Sangareddy Constituency : సంగారెడ్డిలో జగ్గారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది.. బీఆర్ఎస్ ఈసారి జెండా ఎగరేస్తుందా?

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏదైనా హాట్ సీటు ఉందంటే.. అది కచ్చితంగా సంగారెడ్డే. అలాంటి.. సెగ్మెంట్‌లో రాజకీయం పుట్టిస్తున్న వేడి అంతా ఇంతా కాదు.

Sangareddy Constituency : సంగారెడ్డిలో జగ్గారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది.. బీఆర్ఎస్ ఈసారి జెండా ఎగరేస్తుందా?

sangareddy assembly constituency: సంగారెడ్డిలో సమ్మర్ హీటే కాదు.. పొలిటికల్ హీట్ కూడా పెరిగిపోయింది. అప్పుడే.. నియోజకవర్గంలో ఎలక్షన్ వెదర్ కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్‌తో పాటు బీజేపీలోనూ ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం.. ఈసారి కూడా తనదే గెలుపనే ధీమాతో ఉన్నారు. మరి.. జగ్గారెడ్డిని ఢీకొట్టగల నాయకులు.. మిగతా పార్టీల్లో ఉన్నారా? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో దిగబోతున్నారు? అసలు.. సంగారెడ్డి.. జగ్గారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది? బీఆర్ఎస్.. ఈసారి గులాబీ జెండా ఎగరేస్తుందా? మొత్తంగా.. సంగారెడ్డి సెగ్మెంట్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

Thurupu, Chinta, Deshpande

జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్‌, దేశ్‌పాండే రాజేశ్వర్‌రావు

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏదైనా హాట్ సీటు ఉందంటే.. అది కచ్చితంగా సంగారెడ్డే. అలాంటి.. సెగ్మెంట్‌లో రాజకీయం పుట్టిస్తున్న వేడి అంతా ఇంతా కాదు. అన్ని పార్టీల నాయకులు.. గెలుపు తమదేననే ధీమాతో ఉన్నారు. ఎక్కడైనా ఇది కామన్. కానీ.. సంగారెడ్డి ఏమనుకుంటుందన్నదే మెయిన్ పాయింట్. గత ఎన్నికల ఫలితాలు చూస్తే.. కనిపిస్తున్న సీన్ కూడా అదే. స్టేట్‌లో పొలిటికల్ వేవ్ ఎలా ఉన్నా.. సంగారెడ్డి తీర్పు మాత్రం అందుకు భిన్నంగా ఉంటూ వస్తోంది. 1957లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు.. 14 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక.. బీఆర్ఎస్ రెండు సార్లు, బీజేపీ, టీడీపీ ఒక్కోసారి జెండా ఎగరేశాయ్. కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి.. అలియాస్ జగ్గారెడ్డి (Thurupu Jagga Reddy).. సంగారెడ్డి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో ఆయన తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2009, 2018లో మాత్రం.. కాంగ్రెస్ తరఫున గెలిచారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు వరకు.. సంగారెడ్డి (sangareddy) అంటే కాంగ్రెస్ అడ్డా అనే టాక్ ఉండేది స్టేట్‌లో. 2014 ఎన్నికల్లో మాత్రం అక్కడ గులాబీ జెండా ఎగిరింది. ఆ టైమ్‌లో.. సంగారెడ్డిలో బీఆర్ఎస్ బలపడినట్లు అనిపించినా.. గత ఎన్నికల సమయానికి మొత్తం సీనే మారిపోయింది. స్వల్ప ఓట్ల తేడాతో.. కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాశ్ రెడ్డి గెలుపొందడంతో.. సంగారెడ్డిపై మళ్లీ హస్తం పట్టు సాధించింది.

Thurupu Jagga Reddy

జగ్గారెడ్డి (Photo: FB)

జగ్గారెడ్డి వన్ మ్యాన్ షో
సంగారెడ్డి నియోజకవర్గం మొదట్నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగానే ఉంది. గత ఎన్నికల్లో.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో.. 9 బీఆర్ఎస్ గెలవగా.. ఒక్క సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి.. స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 15 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. ముదిరాజ్ (Mudiraj) సామాజికవర్గానికి చెందిన ఓట్లు 49 వేలకు పైనే ఉన్నాయి. అలాగే.. దళితుల ఓట్లు 45 వేలు, ముస్లిం, మైనారిటీ వర్గాల ఓట్ బ్యాంక్ 40 వేల దాకా ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో.. బీఆర్ఎస్ తరఫున చింతా ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో.. సిట్టింగ్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌పై.. 2500 లకు పైగా మెజారిటీతో.. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డినే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: లోకల్ లీడర్లను టెన్షన్ పెడుతున్న రామగుండం రాజకీయాలు!

సంగారెడ్డి కాంగ్రెస్‌లో.. ఆయనదంతా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. హస్తం పార్టీ నుంచి టికెట్ ఆశించే నేతలు.. ఇక్కడ పెద్దగా కనిపించరు. కొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేసినా.. మళ్లీ వెనక్కి తగ్గారు. దాంతో.. సంగారెడ్డి కాంగ్రెస్‌లో జగ్గారెడ్డికి.. తిరుగులేకుండా పోయింది. గత ఎన్నికల్లో.. స్వల్ప మెజారిటీతో గెలిచిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి.. గత ఎన్నికల్లో.. స్వల్ప మెజారిటీతో గెలిచిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి (Turupu Jayaprakash Reddy).. రానున్న ఎన్నికలపై ఇప్పటినుండే ఫోకస్ పెంచారు. అయితే కాంగ్రెస్ గ్రూప్ తగాదాలతో రానున్న ఎన్నికల నాటికి జగ్గారెడ్డి దారెటో అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ లోనే ఉంటారా… సొంతకుంపటి పెట్టుకున్నారా… అదీఇదీ కాదని కారెక్కేస్తారా అన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి.

Chinta Prabhakar

చింతా ప్రభాకర్‌ (Photo: Twitter)

బలం పుంజుకున్న బీఆర్ఎస్
ఉమ్మడి మెదక్ జిల్లాలో.. గత ఎన్నికల్లో పదికి 9 సీట్లు గెలిచిన బీఆర్ఎస్.. ఈసారి పదికి పది స్థానాలు కైవసం చేసుకోవాలనే కసితో ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్క సంగారెడ్డి ఎంపీపీ మినహా.. మిగతా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో.. గులాబీ పార్టీనే గెలిచింది. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ పాగా వేసింది. గతంతో పోలిస్తే.. సంగారెడ్డి సెగ్మెంట్‌లో.. బీఆర్ఎస్ బలం పుంజుకుందనే చెప్పాలి. ఇక.. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కే.. ఈసారి టికెట్ దక్కే అవకాశాలున్నాయనే టాక్ గులాబీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఓటమి తర్వాత.. ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రోటోకాల్ అడ్డంకిగా మారిందనే ఉద్దేశంతోనే.. కేసీఆర్ చేనేత కార్పొరేషన్ ఛైర్మన్ పదవినిచ్చారనే ప్రచారం కూడా సాగుతోంది. అందువల్ల.. రాబోయే ఎన్నికల బరిలో చింతా ప్రభాకరే ఉంటారని అంతా భావిస్తున్నారు. ఇక.. డీసీసీబీ వైస్ ఛైర్మన్ పట్నం మాణిక్యం, పులిమామిడి రాజు(Pulimamidi Raju) కూడా.. ఈసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ముస్లింలు, మైనారిటీ వర్గాలు, ఇతర సామాజికవర్గాల ఓటర్లంతా.. బీఆర్ఎస్ వైపే ఉన్నారని చింతా ప్రభాకర్ చెబుతున్నారు. ఈసారి సంగారెడ్డిలో ఎగరబోయేది బీఆర్ఎస్ జెండానే అనే ధీమాతో కనిపిస్తున్నారు.

Deshpande Rajeshwar Rao

దేశ్‌పాండే రాజేశ్వర్‌రావు (Photo: Twitter)

బీజేపీలో నాయకత్వ లోపం
సంగారెడ్డి బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నాయకులంతా.. ప్లెక్సీలకే పరిమితమయ్యారనే టాక్ ఉంది. అయినప్పటికీ.. కాషాయం పార్టీ నుంచి టికెట్ రేసులో ఉన్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన దేశ్‌పాండే రాజేశ్వర్‌రావు (Deshpande Rajeshwar Rao).. ఈసారి కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో కంటే.. పార్టీలో జోష్ బాగా పెరిగిందని.. ఈసారి యువతరం ఓట్లు బీజేపీకి పడతాయని.. సంగారెడ్డిలో కమలం విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు. దేశ్ పాండేతో పాటు ఉద్యోగ సంఘాల నేత విఠల్ (Vital) కూడా టికెట్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సదాశివపేటకు చెందిన శివరాజ్ పాటిల్ కూడా.. ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ రేసులో ఎందరున్నా.. బీజేపీ నాయకత్వం చూపు మాత్రం దేశ్ పాండే వైపే ఉందనే టాక్ వినిపిస్తోంది. కానీ.. ఎన్నికల నాటికి.. అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.

Also Read: పటాన్‌చెరులో గెలిచే పఠాన్ ఎవరు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా?

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ
బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు బాగానే ఉన్నా.. సంగారెడ్డిలో మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందనే చర్చ సాగుతోంది. రెండు పార్టీలు నువ్వా-నేనా అనే రీతిలో పోటీపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో.. సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యేగా ఓడినా.. జనం మధ్యే ఉంటున్నానని.. సీఎంని ఒప్పించి.. నిధులు తెప్పించి.. నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిచేలా చేస్తున్నానని.. చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న సంగారెడ్డిలో.. జగ్గారెడ్డి తిరిగి విజయం సాధిస్తారా? అధికార బీఆర్ఎస్ మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. లేక.. అనూహ్యంగా.. బీజేపీ విజయం సాధించి.. అందరినీ ఆశ్చర్యపరుస్తుందా? అనేది.. ఇంట్రస్టింగ్‌గా మారింది.