Kothagudem MLA: కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరనేది ఎప్పట్లోగా తేలనుంది.. గులాబీబాస్ వైఖరి ఏంటో?

కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండడంతో ఆచితూచి వ్యవహరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనిపై గులాబీబాస్ వైఖరి ఏంటో తేలితేనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

kothagudem brs party

Kothagudem BRS: కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటుతో అడకత్తెరలో పడిపోయింది గులాబీ పార్టీ. వేటు పడ్డ ఎమ్మెల్యే.. వేటు వేయించిన ప్రత్యర్థి ఇద్దరూ బీఆర్ఎస్ (BRS Party) సభ్యులే కావడంతో.. ఏం చేయాలో తెలియని ఆయోమయ పరిస్థితిని ఎదుర్కొంటోంది కారు పార్టీ.. కోర్టులో నెగ్గిన నేతను ఎమ్మెల్యేగా చేయాలా.. ఇన్నాళ్లు పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తినే మరికొద్దిరోజులు కొనసాగించాలా.. తేల్చుకోలేకపోతున్నారట గులాబీబాస్. దీంతో కోర్టు తీర్పు అందుకున్న స్పీకర్ కార్యాలయం ఎటూ తేల్చలేక మీమాంసలో కొట్టుమిట్టాడుతోంది. ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతోంది? కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరనేది ఎప్పట్లోగా తేలనుంది?

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (vanama venkateswara rao) అనర్హత వేటు.. బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. వనమాపై కోర్టులో పోరాడి విజయం సాధించిన ప్రత్యర్థి జలగం వెంకటరావు (jalagam venkat rao) కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కావడం.. ఖమ్మం జిల్లాలో తొలినుంచి క్రియాశీలంగా ఉండటంతో ఇప్పుడేం చేయాలో తేల్చుకోలేకపోతోంది బీఆర్ఎస్ అధిష్టానం. కోర్టు తీర్పును అమలు చేయాల్సిందిగా స్పీకర్ కార్యాలయానికి జలగం లేఖ రాయడం.. అసెంబ్లీ కార్యదర్శని నేరుగా కలిసి కోర్టు ఆదేశాలను అందజేయడంతో.. ఈ విషయంలో ఎలా స్పందించాలో.. ఏ నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా మేలు జరుగుతుందో అర్థం కాక జుత్తు పీక్కుంటున్నారు బీఆర్ఎస్ పెద్దలు. ముఖ్యంగా ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉండగా.. కోర్టు తీర్పు రావడం.. ఇద్దరూ కారులో షికారుచేస్తున్నవారే కావడంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది అధిష్టానం.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొత్తగూడెంలో విజయం సాధించారు వనమా వెంకటేశ్వరరావు. ఆ తరువాత ఆయన కారు పార్టీలో చేరారు. ఆయన అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపర్చారంటూ స్వల్ప తేడాతో వనమాపై ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు కోర్టులో కేసు వేసి.. విజయం కూడా సాధించారు. వనమాను అనర్హుడిగా నిర్దారించిన హైకోర్టు.. ఐదు లక్షల జరిమానాతో పాటు ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా శిక్ష కూడా విధించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నాలుగు రోజుల క్రితమే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి చేరవేశారు జలగం. అటు ఎన్నికల కమిషన్ కూ కోర్టు ఉత్తర్వులను చేరవేశారు జలగం. అయితే ఈ వ్యవహారంపై రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సి వుండటంతో.. న్యాయ నిపుణులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని స్వీకర్ భావిస్తున్నారు. ఇద్దరు నేతలు పార్టీలోనే కొనసాగుతుండటం వల్ల ఎటూ మొగ్గు చూపలేకపోతోంది బీఆర్ఎస్ అధిష్టానం. ఇదే సమయంలో తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు వనమా ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: రఘునందన్‌రావు దుబ్బాక వదిలేసి మరో నియోజకవర్గానికి మారతారా?

కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండడంతో ఆచితూచి వ్యవహరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేత పొంగులేటి ఏర్పాట్లు చేసుకుంటుండడంతో.. వనమా, జలగం మధ్య జగడాన్ని సున్నితంగా పరిష్కరించాలని చూస్తున్నారు కేసీఆర్. ఇద్దరినీ పార్టీకి లాయల్ గా ఉండేలా చేసుకునే వ్యూహంతోనే క్షేత్ర స్థాయి పరిణామాలు పరిశీలించి ఓ నిర్ణయానికి రావాలని ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏ ఒక్కరికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా.. మరో వర్గం తిరుగుబాటు చేస్తుందేమోనన్న ఆందోళన గులాబీ పార్టీని వెంటాడుతోంది.

Also Read: కేసీఆర్‌తో టచ్ లో కాంగ్రెస్ కీలక నేతలు.. నల్లగొండపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్

మాజీ ఎమ్మెల్యే వనమా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. అప్పుడు సుప్రీం ఇచ్చే ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న జలగం మాత్రం.. ఎట్టి పరిస్ధితుల్లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సిందేననే పట్టుదలతో ఉన్నారట. దీంతో జలగంను ఎమ్మెల్యే పదవి వరిస్తుందా లేదా అన్న సస్పెన్స్ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో స్పీకర్ విచక్షణాధికారాలే ప్రధానం అయినప్పటికీ.. దీనిపై గులాబీబాస్ వైఖరి ఏంటో తేలితేనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు