తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గీకరణ లొల్లి.. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న లీడర్లు ఎవరు?

పార్టీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. దానికి క‌ట్టుబ‌డి ఉండాల్సిన నేత‌లు వ్యతిరేకంగా కామెంట్స్ చేయ‌డం ఏంటంటూ మాదిగ సామాజిక‌వ‌ర్గం నేత‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.

CM Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అన్నాకా పంచాయతీలు కొత్తేముంది..ఏ గొడవ లేకపోతేనే న్యూస్‌ కదా అంటారా. అవును ఇప్పుడు తలెత్తిన లొల్లి మాత్రం సరికొత్తదనే చెప్పాలి. పార్టీలో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం కామన్..కానీ ఇప్పుడు ఏకంగా కొందరు ప్రజాప్రతినిధులు, లీడర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ హాట్ టాపిక్ అవుతోంది. తాము టార్గెట్ చేస్తున్న నేతల స‌స్పెన్షన్ కోసం పార్టీ వేదిక‌ల‌తో పాటు..స‌మావేశాలు పెట్టుకుని మరీ గొంతెత్తున్నారు. సొంత పార్టీ, పైగా అధికార పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేయాల‌నే డిమాండ్ కాంగ్రెస్‌లో కాక రేపుతోంది.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ అంశం కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ చేసి తీరుతామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవ‌స‌ర‌మైతే ప్రస్తుత నోటిఫికేష‌న్లకు వ‌ర్తించేలా చేసి మాదిగ సామాజిక‌వ‌ర్గానికి చెందిన అభ్యర్థుల‌కు మేలు క‌లిగేలా చూస్తామ‌ని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి.

ఏకస‌భ్య క‌మిష‌న్ వేయాల‌ని సూచన
కారణాలేంటో తెలియదు కానీ డీఎస్సీ వంటి ఉద్యోగ నియామ‌కాల విష‌యంలో వర్గీకరణ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయలేదు. అయినా వ‌ర్గీక‌ర‌ణ ఇంప్లిమెంటేష‌న్ కోసం ప్రభుత్వం మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివ‌ర్గ ఉప‌ సంఘం వేసింది. మంత్రి ఉత్తమ్ క‌మిటీ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. వ‌ర్గీక‌ర‌ణ ఇంప్లిమెంటేష‌న్ కోసం రిటైర్డ్ నాయ్యమూర్తి ఆధ్వర్యంలో ఏక స‌భ్య క‌మిష‌న్ వేయాల‌ని సూచించింది. రిటైర్డ్ జ‌డ్జి క‌మిష‌న్ కూడా డిసెంబ‌ర్ 14లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల‌ని డెడ్‌లైన్ విధించారు.

ఇదంతా బాగానే ఉన్నా..ప్రభుత్వంలో కీల‌క‌ంగా ఉన్న మాల సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌లు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను అడ్డుకునే కుట్రలు చేస్తున్నార‌ని..కాంగ్రెస్ పార్టీలోని మాదిగ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మాల సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌లు త‌ర‌చూ స‌మావేశాలు పెట్టుకుని.. వ‌ర్గీక‌ర‌ణ ఎలా జ‌రుగుతుందో చూస్తామ‌ని కామెంట్స్ చేస్తున్నారట.

నేత‌ల ఆందోళ‌న
ఇదే ఇప్పుడు మాదిగ వ‌ర్గానికి చెందిన నేత‌లకు కోపం తెప్పిస్తుందంటున్నారు. పార్టీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. దానికి క‌ట్టుబ‌డి ఉండాల్సిన నేత‌లు వ్యతిరేకంగా కామెంట్స్ చేయ‌డం ఏంటంటూ మాదిగ సామాజిక‌వ‌ర్గం నేత‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.

మాల సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఓ ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య ప‌ద‌వుల్లో ఉన్న ప‌లువురు నేతలు కూడా వర్గీకరణను అడ్డుకునే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని మాదిగ నేత‌లు ఆరోపిస్తున్నారు. పార్టీ విస్తృత స్థాయి స‌మావేశాల్లో కూడా ఈ విష‌యంపై గొంతెత్తారు మాదిగ నేత‌లు.

తాజాగా రెండు రోజుల క్రితం న‌ల్లగొండ‌లో మాదిగ నేత‌లు సమావేశ‌మై..మాల నేత‌ల తీరుపై గ‌రం గ‌రం అయ్యారు. వెంట‌నే పార్టీ వ్యతిరేక కార్యక‌లాపాల‌కు పాల్పడుతున్న మాల నేత‌ల‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌లో త‌లెత్తిన ఈ కొత్త పంచాయితీని స‌ర్కారు పెద్దలు ఎలా ప‌రిష్కరిస్తార‌నేది ఇప్పుడు స‌స్పెన్స్‌గా మారింది.

సోలార్ పవర్‌ స్కామ్ కేసులో జగన్‌ టార్గెట్ అయ్యారా? ఏపీలో దర్యాప్తు సాధ్యమేనా?