Hyderabad Paani App
Hyderabad Paani App : నగరంలో మంచినీటికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. కానీ, సరఫరా అయ్యే నీళ్లు మాత్రం పెరగడం లేదంటున్నారు నగర వాసులు. ఉన్న నీటి వనరులతోనే సర్దుకోవాల్సి పరిస్థితి ఉంది. ఇదే సమయంలో నగర వ్యాప్తంగా నీటి వృథాను అరికట్టే పనిలో పడింది వాటర్ బోర్డు. తాగటానికి ఇచ్చే నీటిని ఇంటి పరిసరాలు.. బైక్, కార్లు కడగడానికి ఉపయోగిస్తున్న వారిపై చలాన్లు విధిస్తున్నారు. తాజాగా.. నీటి దుర్వినియోగంపై టెక్నాజీతో నిఘా పెడుతూ జలమండలి పానీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా 10వేల మంది వాలంటీర్లను ఎంపిక చేసుకొని వారికి ఈ యాప్‌ను అందించడం ద్వారా నగరంలో ఎక్కడ తాగునీరు వృథా అవుతున్నా.. నీటిని అక్రమంగా ఎవరు వినియోగించినా వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.
హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. నగర జనాభా పెరుగుతోంది. భారీగా రెసిడెన్షియల్ , కమర్షియల్ నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో మంచినీటి డిమాండ్‌కు అనుగుణంగా నీటి సరఫరా లేదు. 2014లో నగరానికి వస్తున్న 600 ఎంజీడీల నీళ్లే ఇప్పుడుకూడా సరఫరా అవుతున్నాయి. నగర వ్యాప్తంగా ఉన్న 14లక్షలకుపైగా ఉన్న నీటి కనెక్షన్లకు ఈ నీటినే అధికారులు సరఫరా చేస్తున్నారు. అసలే నీటి కొరత ఉన్న నేపథ్యంలో నగరంలోని చాలా మంది నీటిని వృథా చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టేందుకు.. నీటి వృథాకు పాల్పడిన వారికి భారీగా ఛలాన్లు విధించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
నగర వ్యాప్తంగా నీటి వృథాను అరికట్టేందుకు పబ్లిక్ యాక్షన్ పర్ నాన్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్సియేటివ్ అనే పానీ యాప్‌ను అధికారులు ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు మంచినీటిని వృథా చేస్తున్న వారిని గుర్తించి వాటర్ బోర్డు అధికారులు జరిమానాలు విధించేవారు. కానీ, ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొస్తున్న పానీ యాప్ ద్వారా నీటి వృథాకు చెక్ పెట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
పానీ యాప్ ద్వారా మొదటి దశలో పది వేల మంది వాలంటీర్లను నియమించి వారికి శిక్షణ ఇచ్చి ప్రత్యేక ఐడీ, లాగిన్‌లు ఇస్తారు. ఆ తరువాత వారికి తమ పరిసర ప్రాంతాల్లో నీటి వృథాను పర్యవేక్షించే బాధ్యత అప్పగించనున్నారు. నీటిని వృథా చేస్తున్న వారిని గుర్తించి ఈ యాప్ ద్వారా భారీ జరిమానాలు విధిస్తామని జలమండలి అధికారులు చెబుతున్నారు.
నీటి వృథాపై వాటర్ వాలంటీర్లు ఫొటోలు తీసి.. వివరాలు నమోదు చేస్తారు. రోడ్లపై నీరు వృథాగా పారుతున్న దశ్యాలు, లీకేజీ, ట్యాంక్ నుంచి నీరు వృథాగా పోతున్న దృశ్యాలు, అక్రమ నీటి వినియోగం, ఇంటి పరసరాలు, వాహనాలు కడగడం లాంటివి ఫొటోలు తీసి లోకేషన్, పూర్తి వివరాలు యాప్‌లో ఎంటర్ చేస్తారు. ఆయా వివరాలను వాటర్ బోర్డు అధికారులు పరిశీలించి నీటి వృథాకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే వారికి భారీగా జరిమానాలు విధిస్తారు.