Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

రాగల మూడు రోజులు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Rains

Rains : పదిరోజులపాటు విపరీతంగా వర్షాలు కురవడంతో తెలంగాణ తడిసి ముద్దైంది. బుధవారం సాయంత్రం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో నీటమునిగిన ప్రాంతాలు వర్షపు నీటి నుంచి బయటపడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మరో చేదు వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాగల మూడు రోజుల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని.. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.