Huzurabad Constituency: హుజూరాబాద్ బరిలో బీఆర్ఎస్ ఎవరిని పోటీకి దించబోతోంది?

నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ లో.. ఇప్పుడు బీజేపీ జెండా పాతేసింది. పోరాడి ఓడిన స్థానాన్ని.. ఎలాగైనా తిరిగి గెలవాలన్నదే బీఆర్ఎస్ టార్గెట్.

Huzurabad Constituency: హుజూరాబాద్ బరిలో బీఆర్ఎస్ ఎవరిని పోటీకి దించబోతోంది?

Huzurabad Assembly Constituency: ఒక్క బైపోల్.. మొత్తం పొలిటికల్ పిక్చర్నే మార్చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో.. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని హాట్ టాపిక్ గా మార్చేసింది. ఇప్పుడన్ని పొలిటికల్ పార్టీలకు.. రాబోయే ఎన్నికల్లో అక్కడ గెలవడమే సవాల్గా మారింది. నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న హుజూరాబాద్లో.. ఇప్పుడు బీజేపీ జెండా పాతేసింది. పోరాడి ఓడిన స్థానాన్ని.. ఎలాగైనా తిరిగి గెలవాలన్నదే బీఆర్ఎస్ టార్గెట్. ఎట్టి పరిస్థితుల్లోనూ.. పట్టు కోల్పోవద్దనేది కమలనాథుల ప్లాన్. ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టి.. గెలుపుని కబ్జా చేయాలనేది కాంగ్రెస్ స్ట్రాటజీ. మరి.. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ బరిలో నిలిచే గెలుపు గుర్రాలేవి? బీఆర్ఎస్ ఎవరిని పోటీకి దించబోతోంది? ఈటల తప్పుకుంటే.. బీజేపీ తరఫున పోటీ చేసేదెవరు? కాంగ్రెస్.. మరో అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టిందా?

Eatala Rajender
హుజూరాబాద్ అంటే.. మొన్నటిదాకా టీఆర్ఎస్ కంచుకోటగానే అందరికీ తెలుసు. కానీ.. ఒక్క బైపోల్ మొత్తం సీనే మార్చేసింది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ గెలుపుతో.. నియోజకవర్గంలో బీజేపీ బలపడింది. ఆ బైపోల్ దాకా.. కాంగ్రెస్ నుండి ప్రత్యర్థిగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి.. టికెట్ ఆశించి బీఆర్ఎస్ లో చేరగా.. పోటీ చేసే అవకాశం మాత్రం గెల్లు శ్రీనివాస్ కు దక్కింది. దాంతో.. హస్తం పార్టీ నుంచి బల్మూరి వెంకట్ పోటీ చేశారు. తర్వాత.. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇటీవలే.. గెల్లు శ్రీనివాస్ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ గా ఎంపికయ్యారు. ఇలా హుజూరాబాద్ (Huzurabad)లో జరిగిన ఒకే ఒక ఉప ఎన్నిక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలన్నింటినీ సమూలంగా మార్చేసింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈటల టార్గెట్ గా హుజూరాబాద్ లో బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులతో.. లోకల్ రాజకీయం ఫుల్ గా హీటెక్కుతోంది. గెల్లు శ్రీనివాస్ కు టూరిజం, బండ శ్రీనివాస్ కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. ఇలా చాలా మంది నేతలకు.. ఊహించని పదవులు దక్కాయి.

Padi Kaushik Reddy
ఒకప్పుడు కమలాపూర్ (Kamalpur) గా ఉన్న ఈ నియోజకవర్గం.. తర్వాత హుజూరాబాద్గా మారింది. అప్పటి నుంచి.. ఈటల రాజేందర్ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేసీఆర్, ఈటల మధ్య గ్యాప్ పెరిగింది. అది.. ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే దాకా వెళ్లింది. దాంతో.. 2021లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీని వీడారు ఈటల. తర్వాత.. బీజేపీలో చేరారు. ఫలితంగా వచ్చిన ఉపఎన్నికలో.. బీఆర్ఎస్ ఎంతో కష్టపడినా.. విజయం మాత్రం ఈటలనే వరించింది. ఈటల బీఆర్ఎస్ ను వీడిన తర్వాత.. పార్టీలో విభేదాలు పెరిగాయ్.

Gellu Srinivas Yadav
ఈటలపై ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన గెల్లు శ్రీనివాస్ కు, గతంలో ఈటలపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలై బీఆర్ ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి వర్గాల మధ్య పోరు సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి.. దూకుడు పెంచారు. ఇటీవల జమ్మికుంటలో భారీ సభ నిర్వహించగా.. మంత్రి కేటీఆర్ పరోక్షంగా కౌశిక్ రెడ్డే ఈసారి పోటీ చేస్తారనే సంకేతాలిచ్చారు. దాంతో.. ఈ మధ్య నియోజకవర్గ రాజకీయాల్లో గెల్లు శ్రీనివాస్ కాస్త సైలెంట్ అయ్యారు. అయినప్పటికీ.. అధిష్టానం మరోసారి తనకే అవకాశం ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు గెల్లు శ్రీనివాస్.

Also Read: సంగారెడ్డిలో జగ్గారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది.. బీఆర్ఎస్ ఈసారి జెండా ఎగరేస్తుందా?

హుజూరాబాద్ నియోజకవర్గంలో.. మొత్తం 2 లక్షల 35 వేలకు పైనే ఓటర్లున్నారు. వీళ్లలో.. బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. వాళ్లంతా.. ఈటలకు మద్దతుగా ఉన్నారనే టాక్ ఉంది. అయితే.. ఈసారి ఓటర్లంతా.. బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారనే నమ్మకంతో ఉన్నారు గులాబీ పార్టీ నేతలు. ఇందుకు.. హుజూరాబాద్లో 17 వేల మందికి పైగా దళితబంధు లబ్ధిదారులు ఉన్నారని.. వాళ్లంతా తమ వైపే ఉంటారనే ధీమాతో ఉన్నారు. కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తే.. రెడ్డి సామాజికవర్గం ఓట్లు కలిసొస్తాయనే అభిప్రాయం ఉంది. గెల్లు శ్రీనివాస్ కు అవకాశం ఇస్తే.. యాదవుల ఓట్లు పడతాయనే ఆలోచనలో ఉన్నారు. ఉప ఎన్నికలో.. సెంటిమెంట్ కారణంగానే ఈటల గెలిచారని.. వచ్చే ఎన్నికల్లో మాత్రం గెలవబోయేది తామేనని.. బీఆర్ఎస్ (BRS Party) నేతలు లెక్కలేసుకుంటున్నారు.

Eatala Jamuna Rajender
ఇక.. హుజూరాబాద్ లో జరిగిన అభివృద్ధి అంతా.. తన హయాంలోనే జరిగిందంటున్నారు ఈటల రాజేందర్. ఉప ఎన్నికల తర్వాత.. ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని విమర్శిస్తున్నారు. అయితే గజ్వేల్ నుండి పోటీ చేస్తానంటూ గతంలో ఈటెల రాజేందర్ (Eatala Rajender) ఫ్రకటించడంతో రానున్న ఎన్నికల్లో బిజేపీ నుండి ఎవరు పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. నిజంగానే ఈటల గజ్వేల్ బరిలో సీయం కేసీఆర్ పై పోటీ చేస్తే.. ఇక్కడి నుండి ఆయన భార్య బరిలో దిగే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది.

ఈటల వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో ఆయన ఫెయిలయ్యారని విమర్శిస్తున్నారు. ఉప ఎన్నికల తరవాత కూడా హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెబుతున్నారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ (Gellu Srinivas Yadav) కూడా టికెట్ రేసులో ఉండగా.. రాబోయే ఎన్నికల్లో.. ఈటలకు ప్రత్యర్థిగా బరిలో నిలవబోయేది తానేనని చెబుతున్నారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.

Also Read: కాక రేపుతోన్న కొల్లాపూర్ రాజకీయాలు.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జూపల్లి

కాంగ్రెస్ విషయానికొస్తే.. గత ఉపఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ నే.. రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బైపోల్లో ఓడినప్పటి నుంచి ఆయన నియోజకవర్గంపై దృష్టి పెట్టి తనవంతు ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే గ్రేటర్ లోని ఏదైనా నియోజకవర్గం బరిలో బల్మూరి బరిలో దిగుతారా… మరోసారి హుజూరాబాద్ లోనే తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటారా అనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. ఈ ఏడాది.. పార్టీలో మార్పులు, చేర్పులు జరుగుతాయనే చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ హయాంలోనే.. హుజూరాబాద్ అభివృద్ధి జరిగిందని.. ఉప ఎన్నికలో బీజేపీ, బీఆర్ఎస్.. ప్రజల్ని తప్పుదారి పట్టించాయని బల్మూరి వెంకట్ విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో.. హుజూరాబాద్ లో ఎగరబోయేది కాంగ్రెస్ జెండానేనని దీమా వ్యక్తం చేస్తున్నారు.

ఓవరాల్ గా.. హుజూరాబాద్ లో 3 పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. వచ్చే ఎన్నికలు మాత్రం ఈటల రాజేందర్ కు ప్రెస్టీజ్ ఇష్యూగా మారనున్నాయి. అదేవిధంగా.. బీఆర్ఎస్కు కూడా హుజూరాబాద్ సీటు పరువు సమస్యగా మారింది. అయితే.. ఈ మధ్య.. ఈటల రాజేందర్ కేసీఆర్ మీద పోటీ చేస్తానని ప్రకటించడం.. గజ్వేల్ బరిలో ఉంటానని చెప్పారు. దాంతో.. రాబోయే ఎన్నికల్లో.. హుజూరాబాద్ బరిలో.. ఈటల సతీమణి జమున పోటీ చేస్తారనే టాక్ వినిపించింది. నిజంగానే.. ఈటల.. కేసీఆర్ పై పోటీ చేస్తారా? లేక.. సైలెంట్ గా ఊరుకుంటారా? అన్నది.. సస్పెన్స్ గా మారింది. ఏదైమైనా.. హుజూరాబాద్ లో ఈటల విజయ పరంపరకు.. చెక్ పెట్టాలనే బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా.. లేదా.. అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.