Marwadi Go Back: మార్వాడీ గో బ్యాక్ పంచాయితీ తెలంగాణలో రోజురోజుకి పెద్దదవుతోంది. మార్వాడీలకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు ఏకమవుతున్నారు. ఈరోజు ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించారు. అయితే మార్వాడీ గో బ్యాక్ ను తప్పుపడుతున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. మార్వాడీ గో బ్యాక్ వెనుక రాజకీయం ఉందా? గో బ్యాక్ ఆందోళనకు ముగింపు ఎప్పుడు? ఎలా? తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆంధ్ర గో బ్యాక్ అని ఎన్నడూ నినదించని చాలా మంది ఉద్యమకారులు ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అని ఎందుకు అంటున్నారు? అసలు ఈ మార్వాడీ గో బ్యాక్ నినాదం ఎత్తుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడే ఇది ఎందుకు మొదలైంది?
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మార్వాడీ గో బ్యాక్ నినాదం రాలేదు, ఇప్పుడు ఎందుకు ఎత్తుకున్నారు?
”తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గమనించాలి. మార్వాడీలు మా ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారు. చేతి వృత్తులు, కుల వృత్తులు, వ్యాపారం అన్నింటిలోనూ మార్వాడీలు ఎక్కువైపోయారు. 98శాతం అన్ని రంగాల్లో వాళ్లే ఉన్నారు. తెలంగాణ వచ్చాక పదేళ్ల కాలంలో రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో మార్వాడీలు వచ్చారు. ఇది ధనిక రాష్ట్రం కావడంతో మార్వాడీల కన్ను పడింది. పరివారం మొత్తం వచ్చేసింది. పలు వ్యాపారాలు పెట్టి ఆధిప్యతం చెలాయిస్తున్నారు. అందులోనూ జీరో మాల్, నకిలీ మాల్ మాల్ అమ్ముతున్నారు. క్రమక్రమంగా వ్యాపారాలు విస్తరించారు. వారు మనసు మార్చుకోవాలి. మేము ఏమైనా తప్పు చేశామా అని ఆలోచన చేయాలి. తెలంగాణలో మాత్రమే కాకుండా ఏపీలో, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఇది పార్టీల వ్యవహారం కాదు. స్థానిక, స్థానికేతర వ్యాపారుల అంశం. పాత వారితో మాకు సమస్య లేదు. గత 10, 15ఏళ్లలో కొత్తగా వచ్చిన వారితోనే సమస్య” అని పిడమర్తి రవి అన్నారు.(Marwadi Go Back)
ప్రధాన డిమాండ్లు..
* ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త షాప్ పెట్టొద్దు. ఇదే మా ప్రధాన డిమాండ్.
* ఇప్పటివరకు వచ్చింది చాలు, దోచుకుంది చాలు.
* కల్తీ లేని వ్యాపారం చేయాలి, జీఎస్టీ కట్టాలి, రసీదు ఇవ్వాలి.
* మార్వాడీల షాపుల్లో మా వాళ్లకు ఉద్యోగాలు కల్పించాలి.
”మేము గుజరాతీ మార్వాడీలం. తెలంగాణలో వందల ఏళ్లుగా ఉంటున్నాం. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. గొడవలు పెట్టుకోవడానికి రాలేదు. కలిసిమెలిసి ఉండాలని బిజినెస్ చేస్తున్నాం. కొన్ని దుష్ట శక్తులు సనాతన ధర్మంపై దాడి చేయాలనే సింగిల్ అజెండాతో ముందుకెళ్తున్నాయి. గుజరాతీలు దేశద్రోహులు అనడం కరెక్టేనా? గుజరాతీ, మార్వాడీ గో బ్యాక్ అనటం కాదు.. మనమంతా భారతీయులం. మనం చెప్పాల్సింది చైనా గో బ్యాక్, వెస్ట్రన్ కల్చర్ గో బ్యాక్. పిజ్జా, బర్గర్, కోకోకోలా, కేఎఫ్ సీ గో బ్యాక్ అని చెప్పాలి. వ్యాపారంలో కాంపిటిషన్ ఉంటుంది. మార్వాడీల సరుకు డూప్లికేట్ అనటం కరెక్ట్ కాదు. అన్ని వ్యాపారులు మేము చేయటం లేదు. 10, 12 వ్యాపారాలే చేస్తున్నాం. డూప్లికేట్ సరుకు అమ్మటం లేదు, జీఎస్టీ కడుతున్నాం. అందరం కలిసి మెలిసి ఉండాలని రాజ్యాంగం చెబుతుంది. ఎవరైనా ఎక్కడైనా నివాసం ఉండొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. డూప్లికేట్ సరుకు అమ్మడం తప్పే. ఎవరు చేసినా తప్పు తప్పే. దానికి పరిష్కారం కనుగొనాలి. అంతేకానీ గో బ్యాక్ అనడం కరెక్ట్ కాదు” అని మార్వాడీల వాదనను వినిపించారు జిగ్నేశ్.
మీరంతా వెళ్లిపోండి అని మేము చెప్పటం లేదు- రాఘవేంద్ర రెడ్డి వ్యాపారి, నల్గొండ
”మార్వాడీ గో బ్యాక్ అంటే.. పాత మార్వాడీలంతా వెళ్లిపోండి అని చెప్పటం లేదు. ఇప్పటివరకు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఎవరినీ వెళ్లిపోమని చెప్పడం లేదు. దొంగ సామాను అమ్మే వాళ్లని, జీఎస్టీ ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్లని వెళ్లిపోవాలని అంటున్నాం. మా పొట్ట కొట్టే వాళ్లని మేము ప్రోత్సహించాలా? మీరంతా వెళ్లిపోండి అని మేము చెప్పటం లేదు. కొత్త వాళ్లు రాకుండా, మా వ్యాపారాలకు ఇబ్బంది కలగకుండా చేయమని మాత్రమే మేము చెబుతున్నాం” అని నల్గొండకు చెందిన వ్యాపారి రాఘవేంద్ర అన్నారు.
Also Read: సహస్ర కేసులో ప్లాన్ అంతా పేపర్ పై రాసుకున్న బాలుడు.. ఆ పేపర్ వైరల్..