 ఎన్నికల తర్వాత.. వనపర్తి నియోజకవర్గ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయ్. కాంగ్రెస్, టీడీపీకి చెందిన నాయకులను, కార్యకర్తలను.. బీఆర్ఎస్‌లో చేర్చుకోవడంతో ఆ పార్టీలు పూర్తిగా బలహీనపడ్డాయ్. అలా.. వనపర్తిలో బీఆర్ఎస్‌ని బలోపేతం చేయడంలో నిరంజన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లోనూ.. అధిష్టానం మళ్లీ ఆయన్నే బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. వనపర్తిలో ప్రస్తుతానికి.. మంత్రి నిరంజన్ రెడ్డికి తిరుగులేని పరిస్థితులు ఉన్నా.. కొంతకాలం క్రితమే.. సొంత పార్టీ నేతల్లోనే.. ఆయనపై వ్యతిరేకత మొదలైంది. కొన్నాళ్ల క్రితమే.. వనపర్తి జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి.. మంత్రి నిరంజన్ రెడ్డికి షాకిచ్చారు. ఆయనతో పాటు నలుగురు ఎంపీపీలు పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్‌ (Hot Topic)గా మారింది. దాంతో ఎన్నికల నాటికి వనపర్తి బీఆర్ఎస్‌లో తిరుగుబాటు నేతల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్ని.. నిరంజన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Also Read: హుజూరాబాద్ బరిలో బీఆర్ఎస్ ఎవరిని పోటీకి దించబోతోంది?

రావుల చంద్రశేఖర్ రెడ్డి (Photo: Twitter)

వనపర్తి.. ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గం కావడంతో.. హైకమాండ్ ఈ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే.. మళ్లీ వనపర్తిపై పట్టు సాధించాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ తరఫున.. మాజీ మంత్రి చిన్నారెడ్డి.. బరిలో నిలుస్తారా? లేదా? అన్నదే.. ఆసక్తిగా మారింది. మరోవైపు.. యూత్ కాంగ్రెస్ నాయకుడు శివసేనా రెడ్డి (Shiva Sena Reddy).. టికెట్ రేసులో ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం తనకే అవకాశం ఇస్తుందని.. అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని.. అనుచరులతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన జడ్పీ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తే.. నిరంజన్ రెడ్డిపై పోటీకి సిద్ధమన్నట్లుగా.. తన అనుచరులతో చెప్పుకుంటున్నట్లు సమాచారం. దీంతో.. కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై రకరకాల చర్చ సాగుతోంది. మరోవైపు.. తెలుగుదేశంలో ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డిని.. పార్టీలోకి ఆహ్వానించి.. ఆయన్ని కాంగ్రెస్ తరఫున వనపర్తి బరిలో దించాలనే ఆలోచనలోనూ కాంగ్రెస్ నాయకత్వం ఉందనే టాక్ వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు రావుల అత్యంత సన్నిహితుడిగా ఉండటంతో.. కాంగ్రెస్ ఈ విధంగా పావులు కదిపే చాన్స్ ఉందనే చర్చ సాగుతోంది.

ఇక.. బీజేపీ విషయానికొస్తే.. వనపర్తిలో పోటీకి ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. మంత్రి నిరంజన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు.. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి కోసం వేట మొదలుపెట్టింది. మరోవైపు.. మాజీ మంత్రి
రావుల చంద్రశేఖర్ రెడ్డి (Ravula ChandraShekar Reddy)ని బీజేపీలోకి ఆహ్వానించి.. పార్టీ తరఫున ఆయన్నే బరిలో దించేందుకు కూడా బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. మంత్రి నిరంజన్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన జడ్పీ ఛైర్మన్.. లోకనాథ్ రెడ్డి.. బీజేపీ నేతలకు కూడా టచ్‌లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌కు.. బలమైన అభ్యర్థి లేకపోవడంతో.. వనపర్తిలో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తామనే ధీమాలో.. బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. అయితే.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) వనపర్తిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సస్పెన్షన్ తర్వాత కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో.. మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. జూపల్లి చేసిన కామెంట్స్.. రాజకీయంగా చర్చకు దారితీశాయ్. దాంతో.. ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ వార్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. వనపర్తిలో పర్యటించి.. నిరంజన్ రెడ్డి గురించి అసలు నిజాల్ని బయటపెడతానని సవాల్ విసిరారు. మరోవైపు.. మంత్రి నిరంజన్ రెడ్డి సైతం కొల్లాపూర్‌లో పర్యటించి.. జూపల్లికి వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు. దాంతో.. రెండు నియోజకవర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు

Also Read: టికెట్ వార్‌లో గెలిచి గద్వాల్ కోటపై.. జెండా ఎగరేసేదెవరు?

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. వనపర్తిలో కాంగ్రెస్, బీజేపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థులను బట్టే.. మంత్రి నిరంజన్ రెడ్డి భవితవ్యం ఆధారపడి ఉంది. ఇప్పటికే కాస్త పొలిటికల్ ఇమేజ్ ఉన్న నేతలు గనక వనపర్తి నుంచి పోటీ చేస్తే.. అప్పుడు రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. మరోవైపు.. జూపల్లి కూడా వనపర్తిపై ఫోకస్ చేయడంతో.. ఈసారి నియోజకవర్గంలో ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు