Raja Singh: రాజాసింగ్.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన గోశామహల్ ఎమ్మెల్యే. అంతకుమించి హిందుత్వవాదిగా చెరగని ముద్ర వేశారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తనదైన మాటలతో, శైలితో బీజేపీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న లీడర్ రాజాసింగ్. అయితే, తాజాగా బీజేపీతో ఆయన బంధం తెగిపోయింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన చేసిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో అసంతృప్తికి లోనైన రాజాసింగ్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. బీజేపీతో ఆయనకున్న అనుబంధానికి తెరపడినట్లైంది.
బీజేపీకి రాజాసింగ్ రాజీనామా తర్వాత రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అదే.. గోశామహల్ కు బైపోల్స్ వస్తాయా? ఇప్పుడీ అంశంపై విస్తృతంగా డిస్కషన్ జరుగుతోంది. ఒకవేళ అక్కడ ఉప ఎన్నిక వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా ఆసక్తిని రేపుతోంది. బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్.. ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది.
గోశామహల్ కు బైపోల్స్ వస్తాయా?
రాజాసింగ్ రాజీనామాతో గోశామహల్ కు బైపోల్స్ వస్తాయా? రావా? ఏ పరిస్థితుల్లో అక్కడ ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది? అనే వివరాల్లోకి వెళితే.. రాజాసింగ్ కేవలం బీజేపీకి మాత్రమే రిజైన్ చేశారు. ఎమ్మెల్యే పదవికి కాదనేది గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఆయన స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి ఉంటే.. అక్కడ బైపోల్ జరిగే ఛాన్స్ ఉంది. స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ చేస్తే.. స్పీకర్ ఆయనను పిలిచి కారణాలు అడుగుతారు. ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలంటారు. దానికి రాజాసింగ్ ఇచ్చే వివరణతో స్పీకర్ సంతృప్తి చెంది రాజీనామాను ఆమోదిస్తారు. ఈ పరిస్థితిలో అక్కడ ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకే శిక్షణ కావాలా..? ఏం జరుగుతోంది?
స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయకపోతే బైపోల్స్ వస్తాయా? బీజేపీ రాజాసింగ్ ను బర్తరఫ్ చేయించగలదా?
ఒకవేళ రాజాసింగ్ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయకపోయినా గోశామహల్ లో బైఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉండేది. అదెలా అంటే.. రాజాసింగ్ పార్టీకి చేసిన రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించకపోయి ఉండాలి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనో లేదా మరో పార్టీలో రాజాసింగ్ జాయిన్ కావటమో.. ఇలాంటివి చేస్తే.. ఆయనను ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయించే అవకాశం బీజేపీకి ఉండేది. అలా గోశామహల్ లో ఉపఎన్నిక వచ్చే ఛాన్స్ ఉండేది.
అయితే అందుకు భిన్నంగా పార్టీకి చేసిన రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. ఇప్పుడు రాజాసింగ్ కి బీజేపీకి సంబంధంతో లేదు. ఆయనిప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కింద లెక్క. అంటే, ఆయన ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఏ పార్టీలో అయినా జాయిన్ కావొచ్చు. రాజాసింగ్ పై చర్యలు తీసుకోండి అని స్పీకర్ ను అడిగే అధికారం బీజేపీకి ఉండదు.
రాజాసింగ్ ఇలా చేస్తే.. బైపోల్స్ పక్కా?
రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయడం, పార్టీ హైకమాండ్ దాన్ని ఆమోదించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మరిప్పుడు గోశామహల్ కు బైఎలక్షన్స్ వస్తాయా అనే చర్చ మొదలైంది. అక్కడ ఉపఎన్నిక వచ్చే అవకాశం లేకపోలేదు. ఒకవేళ నా తడాఖా ఏంటో చూపిస్తాను, బై పోల్స్ రావాలి అని రాజాసింగ్ అనుకుని.. స్పీకర్ ఫార్మాట్ లో లేఖ ఇస్తే.. దాన్ని స్పీకర్ ఆమోదిస్తే అక్కడ బైపోల్స్ అవచ్చే అవకాశం ఉంది.