Formula E
Formula E Hyderabad: ఫార్ములా-1 రేస్ కు 2011–2013లో ఆతిథ్యం ఇచ్చింది ఇండియా. ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధా నగర్ జిల్లాలో యమున ఎక్స్ ప్రెస్ వే ప్రాంతంలో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ పేరుతో అప్పట్లో ఆ రేస్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు (పదేళ్ల తర్వాత) ఇటువంటి ప్రపంచ స్థాయి రేస్ హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే, అప్పట్లో భారత్ లో జరిగింది ఫార్ములా-1 రేస్. ఇప్పుడు జరుగుతుంది ఫార్ములా-ఈ. దీంతో, భారత్ లో మొదటిసారిగా ఫార్ములా-ఈ కార్ రేస్ జరుగుతున్న నగరంగా హైదరాబాద్ నిలిచింది.
రేపటి నుంచి ఫార్ములా-ఈ కార్ రేస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దీని విశేషాలేంటో చూద్దాం.. ఫార్ములా-1, ఫార్ములా-ఈ కార్ రేస్ కు తేడాలు ఉన్నాయి. ఫార్ములా-1 కోసం హైబ్రిడ్ టర్బో-ఛార్జర్డ్ ఇంజన్ల రేసింగ్ కార్లు వాడతారు. ఫార్ములా-ఈ కోసం బ్యాటరీ ఆధారిత, పర్యావరణ సహిత ఎలక్ట్రిక్ రేసింగ్ కార్లను వినియోగిస్తారు. గత ఎనిమిది సీజన్లలో ఫార్ములా-ఈకి మంచి స్పందన రావడంతో అదే ఉత్సాహంతో ఈ సారి హైదరాబాద్ లో దీన్ని నిర్వహిస్తున్నారు.
మూడో తర (Gen3) టెక్నాలజీని ఈ సారి ప్రవేశపెడుతున్నారు. Gen3 మరింత వేగవంతం, సమర్థమైనదని నిపుణులు చెబుతున్నారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ఈ కార్లు దూసుకుపోగలవు. తొలి తర కార్లను 2014-2017 మధ్య వాడారు. వాటికి గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే సామర్థ్యం ఉంది.
ఇప్పుడు వాడుతున్న Gen3 కార్లు తొలి తర కార్ల కంటే గంటకు 100 కిలోమీటర్ల అధిక వేగంతో వెళ్తాయి. అలాగే, 2018-2022 మధ్య గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రెండో తర కార్లను వాడారు. కర్బన ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో ఈ రేస్ నిర్వహిస్తారు. మూడో తర (Gen3) టెక్నాలజీతో తీసుకు వచ్చిన ఈ రేసింగ్ కార్ల బ్యాటరీని తక్కువ సమయంలో చార్జ్ చేయొచ్చు.
ఇక కారు బరువు దాదాపు 840 కిలోలు ఉంటుంది. వీటి బరువు గత జనరేషన్ కన్నా 60 కిలోలు తక్కువ. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న రేసు కోసం 2.83 కిలో మీటర్ల పొడవైన ట్రాక్ ను వాడుతున్నారు. 18 మలుపులతో ఇది ఉంటుంది. హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ పార్క్, ప్రసాద్ ఐమ్యాక్స్, నక్లెస్ రోడ్ ప్రాంతాల్లో కార్లు దూసుకెళ్తాయి. మొత్తం 11 జట్లు ఇందులో పాల్గొంటాయి. వాటిల్లో మొత్తం 22 మంది ఉంటారు. మహీంద్రా రేసింగ్ ఫార్ములా-ఈ కారునూ ఇప్పటికే ఆవిష్కరించారు.