Kollapur: కాక రేపుతోన్న కొల్లాపూర్ రాజకీయాలు.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జూపల్లి

లోకల్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ తీరును ఎండగడుతూ కారు దిగిన జూపల్లి.. నెక్ట్స్ ఏ కండువా కప్పుకోబోతున్నారు? ఆయన చేరబోయే పార్టీలో.. ఇప్పటికే ఉన్న ఆశావహుల పరిస్థితేంటి?

Kollapur: కాక రేపుతోన్న కొల్లాపూర్ రాజకీయాలు.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జూపల్లి

Kollapur Assembly constituency: ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో.. కాక రేపుతున్న నియోజకవర్గం ఏదైనా ఉందీ అంటే.. అది కచ్చితంగా కొల్లాపూరే. రెండు దశాబ్దాలుగా కొల్లాపూర్ అంటే జూపల్లి.. జూపల్లి అంటే కొల్లాపూర్ అనేలా మారిపోయారు మాజీ మంత్రి కృష్ణారావు. ఇప్పుడు.. ఆయన రాజకీయంగా వేయబోయే అడుగులు.. లోకల్ పాలిటిక్స్‌లోనే కాదు.. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లోనే కీలకంగా మారిపోయాయ్. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హర్షవర్ధన్ రెడ్డి.. ఈసారి బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగడం ఖాయమే అయినప్పటికీ.. ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా నిలబబోతున్న జూపల్లి.. ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్న చర్చే.. నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. లోకల్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ తీరును ఎండగడుతూ కారు దిగిన జూపల్లి.. నెక్ట్స్ ఏ కండువా కప్పుకోబోతున్నారు? ఆయన చేరబోయే పార్టీలో.. ఇప్పటికే ఉన్న ఆశావహుల పరిస్థితేంటి? ఇవే.. ఇప్పుడు కొల్లాపూర్ రాజకీయాల్లో కాక రేపుతున్నాయ్. దాంతో.. ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో.. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో అర్థం కాని పరిస్థితి.. కొల్లాపూర్‌లో నెలకొంది.

బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు తర్వాత.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) రాజకీయంగా దూకుడు పెంచారు. ఇప్పుడు.. కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు.. ఆయన వైపే చూస్తున్నాయ్. ఆయనొక్కరు.. తమ పార్టీలో చేరితో చాలనుకుంటున్నాయ్. అంతేకాదు.. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో.. ఇప్పుడు కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా హాట్ టాపిక్ గా మారింది. అక్కడ ఇప్పటికే నెలకొన్న రచ్చ.. మున్ముందు ఏ స్థాయికి చేరబోతుందన్నది ఆసక్తిగా రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి మధ్య ఇప్పటికే నెలకొన్న ఆధిపత్య పోరు.. ఇప్పుడు డబుల్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. దాంతో.. కొల్లాపూర్ పై.. బీఆర్ఎస్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. దాంతో.. స్టేట్ పాలిటిక్స్ లోనే కాదు.. కొల్లాపూర్ పొలిటికల్ జంక్షన్లోనూ.. జూపల్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో.. కొల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాలు చాలా డిఫరెంట్. 1952లో ఏర్పడిన కొల్లాపూర్ నియోజకవర్గానికి.. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయ్. ఇందులో.. అత్యధికంగా 8 సార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. రెండుసార్లు బీఆర్ఎస్ గెలిచింది. గతంలో.. ఐదు మండలాలున్న కొల్లాపూర్లో ఇప్పుడు కొత్తగా మరో రెండు మండలాలు చేరాయి. ఇప్పుడు.. కొల్లాపూర్(Kollapur), పెద్దకొత్తపల్లి, పానగల్, కోడేర్, వీపనగండ్ల, పెంట్లవెల్లి, చిన్నంబావి మండలాలున్నాయి. వీటిలో.. నాలుగు మండలాలు నాగర్ కర్నూలు(Nagarkurnool) జిల్లాలోనూ.. మిగతా మూడు వనపర్తి జిల్లాలోనూ ఉంటాయి.

కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తంగా 2 లక్షల 46 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. ఇందులో.. యాదవ, కురుమ, గౌడ, ఎస్సీ సామాజికవర్గాల ఓటర్లే అధికంగా ఉంటారు. కానీ.. ఇక్కడి అభ్యర్థుల గెలుపోటముల్లో మాత్రం వెలమ సామాజికవర్గం కీలకపాత్ర పోషిస్తూ వస్తోంది. దాంతో.. ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది.. వెలమ సామాజికవర్గానికి చెందిన నేతలే ఉన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉండే కొల్లాపూర్ నియోజకవర్గం.. సోమశిల అందాలతో అందరినీ ఆకర్షించేలా ఉంటుంది. చారిత్రక కట్టడాలు, కవులు, కళాకారులకు.. ఈ నియోజకవర్గం పుట్టినిల్లులాంటిదని చెప్పొచ్చు. ప్రధానంగా.. కొల్లాపూర్ సెగ్మెంట్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న శ్రీశైలం భూ నిర్వాసితులకు సంబంధించిన 99జీవో.. ప్రతి ఎన్నికల్లో హామీగా నిలుస్తుంది. కానీ.. అది ఎవరూ అమలు చేయడం లేదన్న విమర్శలున్నాయ్.

కొల్లాపూర్ పాలిటిక్స్.. ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటాయ్. ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశించే వాళ్ల లిస్టు.. ఎప్పుడూ భారీగానే ఉంటుంది. ఎంతమంది నేతలు పుట్టుకొచ్చినా.. ఎవరు పోటీ చేసినా.. కొల్లాపూర్ (Kollapur) రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా సెంటర్ పాయింట్గా ఉన్నది మాత్రం జూపల్లి కృష్ణారావే. వరుసగా.. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. ఏకంగా నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్లలో మంత్రిగా ఉంటూ.. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఒకసారి స్వతంత్రంగా, రెండు సార్లు కాంగ్రెస్ నుంచి.. మరో రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు జూపల్లి. రెండు దశాబ్దాలుగా ఆయన కనుసన్నల్లోనే కొల్లాపూర్ రాజకీయం సాగుతూ వచ్చింది.

2012లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో.. తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం.. మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి కారెక్కేశారు జూపల్లి కృష్ణారావు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో.. గులాబీ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ.. బీఆర్ఎస్ తరఫున మరోసారి గెలిచి.. కేసీఆర్ తొలి కేబినెట్లో బెర్త్ సంపాదించుకున్నారు జూపల్లి. కీలకమైన పరిశ్రమల శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖలోనూ.. మంత్రిగా తనదైన ముద్ర వేశారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానమైన టీఎస్-ఐపాస్తో పాటు కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన కూడా జూపల్లి మంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే. అయినప్పటికీ.. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా కారు జోరు సాగినా.. కొల్లాపూర్లో మాత్రం కాంగ్రెస్ పాగా వేసింది. ఐదు వరుస విజయాల తర్వాత.. తొలిసారి జూపల్లికి ఓటమి ఎదురైంది.

Also Read: స్టేషన్ ఘన్‌పూర్‌లో అధికార పార్టీకి గట్టి పోటీ తప్పదా?

ఇక.. మారిన రాజకీయ పరిణామాలతో.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి కూడా కారెక్కేయడంతో.. గులాబీదళంలో గ్రూపు రాజకీయాలకు బీజం పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వర్గ పోరు తీవ్రస్థాయికి చేరింది. ఒకే పార్టీలో ఉంటూనే.. వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకోవడంతో.. లోకల్ పాలిటిక్స్లో కాక పెరుగుతూ వచ్చింది. గత మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి వర్సెస్ బిఆర్ఎస్ పార్టీగా కొల్లాపూర్ ఎన్నికలు జరిగాయి. కారు పార్టీలోనే ఉండి సొంతంగా 11 డివిజన్లలో జూపల్లి వర్గీయులు గెలవగా.. బీఆర్ఎస్ 9 డివిజన్లకే పరిమితమైంది. దాంతో.. నియోజకవర్గంలో కారు పార్టీ రాజకీయం రోడ్డున పడింది. దాన్ని చల్లార్చేందుకు.. స్వయంగా కేటీఆరే రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది.

Beeram Harshavardhan Reddy
హర్షవర్ధన్ రెడ్డికి లైన్ క్లియర్
 

మూడేళ్ల పాటు ఇద్దరు నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్.. చివరకు జూపల్లి కృష్ణారావు సస్పెన్షన్కు దారితీసింది. ఖమ్మం జిల్లాలో జరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి కృష్ణారావు పాల్గొనడం, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన్ని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. దాంతో.. కొల్లాపూర్ పాలిటిక్స్లో టెంపరేచర్ మరింత ఎక్కువైంది. ఇదే అదనుగా.. జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ రంగంలోకి దిగాయి. ఇప్పుడు.. ఆయన తీసుకోబోయే నిర్ణయమే.. రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారనుంది. మరోవైపు.. జూపల్లి సస్పెన్షన్తో సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Beeram Harshavardhan Reddy)కి వర్గపోరు తొలగిపోగా.. రానున్న ఎన్నికలకు లైన్ క్లియర్ అయిపోయింది.

Jupally Krishna Rao
దూకుడు పెంచిన జూపల్లి

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సస్పెన్షన్ వేటు తర్వాత దూకుడు పెంచారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవదని హాట్ కామెంట్స్ చేశారు. గులాబీ పార్టీ వ్యతిరేకత శక్తులంతా ఏకమై.. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 నియోజకవర్గాలు గెలుస్తామంటూ సవాల్ విసిరారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. కొల్లాపూర్ ప్రజలంతా.. తన వెంటే ఉంటారనే ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో.. తన మరో రాజకీయ ప్రస్థానం మొదలైందని.. పార్టీలు, పదవుల కన్నా.. కొల్లాపూర్ అభివృద్ధి ముఖ్యమని తేల్చి చెప్పేశారు. దాంతో.. ఆయన బీజేపీలో చేరతారా? సొంతగూడు కాంగ్రెస్ వైపు అడుగులేస్తారా? లేక.. బీఆర్ఎస్ అసంతృప్త నేతలంతా కలిసి కొత్త రాజకీయ వేదికను నిర్మించబోతున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇద్దరి మధ్యే టికెట్ పోరు
మరోవైపు.. కొల్లాపూర్లో కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది. దాంతో.. ఆ పార్టీ టికెట్ కోసం ఇప్పటికే సీనియర్ నేత జగదీశ్వరరావు, యువనేత అభిలాష్ రావు మధ్య టికెట్ పోరు ఎక్కువగా ఉంది. టికెట్ తమకేనని.. ఇద్దరు నేతలు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే.. వీళ్లిద్దరి మధ్య టికెట్ పోరు హోరాహోరీగా సాగుతుంటే.. ఇప్పుడు జూపల్లి ఎపిసోడ్ కాంగ్రెస్ నేతలను మరింత కలవరపెడుతోంది. ఆయన గనక హస్తం పార్టీలో చేరితే.. కాంగ్రెస్ టికెట్ జూపల్లికే కన్ఫామ్ అవుతుంది. అదే జరిగితే.. తమ రాజకీయ భవిష్యత్ ఏమిటనే ఆందోళన జగదీశ్వర్ రావు, అభిలాష్ రావులో నెలకొంది. ఒకవేళ జూపల్లి గనక కాంగ్రెస్లో చేరి.. ఆయనకే టికెట్ ఇస్తే.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే చర్చ సాగుతోంది. అలా.. కాంగ్రెస్ని వీడిన నేత తీసుకోబోయే నిర్ణయం కూడా రానున్న ఎన్నికల్లో.. కొల్లాపూర్ ఎమ్మెల్యే గెలుపులో కీలకంగా మారనుందనే వాదన కూడా వినిపిస్తోంది.

Aelleni Sudhakar Rao
జూపల్లి బీజేపీ అభ్యర్థి అయితే..

ఇక.. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఎల్లేని సుధాకర్ రావు.. మరోసారి కొల్లాపూర్ బరిలో దిగేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే.. నియోజకవర్గవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. అయితే.. బీజేపీకి చెందిన కొందరు కీలక నేతలు.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సంప్రదింపులు మొదలుపెట్టారు. దాంతో.. జూపల్లి తీసుకోబోయే నిర్ణయం మీదే.. బీజేపీ అభ్యర్థి భవితవ్యం ఆధారపడి ఉంది. ఒకవేళ.. జూపల్లి బీజేపీ అభ్యర్థి అయితే.. ఎల్లేని సుధాకర్ రావు(Aelleni Sudhakar Rao) కూడా కమలం పార్టీకి టాటా చెప్పేస్తారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో.. సుధాకర్ రావు చీల్చిన ఓట్ల వల్లే జూపల్లి ఓటమిపాలయ్యారనే టాక్ ఇప్పటికీ ఉంది. అందువల్ల.. ఈసారి ఏకంగా సుధాకర్ టికెట్కే.. జూపల్లి ఎసరు పెట్టే పరిస్థితులు ఏర్పడటంపై.. నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. బీజేపీ తరఫున జూపల్లి గనక బరిలో దిగితే.. ఎల్లేని సుధాకర్ రావు తీసుకునే నిర్ణయం కూడా కొల్లాపూర్ రాజకీయాన్ని ప్రభావితం చేసే అవకాశాలున్నాయ్.

Also Read: పక్కా స్కెచ్‌తో నల్లగొండలో కారు పాగా.. ఈసారి సత్తా చాటేదెవరు?

మారిన పొలిటికల్ పిక్చర్తో.. కొల్లాపూర్ పాలిటిక్స్ ఇప్పటివరకు ఎన్నడూ లేనంత ఆసక్తిగా మారిపోయాయ్. ఎన్నికల నాటికి రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక.. బీఆర్ఎస్ (BRS Party), కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ కూడా కన్ఫామ్ అయిపోయింది. అయితే.. ఈసారి జూపల్లి ఫ్యాక్టరే.. గెలుపోటములను డిసైడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో.. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ.. ఎవరికి వారు వ్యూహ, ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ.. కొల్లాపూర్ ప్రజలు.. ఎవరికి పట్టం కడతారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.