చినుకు పడితే చాలు వణికిపోతున్న హైదరాబాద్, నరకం చూస్తున్న జనం.. ఈ దుస్థితికి కారణం ఏమిటి? బాధ్యులెవరు?

floods in hyderabad: వరుసగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. తడిసి ముద్దవుతూ చిగురుటాకులా వణికిపోతుంది. ఈ దుస్థితికి కారణమేంటి..? ప్రజలు ఇంత దారుణంగా అవస్థలు పడడానికి బాధ్యులెవరు..? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివే. కబ్జాకోరులు, అక్రమార్కులు చెరువుల్ని ఆక్రమించేశారు.. వీలైతే వెంచర్లు వేశారు.. కుదిరితే బిల్డింగ్‌లు కట్టేశారు. దీంతో అనగనగా ఓ చెరువు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జడివానకు జడుసుకోవాల్సిన సిట్యువేషన్ వచ్చింది.
నగరంలోని చెరువులు, కుంటల్లో వందల ఎకరాలను ఆక్రమించేశారు. ఈ ఆక్రమణలను కొంతమంది కాలనీలుగా మార్చేసి, జనావాసాలుగా సామాన్యులకు అమ్మేశారు. ఈ కారణంగానే వానపడితే వరద రూపంలో భయంకరమైన ముంపు నగర వాసులను బెంబేలెత్తిస్తోంది. భారీ వర్షాలతో కొన్ని చెరువుల చుట్టూ ఉన్న వందలకొద్ది కాలనీలు తీవ్రమైన ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి.
ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ వందలకొద్దీ చెరువులు:
నగరం.. ఒకప్పుడు చెరువులు, తోటలకు ప్రసిద్ధి. వేర్వేరు ప్రాంతాల్లో నిర్మించిన గొలుసుకట్టు చెరువులతో హైదరాబాద్ పరిసరాలు పచ్చని పంటలతో కళకళలాడేది. వాటిని ఆధారం చేసుకుని విస్తరించిన భాగ్యనగరం.. క్రమక్రమంగా చెరువులను కనుమరుగు చేసింది. చాలా ప్రాంతాల్లో చెరువుల పేర్లతో బస్తీలు, కాలనీలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేది అంటే.. ఇప్పుడెవరూ నమ్మలేని విధంగా పరిస్థితి తయారైంది. అక్రమ లే అవుట్‌లు, అడ్డగోలు నిర్మాణాలు ప్రైవేట్ వ్యక్తులు చేసిన తప్పిదాలైతే.. ఆయా ప్రాంతాల్లో ప్లానింగ్ లేకుండా పేదలకు ఇళ్లు నిర్మించడం మరో తప్పుగా కనిపిస్తోంది.
ఒకప్పుడు పెద్దగా, విశాలంగా ఉన్న రామంతాపూర్ చెరువు ఇప్పుడు గుంటలా మారింది:
రామంతాపూర్ చెరువు ఒకప్పుడు పెద్దగా, విశాలంగా కనిపించేది. కానీ ఇప్పుడు భవనాలు చెరువులోకి చొచ్చుకొచ్చాయి. దీంతో చెరువు కాస్త గుంటలా మారిపోయింది. వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్లల్లోకి నీళ్లు వెళ్లడం సర్వ సాధారణంగా మారింది.
ఇళ్లు కొనుక్కున్న వాళ్లు నరకం చూస్తున్నారు:
నగరంలో ఉన్న చెరువులు కనుమరుగయ్యాయి. అందుకే భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ వరద ఇళ్లల్లో ప్రత్యక్షమవుతుంది. చెరువు ప్రాంతాల్లో లే అవుట్లు చేసి అమ్మడం.. భవనాలు నిర్మించి ఇల్లు విక్రయించారు. దీంతో వానపడితే ఇళ్లు కొనుక్కున్న వాళ్లు నరకం చూస్తున్నారు.
ఎవరో చేసిన తప్పుకి మరొకరు నరకం చూస్తున్నారు:
ఎఫ్ టి ఎల్ పరిధిలో బఫర్ జోన్ లో భారీగా వచ్చిన నిర్మాణాలతో.. చెరువు పరిసర ప్రాంతాల వాసులు వరద ముంపునకు గురవుతున్నారు. ఎవరో చేసిన తప్పిదానికి మరొకరు నరకం అనుభవిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు చాలా చెరువులు ఉండేవి. ఇప్పుడా గొలుసుకట్టు చెరువులన్నీ కనుమరుగయ్యాయి.
నీటి వనరుల విధ్వంసం.. చెరువుల్లో విల్లాలు, అపార్ట్ మెంట్లు:
వరద నీటితో అసాధారణ విధ్వంసాన్ని ఎదుర్కొంటోంది నగరం. వరదలతో బస్తీలు, కాలనీలు నీట మునిగిపోతున్నాయి. చాలా అపార్ట్మెంట్లలో సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్ల వరకు మునిగిపోయాయి. దీంతో పాలు, కూరగాయల్లాంటి నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. సమస్య అందరికీ వస్తున్నా.. బస్తీల్లో పేదలు మాత్రం సర్వస్వం కోల్పోతున్నారు. 70 ఏళ్లుగా జరుగుతున్న నీటి వనరుల విధ్వంసం, చెరువులు, కుంటలను ఆక్రమించి వెలసిన భారీ భవంతులు, విల్లాలు, అపార్ట్మెంట్లతోనే ఈ పరిస్థితి దాపురించింది.
చిన్నపాటి వర్షానికి వరద ముప్పు:
చిన్నపాటి వర్షానికి వరద ముప్పు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చెరువులోకి కొందరు అక్రమంగా చొరబడితే.. మరికొందరికి ప్రభుత్వ అధికారులు అనుమతులు ఇచ్చేశారు. ఇదే సామాన్యుడికి శాపంగా మారింది. చాలా చెరువులు కబ్జాకోరల్లో చిక్కి.. అంతకంతకు చిక్కుకుపోయాయి. చెరువుల పరిరక్షణకు ఉన్న చట్టాలు పటిష్టంగా అమలు చేయకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
1975లో జరిగిన ఓ సర్వే ప్రకారం నగరంలో 159చెరువులు, ప్రస్తుతం వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయికి:
హైదరాబాద్ చుట్టూరా చిన్నాపెద్దా చెరువులుండేవి. దూద్ బౌలి, పుత్లీ బౌలి ప్రాంతాల్లో పెద్ద పెద్ద బావులు కూడా ఉండేవి. 1975లో జరిగిన ఒక సర్వే ప్రకారం చెరువుల సంఖ్య 159గా తేలింది. 2000 నాటికి చెరువుల సంఖ్య 40కి పడిపోయింది. సరిగ్గా 20ఏళ్ల తర్వాత అవి వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యకు చేరాయి. ఉన్న చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. చెరువులు, కుంటలు ఉండాల్సిన చోట కాంక్రీట్ భవనాలు వెలియడంతో నీళ్లు భూగర్భంలోకి చేరే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తితే నగరం నరకం చూస్తోంది.
* ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూరా వందలకొద్ది చెరువులు
* 1975లో జరిగిన ఓ సర్వే ప్రకారం నగరంలో 159చెరువులు
* 2000నాటికి 40కి పడిపోయిన చెరువుల సంఖ్య
* ప్రస్తుతం వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయికి చెరువుల సంఖ్య
* చెరువుల్లో హద్దులు తొలగించి ఆక్రమణలు, నిర్మాణాలు
* చెరువులు, కుంటల్లో వెలిసిన కాంక్రీట్ భవనాలు
* భవనాలు నిర్మించడంతో భూగర్భంలోకి నీళ్లు ఇంకని పరిస్థితి
* వర్షాలు, వరదలొస్తే మునిగిపోతున్న వందలాది బస్తీలు, కాలనీలు
* వరద నీటితో హైదరాబాద్‌లో అసాధారణ విధ్వంసం
* ముంచెత్తుతున్న వరదలతో నరకం చూస్తున్న నగరజనం