బనకచర్లపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ మధ్యలో బీజేపీ.. ఏం జరుగుతోంది?

బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆరే రంగంలోకి దిగబోతున్నారట.

బనకచర్ల.. ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి నీటి చిచ్చుపెట్టిన ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రాజేసిన బనకచర్ల.. తెలంగాణలోని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుధ్దానికి తెరలేపింది. బనకచర్ల పాపం మీదంటే మీదని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు అటాక్ చేసుకుంటుంటే బీజేపీ మాత్రం గందరగోళంలో పడిందన్న టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ ఇష్యూపై మొదట అందరూ లైట్‌ తీసుకున్నట్లే కనిపించారు. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతదని బీఆర్ఎస్ గళం మెత్తింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న బనకచర్లను అడ్డుకోకుండా రేవంత్‌ చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారని అటాక్ చేస్తోంది కారు పార్టీ.

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై రాజకీయ దుమారం నేపథ్యంలో ఆల్‌ పార్టీ ఎంపీస్‌ మీటింగ్‌ నిర్వహించారు సీఎం రేవంత్. బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని కేంద్ర పెద్దలను కలుస్తూ విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు 2016లోనే ప్రారంభమైందని, అప్పటి సీఎం కేసీఆర్ ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్‌ భేటీలో గోదావరి మిగులు నీటి వినియోగాన్ని ప్రతిపాదించారని రేవంత్ ఆరోపిస్తున్నారు.

Also Read: పుష్ప సినిమా డైలాగ్.. క్యాడర్‌ అతి! తప్పేంకాదన్న వైఎస్ జగన్.. వాట్‌ ఈజ్‌ దిస్?

కేసీఆర్ సూచనల ప్రకారమే జగన్‌తో సమావేశాలు జరిగాయని, అదే ప్రాజెక్టు ఇప్పుడు బనకచర్ల రూపంలో ముందుకు సాగుతోందన్నారు. రాయలసీమ సస్యశ్యామలంగా మారాలని కేసీఆర్ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసి మరింత రాజకీయ వివాదం రాజేశారు సీఎం రేవంత్ రెడ్డి.

బనకచర్లపై బీజేపీ స్టాండ్ ఏంటి? 
ఏపీ, తెలంగాణ నీటి పంచాయితీపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పొలిటికల్‌ ఫైట్‌ ఇలా ఉంటే..బీజేపీ పరిస్థితి గమ్మత్తుగా మారింది. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న ఆ పార్టీ బనకచర్లపై ఎలాంటి స్టాండ్‌ తీసుకుంటుందనే ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీడీపీ మద్దతు కీలకంగా మారింది. సేమ్‌టైమ్‌ ఏపీలో కూటమిగా టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాయి.

దాంతో బనకచర్లపై బీజేపీ వ్యతిరేకిస్తుందా..సమర్థిస్తుందా అంటే ఏం చెప్పలేని పరిస్థితి ఉందట. ప్రస్తుతానికైతే కమలనాథులు ఈ ఇష్యూలో డైలమాలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రాజెక్టు కట్టొద్దంటే ఓ తలనొప్పి..బనకచర్లను సమర్థిస్తే బీఆర్ఎస్‌కు అస్త్రంగా మారే అవకాశం ఉంది. అసలే వాటర్ సెంటిమెంట్‌కు సంబంధించిన ఇష్యూ కావడంతో ఆచితూచి మాట్లాడుతున్నారు కమలనాథులు.

అయితే బనకచర్ల ప్రాజెక్టుపై నిబంధనలను పరిశీలించిన అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కిషన్‌రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఇదేలా సాధ్యమనేదే చర్చ. బనకచర్లను ఆపితే తెలంగాణ హ్యాపీ. కానీ ఆ ప్రాజెక్టును నిలిపివేసేందుకు చంద్రబాబు అక్కడి కూటమి సర్కార్ ఒప్పుకుంటుందా అంటే డౌటే. ఈ పరిస్థితుల్లో బీజేపీ పరిస్థితి అరకత్తెరలో పోక చెక్కలాగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆరే రంగంలోకి దిగబోతున్నారట. త్వరలోనే తెలంగాణ సాగునీటి రంగంపై విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి..బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకెళ్లే ఆలోచనలో ఉందట కారు పార్టీ. దీంతో బనకచర్ల ప్రాజెక్టుపై ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు బీఆర్ఎస్ ఎవరికి వారు పోరాటానికి రెడీ అవుతుండటం రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది. ఇలా బనకచర్ల ఇష్యూలో కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా ఉందట బీజేపీ పరిస్థితి. ఈ ఇష్యూను కేంద్రం ఎలా సాల్వ్‌ చేస్తుందో చూడాలి మరి.