Gadwal Constituency: టికెట్ వార్‌లో గెలిచి గద్వాల్ కోటపై.. జెండా ఎగరేసేదెవరు?

గద్వాల్ పాలిటిక్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది.. డీకే ఫ్యామిలీనే. 1952లో ఏర్పడిన గద్వాల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. అందులో 9 సార్లు డీకే ఫ్యామిలీకి చెందిన వాళ్లే ఎమ్మెల్యేలుగా గెలిచారు.

Gadwal Constituency: టికెట్ వార్‌లో గెలిచి గద్వాల్ కోటపై.. జెండా ఎగరేసేదెవరు?

Gadwal Assembly Constituency: గద్వాల్.. ఒకప్పుడు కాంగ్రెస్‌కి కంచుకోట. కానీ.. ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ అభ్యర్థే కరువయ్యారు. అప్పుడు కాంగ్రెస్‌కి బలంగా ఉన్న డీకే అరుణ.. ఇప్పుడు కాషాయం పార్టీకి బలమైన అభ్యర్థిగా మారారు. దాంతో.. బీజేపీ శ్రేణులంతా.. గెలుపు తమదేననే ధీమాలో ఉన్నారు. ఇక.. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు? ఎమ్మెల్యే వర్సెస్ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సాగుతున్న టికెట్ వార్‌లో గెలిచేదెవరు? సవాళ్లు, ప్రతి సవాళ్లకు కేరాఫ్‌గా మారిన గద్వాల్ కోటపై.. జెండా ఎగరేసేదెవరు? ఓవరాల్‌గా.. ఈసారి నడిగడ్డపై ఎగరబోయే జెండా ఏది? కనిపించబోయే పొలిటికల్ పిక్చర్ ఏంటి?

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అతి తక్కువ హాట్ సీట్లలో.. గద్వాల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి. అంతేకాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నియోజకవర్గం ఇది. తెలంగాణ వాదం బలంగా వీచిన సమయంలోనూ చెక్కుచెదరని కాంగ్రెస్ కంచుకోట గద్వాల్. కానీ.. గత ఎన్నికల్లో మాత్రం పక్కా స్కెచ్‌తో ఇక్కడ పాగా వేసింది గులాబీ పార్టీ. దాంతో.. దెబ్బకు హస్తం కంచుకోట కకావికలమైపోయింది. ఇప్పుడు.. బలమైన అభ్యర్థి కోసం వెతుక్కుంటోంది కాంగ్రెస్ నాయకత్వం. అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఖంగు తినిపించి.. గద్వాల్ గడ్డపై కాషాయం జెండా ఎగరేసేందుకు వ్యూహలు రచిస్తోంది కమలదళం. దాంతో.. నడిగడ్డ (Nadigadda) పాలిటిక్స్ ఇంతకుముందెన్నడూ లేనంతగా హీటెక్కాయ్.

DK, Aruna, Gongalla, Bandla

డీకే అరుణ, గొంగళ్ల రంజిత్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల్ పాలిటిక్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది.. డీకే ఫ్యామిలీనే. 1952లో ఏర్పడిన గద్వాల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. అందులో 9 సార్లు డీకే ఫ్యామిలీకి చెందిన వాళ్లే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇది చాలు.. డీకే ఫ్యామిలీకి గద్వాల్‌పై రాజకీయంగా ఎంత పట్టుందో అర్థం చేసుకోవడానికి. డీకే సత్యారెడ్డితో మొదలుపెడితే.. డీకే సమరసింహా రెడ్డి(dk samarasimha reddy), డీకే భరతసింహా రెడ్డి, డీకే అరుణ దాకా.. అంతా గద్వాల కోటను తమ గుప్పిట్లో పెట్టుకొని.. లోకల్ రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు. ఇలా.. కాంగ్రెస్‌కు కంచుకోటగా మారిపోయిన గద్వాల్‌లో.. మొట్టమొదటిసారి గత ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరింది. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి పెరిగితేనో.. ఇతర పార్టీల వైపు గాలి వీస్తేనో తప్ప.. గద్వాల్ (Gadwal) ఓటర్లు ఎప్పుడూ కాంగ్రెస్‌నే గెలిపిస్తూ వచ్చారు.

నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. అవి మల్దకల్, గట్టు, ధరూర్, కలూర్ తిమ్మనదొడ్డి, గద్వాల్. వీటన్నింటి పరిధిలో మొత్తం.. 2 లక్షల 34 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 50 వేలకు పైనే ఉంటారు. కురుమలు 30 వేలు, ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 35 వేలకు పైనే ఉన్నారు. గౌడ, మున్నూరు కాపు, ముదిరాజ్ సామాజికవర్గాలు కూడా బలంగానే ఉన్నాయ్. గద్వాల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక బీసీ నేత గట్టు భీముడు. ఆయన ఒకే ఒక్కసారి టీడీపీ తరఫున విజయం సాధించారు. మిగతా అన్ని ఎన్నికల్లోనూ.. రెడ్డి సామాజికవర్గం నేతలే గెలుస్తూ వస్తున్నారు. వీరిలోనూ.. ఎక్కువ మంది డీకే ఫ్యామిలీకి చెందిన వాళ్లే. ప్రస్తుతం.. బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(Bandla Krishna Mohan Reddy) కూడా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణకు బంధువే.

Bandla Krishna Mohan Reddy

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Photo: FB)

ప్రస్తుతం.. గద్వాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. మరోసారి బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానని.. ముఖ్యంగా గట్టు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించడంతో పాటు గద్వాల బస్టాండుని అభివృద్ధి చేశానని అంటున్నారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించానని చెబుతున్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో.. బీఆర్ఎస్ నాయకత్వం గద్వాల సెగ్మెంట్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక్కడ.. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే.. అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అప్పుడు.. గద్వాల బీఆర్ఎస్‌లో ఉన్న అంతర్గత విభేదాలన్నింటిని పక్కనపెట్టి.. అంతా కలిసికట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకి కృషి చేశారు. కానీ.. ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచిన కొన్నాళ్లకే.. పార్టీలో వర్గ పోరు మొదలైంది. చాలా సార్లు ప్రోటోకాల్ ఇష్యూ హాట్ టాపిక్‌ (Hot Topic)గా మారింది.

gadwal zp chairman saritha

గద్వాల్ జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Photo: FB)

ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్‌పర్సన్ మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్‌కు చేరింది. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడంతో.. అధికారులు ఇబ్బంది పడేవారన్న టాక్ ఉంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో.. ప్రోటోకాల్ వివాదం రేగేది. దాంతో.. జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత.. సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకొని.. గద్వాల మొత్తం విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసారి టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడంతో.. అధిష్టానం ఆవిడకే టికెట్ కేటాయించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. గద్వాల్ సెగ్మెంట్‌లో.. బీసీ ఓట్ బ్యాంక్ బలంగానే ఉన్నా.. రాజకీయంగా ఆ సామాజికవర్గం నేతలు అన్యాయం జరుగుతోందనే ఫీలింగ్ ఉంది. అందువల్ల.. జడ్పీ ఛైర్‌పర్సన్ సరితకు టికెట్ ఇస్తే.. మరోసారి గులాబీ పార్టీ గెలిచే అవకాశం ఉందని.. ఆమె అనుచరులు చెబుతున్నారు. మరోవైపు.. ఇదే నియోజకవర్గానికి చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఆంజనేయులు గౌడ్ (Anjaneyulu Goud) సైతం.. టికెట్ రేసులో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఈ ముగ్గురిలో.. అధిష్ఠానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్నదే.. ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే.. సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు అని గులాబీ దళపతి కేసీఆర్ చెప్పడంతో.. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు.

DK Aruna

డీకే అరుణ (Photo: FB)

మరోవైపు.. మాజీ మంత్రి డీకే అరుణ (DK Aruna) సైతం.. బీజేపీ నుంచి బరిలో దిగేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. సమీప బంధువైన బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో డీకే అరుణ ఓటమిపాలయ్యారు. తర్వాత.. బీజేపీలో చేరడం, లోక్‌సభ ఎన్నికల్లో.. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి.. రెండో స్థానంలో నిలిచారు. ఈసారి.. గద్వాలలో గెలిచి.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చనే ఆలోచనలో ఆవిడ ఉన్నారు. గతంలో.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డీకే అరుణ.. తొలిసారి బీజేపీ నుంచి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. దాంతో.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్ బ్యాంక్.. ఆవిడకు మైనస్‌గా మారే అవకాశం ఉందని.. రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గద్వాలలో వాల్మీకి(Valmiki) సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. గత ఎన్నికల్లో వాళ్లను ఎస్టీ జాబితాలో చేరుస్తామని.. సీఎం కేసీఆర్ (KCR) హమీ ఇచ్చారు. దాంతో.. వాళ్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఆ హామీ నెరవేరకపోవడంతో.. వాల్మీకిలను బీజేపీ వైపు తిప్పుకునేందుకు డీకే అరుణ ప్లాన్ చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. వాళ్ల డిమాండ్‌ని నెరవేరుస్తామని.. మాజీ మంత్రి డీకే అరుణ చెబుతున్నారు.

Also Read: లోకల్ లీడర్లను టెన్షన్ పెడుతున్న రామగుండం రాజకీయాలు!

gongalla ranjith kumar

గొంగళ్ల రంజిత్ కుమార్ (Photo: FB)

గత ఎన్నికల్లో గద్వాలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గొంగళ్ల రంజిత్ కుమార్ (gongalla ranjith kumar).. మరోసారి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే.. నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ.. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీసీ నేతగా, విద్యావంతుడిగా.. తనకొక్కసారి అవకాశం ఇస్తే.. నియోజకవర్గ అభివృద్ధితో పాటు బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకొస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. గద్వాలలో ఎక్కువగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారని.. ఫలితంగా వాళ్ల కుటుంబాలు మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా బలపడ్డాయని విమర్శిస్తున్నారు రంజిత్. దశాబ్దాలుగా.. గద్వాల గడ్డపై బీసీలు రాజకీయంగా ఎదగలేకపోతున్నారని ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నప్పటికీ.. సరైన అభ్యర్థి కనిపించడం లేదు. దాంతో.. గొంగళ్ల రంజిత్‌నే కాంగ్రెస్ నుంచి బరిలోకి దించితే.. గట్టి పోటీ ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే.. గ్రూప్ పాలిటిక్స్‌తో.. ఎవరైనా కారు దిగిపోతే.. వారికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉందనే చర్చ నడుస్తోంది.

Also Read: కాక రేపుతోన్న కొల్లాపూర్ రాజకీయాలు.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జూపల్లి

మొత్తానికి.. ఈసారి గద్వాల కోటలో రాజకీయం రసవత్తరంగా ఉండబోతుందనే విషయం అర్థమవుతోంది. కాంగ్రెస్ కంచుకోటలో.. ఆ పార్టీ అభ్యర్థి ఎవరో తేలకపోగా.. ఎప్పుడూ డిపాజిట్ దక్కించుకోని బీజేపీ మాత్రం.. గెలుపుపై ధీమాగా ఉంది. మరోసారి.. గులాబీ జెండా ఎగరేసేందుకు.. అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఓవరాల్‌గా.. ఈసారి గద్వాల్ గడ్డపై.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.