Patancheru: పటాన్‌చెరులో గెలిచే పఠాన్ ఎవరు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా?

సొంత పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెట్టేందుకు రెడీగా ఉన్నదెవరు? ప్రత్యర్థి పార్టీల నుంచి జీఎంఆర్‌ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులెవరు? రాబోయే ఎన్నికల్లో పటాన్‌చెరులో కనిపించబోయే సీనేంటి?

Patancheru: పటాన్‌చెరులో గెలిచే పఠాన్ ఎవరు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా?

Patancheru Assembly Constituency: తెలంగాణలోనే రిచెస్ట్ సెగ్మెంట్.. పటాన్‌చెరు. నియోజకవర్గం ఏర్పడిన మొదట్లో.. ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఈ సీటు.. గులాబీ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. ఈసారి కూడా ఇక్కడి రాజకీయం ఫుల్ హీట్ పుట్టిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుందన్నది ఆసక్తిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీన్మార్ విక్టరీతో సత్తా చాటుతారా? లేక.. కారు స్పీడ్‌కి ప్రత్యర్థి పార్టీలు బ్రేకులు వేస్తాయా? అన్నది ఉత్కంఠగా మారింది. మొత్తంగా ఈ సెగ్మెంట్‌లో కనిపించబోయే పొలిటికల్ సీనేంటి? ఈసారి పటాన్‌చెరులో గెలిచే పఠాన్ ఎవరు?

పటాన్‌చెరులో కనిపించబోయే సీనేంటి?
తెలంగాణలో మినీ ఇండియాగా పిలుచుకునే అసెంబ్లీ సెగ్మెంట్ పటాన్‌చెరు. ఇక్కడ.. ప్రతి గల్లీలో కనీసం పది రాష్ట్రాలకు చెందిన వాళ్లు కనిపిస్తుంటారు. వాళ్లంతా.. కలిసిమెలిసి ఉంటారు. 2009లో జరిగిన నియోజకవర్గాల డీలిమిటేషన్‌లో భాగంగా సంగారెడ్డి సెగ్మెంట్ నుంచి విడిపోయి.. పటాన్‌చెరు నియోజకవర్గం ఏర్పడింది. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా.. తర్వాత వరుసగా రెండు సార్లు గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన గూడెం మహిపాల్ రెడ్డి.. రెండుసార్లు గెలిచి.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. సొంత పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెట్టేందుకు రెడీగా ఉన్నదెవరు? ప్రత్యర్థి పార్టీల నుంచి జీఎంఆర్‌ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులెవరు? రాబోయే ఎన్నికల్లో పటాన్‌చెరులో కనిపించబోయే సీనేంటి? ఇవన్నీ చూసేముందు.. పటాన్‌చెరు సెగ్మెంట్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, విశేషాలు కొన్ని ఉన్నాయ్.

ఈ నియోజకవర్గంలో మొత్తంగా 3 లక్షల 28 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. ఈ సెగ్మెంట్‌లో 5 మండలాలు ఉన్నాయి. అవి.. అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల, రామచంద్రాపురం, పటాన్‌చెరు. అలాగే.. తెల్లాపూర్, అమీన్‌పూర్, బొల్లారం మున్సిపాలిటీలుగా ఉన్నాయి. రామచంద్రాపురం, పటాన్‌చెరు, భారతీనగర్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో భాగంగా ఉన్నాయి.

Gudem Mahipal Reddy

Gudem Mahipal Reddy

మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొడతారా?
మినీ ఇండియాని తలపించే పటాన్‌చెరు సెగ్మెంట్‌లో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ ప్రాంతంలో.. చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలన్నీ కలిపి 5 వేల పైనే ఉంటాయ్. రాష్ట్రంలోనే ప్రముఖ పారిశ్రామిక ప్రాంతంగా పేరున్న పటాన్‌చెరులో.. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిన కార్మికుల ఓట్లే.. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయిస్తుంటాయ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ.. బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో లక్షా 16 వేలకు పైగా ఓట్లు సాధించిన గూడెం మహిపాల్ రెడ్డి.. 37 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. రాబోయే ఎన్నికల్లో.. ముచ్చటగా మూడోసారి గెలిచి పటాన్‌చెరులో కొత్త చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు మహిపాల్ రెడ్డి.

అధికారి పార్టీలో అసమ్మతి సెగ
సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాన్ఫిడెంట్‌గానే కనిపిస్తున్నా.. ఆయనకు సొంతపార్టీ నుంచే అసమ్మతి సెగ తప్పడం లేదు. చిట్కుల్ సర్పంచ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు.. నీలం మధు ఎమ్మెల్యేకు దీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో.. బీఆర్ఎస్ నుంచి తాను టికెట్ రేసులో ఉన్నానని.. అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయనే ధీమాతో ఉన్నారు నీలం మధు. భూపాల్ రెడ్డి, కొలన్ బాల్ రెడ్డి కూడా పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నప్పటికీ.. వాళ్లిద్దరూ అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. దాంతో.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, నీలం మధు మధ్యే.. టికెట్ విషయంలో పోటీ నెలకొంది. బీఆర్ఎస్ అధిష్టానం గనక.. సిట్టింగుల్లో కొందరికి సీటు నిరాకరిస్తే.. ఆ లిస్టులో ఫస్టు ఉండేది.. మహిపాల్ రెడ్డేననే నమ్మకంతో ఉన్నారు నీలం మధు. ఎమ్మెల్యేకు దీటుగా పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నా.. పార్టీ అధినాయకత్వం చూసీచూడనట్లుగా ఉండటంతో.. మధు రోజురోజుకు స్పీడ్ పెంచుతున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ క్యాడర్‌లోనూ.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరుపై అక్కడక్కడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. దాంతో.. పార్టీలో నెలకొన్న అసమ్మతిని.. తనకు అనుకూలంగా మార్చుకొని.. అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు నీలం మధు. పైగా.. నియోజకవర్గంలో సొంత సామాజికవర్గమైన ముదిరాజుల ఓట్లు.. 70 వేల దాకా ఉండటం కూడా తనకు కలిసొస్తుందని నమ్మతున్నారు నీలం మధు.

Also Read: ఖైరతాబాద్ ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది.. ట్రయాంగిల్ ఫైట్‌లో తడాఖా చూపేదెవరు?

Gali Anil Kumar

Gali Anil Kumar

కాంగ్రెస్ టికెట్ ఎవరికో?
ఇక.. పటాన్‌చెరులో బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమి చవిచూసిన గాలి అనిల్ కుమార్.. ఈసారి పటాన్‌చెరు నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. హస్తం పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాటా శ్రీనివాస్ గౌడ్.. ఈసారి కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో రెండుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన సపనదేవ్.. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఆయనంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. త్వరలోనే.. ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. దాంతో.. కాంగ్రెస్ అధిష్టానం.. అనిల్ కుమార్ వైపు మొగ్గుతుందా? కాటా శ్రీనివాస్ గౌడ్‌కే మరో చాన్స్ ఇచ్చి చూస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ద్వారా గాలి అనిల్ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటే.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ద్వారా శ్రీనివాస్ గౌడ్ తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో.. కాంగ్రెస్‌ అభ్యర్థికి 78 వేల పైనే ఓట్లు వచ్చాయి. ఆ లెక్కన చూసుకుంటే.. పటాన్‌చెరు సెగ్మెంట్‌లో కాంగ్రెస్ కొంత పటిష్టంగానే కనిపిస్తుంది. అయితే ఈసారి.. ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నదే ఆసక్తిగా మారింది.

Also Read: రాబోయే ఎన్నికల్లో.. ఖమ్మం గుమ్మంలో కనిపించబోయే సీనేంటి.. ఆ ముగ్గురు పోటీ చేస్తే..?

Nandeshwar Goud

Nandeshwar Goud

బీజేపీ ఆశావహుల లిస్ట్ పెద్దదే..
బీజేపీ విషయానికొస్తే.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల లిస్ట్ పెద్దదిగానే కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్‌తో పాటు గడీల శ్రీకాంత్ గౌడ్, గోదావరి అంజిరెడ్డి.. టికెట్ రేసులో ఉన్నారు. వీళ్లంతా ఎవరి స్థాయిలో వాళ్లు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్‌పై పార్టీ అధిష్టానం దగ్గర సదభిప్రాయం లేదని.. ఆయనపై గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలు మైనస్‌గా మారుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. గడీల శ్రీకాంత్ గౌడ్, గోదావరి అంజిరెడ్డిలో.. ఎవరో ఒకరిని అధిష్టానం ఫైనల్ చేస్తుందనే టాక్.. కాషాయ శ్రేణుల్లో వినిపిస్తోంది. పటాన్‌చెరు సెగ్మెంట్‌లో స్థిరపడిన ఉత్తర భారతీయుల స్టాండర్డ్ ఓట్ బ్యాంక్.. బీజేపీకి కలిసొస్తుందని.. పార్టీ నేతలు నమ్ముతున్నారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాత్రం.. తనకే టికెట్ వస్తుందని గట్టిగా చెబుతున్నారు.

Gudem Mahipal ReddyNandeshwar Goud Gali Anil Kumar

Gudem Mahipal Reddy, Nandeshwar Goud, Gali Anil Kumar

ట్రయాంగిల్ ఫైట్
ఓవరాల్‌గా చూసుకుంటే.. పటాన్‌చెరు నియోజకవర్గంలో.. ఈసారి ట్రయాంగిల్ ఫైట్ తప్పదనిపిస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నారు. పైగా.. ఈసారి పాలిటిక్స్ చాలా రసవత్తరంగా నడుస్తున్నాయి. అందువల్ల.. పటాన్‌చెరు రాజకీయం కూడా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా.. ఇక్కడ బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? లేదా? అనేదే ఇంట్రస్టింగ్‌గా మారింది. ఓటర్లను ఆకట్టుకొని.. ఈసారి పటాన్‌చెరులో పాగా వేసే పార్టీ ఏదనే దానిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. మొత్తంగా.. పటాన్‌చెరు సెగ్మెంట్‌లో రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.

Also Read: 3 ఎన్నికలు.. 3 విలక్షణమైన తీర్పులు.. ఈసారి వైరాలో గెలిచేది ఏ పార్టీ అభ్యర్థి?